హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)పై మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తొలుత అజారుద్దీన్‌ను అనుమతించలేదు. దీంతో ఆయన సుమారు గంటకు పైగా బయటే నిల్చోవాల్సి వచ్చింది. అజారుద్దీన్‌ను అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత అతన్ని అనుమతించారు. తాజాగా అజారుద్దీన్ తనను సర్వసభ్య సమావేశానికి అనుమతించకపోవడంపై మాట్లాడుతూ.. ‘సుమారు గంటకు పైగా బయటే నిల్చున్నాను. నేను హైదరాబాద్ ఆటగాడిని. అలాగే టీమిండియాకు పదేళ్లు కెప్టెన్‌గా వ్యవహరించాను. క్రికెట్ గురించి తెలియనివాళ్లు హెచ్‌సీఏను నిర్వహిస్తున్నారు. కనీసం వీరు ఎప్పుడైనా వారి జీవితంలో బ్యాట్ లేదా బంతిని కూడా పట్టుకుని కూడా ఉండరు. అలాంటివారు క్రికెట్ సంఘాన్ని నిర్వహిస్తున్నారు. మీరంతా నా సభ్యత్వానికి మద్దతు తెలిపితే.. సమస్యలన్నింటిని నేను పరిష్కరిస్తాను’ అని ఆయన తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా బీసీసీఐ అజారుద్దీన్‌పై జీవితకాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.