ఎయిరిండియాకు పైలట్ల మొండిచేయి

జీతాలు సరిగ్గా ఇవ్వని కారణంగా ప్రముఖ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా యాజమాన్యానికి సహకరించబోమని పైలెట్స్‌ యూనియన్‌ ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌(ఐసీపీఏ) నిర్ణయించుకుంది. ఈ మేరకు ఐసీపీఏ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(సీఈసీ), రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(ఆర్‌ఈసీ) ఎయిరిండియా యాజమాన్యానికి లేఖ రాసింది. ‘సరైన సమయానికి వేతనాలు ఇవ్వనందున సంస్థ యాజమాన్యానికి మేమందరం సహకరించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. కనీసం వేతనాలు ఆలస్యమవుతాయని సంస్థ ముందస్తుగా ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. దీనివల్ల మేమంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే యాజమాన్యానికి సహకరించకూడదని ఆర్‌ఈసీ నిర్ణయించుకుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా సరైన సమయానికి వేతనాలు ఇచ్చేంత వరకూ మేం ఇలాగే కొనసాగుతాం’ అని ఆర్‌ఈసీ లేఖలో పేర్కొంది. ఎయిరిండియా మేనేజ్‌మెంట్‌ కనీసం ఉద్యోగుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని ఆర్‌ఈసీ అసహనం వ్యక్తం చేసింది. ‘ఏదైనా ఓ సంస్థ సక్రమంగా పనిచేయాలంటే అందుకు ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం. అటువంటి వాళ్లకు మేనేజ్‌మెంట్‌ ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ, ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. వేతనాలు ఆలస్యం కారణంగా శిక్షణ పొందుతున్న పైలెట్లు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు’ అని ఆర్‌ఈసీ వెల్లడించింది. జూన్‌ రెండో వారం ముగిస్తున్నప్పటికీ ఎయిరిండియా సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు అందలేదు. జీతాలు ఆలస్యం కావడం ఇది వరుసగా మూడోనెల. ఏప్రిల్‌ నుంచి ఎయిరిండియా ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి అందడం లేదు. దీనిపై ఎయిరిండియా మేనేజ్‌మెంట్‌ కూడా ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు. నగదు కొరత కారణంగానే ఎయిరిండియా సిబ్బందికి వేతనాలు ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com