ఎన్నికలే లక్ష్యం. విజయం కాదు.

2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించిన కన్నా.. అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. గత నాలుగేళ్లుగా సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందించి దేశ ప్రజలను సగర్వంగా తలెత్తుకునేలా చేశారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ మరో రెండు నెలల్లో ఇంటింటికీ భాజపా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తెదేపా ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరిగాయని, అగ్రిగోల్డ్ ఆస్తులు తమకు అమ్మలేదనే కోపంతోనే ఖాతాదారులు, ఏజెంట్లకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కన్నా ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసింది నవనిర్మాణ దీక్ష కాదని.. నయవంచన దీక్ష అని ఆరోపించారు. గత మూడు దీక్షలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసి… ఈసారి మాత్రం భాజపాను తిట్టేందుకు దీక్ష నిర్వహించారని విమర్శించారు. చంద్రబాబు.. కాంగ్రెసు పార్టీకి అద్దె మైకులా మారారని.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అసమర్థ, అవినీతి పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తే పోలీసు కేసులతో బెదిరిస్తున్నారని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా జన్మభూమి కమిటీలు నియమించారని, ఆ కమిటిలు నాలుగేళ్లుగా ప్రజల్ని అడుగడుగునా దోచుకున్నాయని కన్నా అన్నారు. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజల విశ్వాసం చూరగొని అధికారంలోకి వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com