ఏకకాలం ఎన్నికల వలన చిన్న పార్టీలు కొట్టుకుపోతాయి

దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికల నిర్వహణకు వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రెండు రోజుల పాటు న్యాయ కమిషన్‌ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ముగిసింది. ఆయా పార్టీల ప్రతినిధులు న్యాయకమిషన్‌ ముందు హాజరై తమ అభిప్రాయాన్ని తెలిపారు. కాగా, కేంద్రంలో అధికార పార్టీ భాజపా, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఇప్పటి వరకు తమ అభిప్రాయాన్ని తెలపలేదు. అభిప్రాయ సేకరణలో భాగంగా తొలిరోజు పాల్గొన్నసీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ విధానం వద్దే వద్దని గట్టిగా చెప్పాయి. జాతీయస్థాయి అంశాల ముందు ప్రాంతీయ అంశాలు కొట్టుకుపోతాయనీ, జాతీయ పార్టీలు తమ డబ్బు బలంతో చిన్న పార్టీలను అణగదొక్కేస్తాయని తృణమూల్‌ తరఫున ఎంపీ కల్యాణ్‌ బంధోపాధ్యాయ చెప్పారు. సీపీఐతో పాటు ఏఐడీయూఎఫ్‌, గోవా ఫార్వార్డ్‌ పార్టీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. ఇక ఎన్డీఏ భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్‌ మాత్రం ప్రతిపాదనను సమర్థించింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే జమిలి ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉందనీ, కొన్ని ఆచరణాత్మక ఇబ్బందుల దృష్ట్యా దానిని 2024లోనే చేపట్టాలని ఆ పార్టీ లోక్‌సభ ఉప సభాపతి ఎం.తంబిదురై చెప్పారు. రెండోరోజైన ఆదివారం నాటి అభిప్రాయ సేకరణలో తెలుగు రాష్ట్రాల నుంచి జమిలి ఎన్నికలపై భిన్న స్పందన వ్యక్తమైంది. జమిలికి తెరాస అనుకూలత వ్యక్తం చేయగా.. జమిలి పేరిట ముందస్తు ఎన్నికలు నిర్వహించడాన్ని తెదేపా వ్యతిరేకించింది. 2019 నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తెరాస అనుకూలంగా ఉందని ఆ పార్టీ ఎంపీ వినోద్‌ న్యాయ కమిషన్‌కు తెలిపారు. ఈ విధానంతో ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల పాలన సుగమంగా సాగుతుందని, పూర్తికాలం పాటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. జమిలి ఎన్నికలు భాజపా రాజకీయ ఎత్తుగడలో భాగమని తెలుగుదేశం పార్టీ ఎంపీలు అన్నారు. ఏకకాల ఎన్నికల నిర్వహణపై న్యాయకమిషన్‌ ఎదుట హాజరైన ఆ పార్టీ ఎంపీలు తోట నరసింహం, రవీంద్రకుమార్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రాంతీయ పార్టీలను అస్థిర పరిచేందుకే భాజపా ఈ కుట్ర పన్నుతోందని అన్నారు. 2019లో వచ్చే సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని, చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ మాత్రం ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటుందని స్పష్టంచేశారు. ఒకవేళ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇక అభిప్రాయం తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ జమిలికి అనుకూలత వ్యక్తం చేసింది. అయితే, 2019 తర్వాత నిర్వహిస్తే మాత్రం తాము అంగీకరించేది లేదని స్పష్టంచేసింది. ఇక తమిళనాడుకు చెందిన డీఎంకే మాత్రం విముఖత వ్యక్తంచేసింది. కాగా, మొదటి నుంచీ ఏకకాల ఎన్నికలకు సుముఖంగా ఉన్న భాజపా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఈ నెలాఖరు వరకు గడువు కోరింది. విపక్షాలతో చర్చించాక నిర్ణయం చెబుతామని కాంగ్రెస్‌ పార్టీ ఇది వరకే స్పష్టం చేసింది. ఏపీలో ప్రతిపక్షమైన వైకాపా ఈ నెల 10న తమ అభిప్రాయం తెలుపుతామంది. ఇక మరో జాతీయ పార్టీ అయిన సీపీఎం.. న్యాయ కమిషన్‌ సమావేశానికి హాజరు కావడం అనవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com