ఏపీ రైతులకు ఇదో మంచి పాఠం

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య చాన్నాళ్లనుంచి ‘రైతు అనుకూల బడ్జెట్‌’లను ప్రవేశపెట్టడంలో పోటీపడుతున్నాయి. రైతులకు రుణాలను మాఫీ చేస్తామనడం, కొన్ని నెలలు గడిచాక మాఫీ చేశామని చెప్పడం కూడా రివాజుగా జరుగుతున్నదే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. చేసిన వాగ్దానాలకూ, వాటన్నిటినీ తీర్చామని చెబుతున్న లెక్కలకూ పొంతన లేకపోవడాన్ని గమనించి, ఆగ్రహించి మహారాష్ట్ర రైతులు మారుమూల గ్రామాలనుంచి ఆరు రోజులపాటు ‘లాంగ్‌మార్చ్‌’ నిర్వహించి ముంబై మహా నగరానికి వెల్లువలా తరలివచ్చారు.

రాష్ట్ర అధికార పీఠం కొలువుదీరిన ‘మంత్రాలయ’ను సోమ వారం దిగ్బంధించడానికి సంసిద్ధులయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిష్టకూ పోకుండా, రైతులను రెచ్చగొట్టకుండా వారడిగిన డిమాండ్లలో పదింటిని నెరవేర్చడానికి లిఖితపూర్వకంగా ఒప్పుకుని సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించింది. పర్యవసానంగా రైతులు ఆ మహానగరం నుంచి ప్రశాంతంగా తమ తమ ప్రాంతాలకు నిష్క్రమించారు. సీపీఎం అనుబంధ సంస్థ అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో సాగిన ఈ యాత్ర అనేకవిధాల విశిష్టమైనది.

చెప్పినవి చేయకపోవటం, పైగా అన్నీ చేశామని దబాయించడం అలవాటుగా మార్చుకున్న పాలకులు ఇలాంటి లిఖితపూర్వక ఒప్పందాలను మాత్రం ఎంతవరకూ ఖాతరు చేస్తారని సంశయిస్తున్నవారు లేకపోలేదు. అలా జరిగినా ఆశ్చర్యం లేదు కూడా. కానీ ప్రశ్నించడాన్నయినా, నిరసనలనైనా అంగీకరించలేని మనస్తత్వం పాలకుల్లో పెరిగిపోతున్న వర్తమానంలో ఫడణవీస్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారు. వారి నిరసన గళం ముంబై వీధుల్లో వినబడనీయకూడదన్న పట్టుదలకు పోలేదు.

ఎక్కడికక్కడ పోలీసుల్ని పెట్టి మార్గమధ్యంలో అరెస్టులు చేయించలేదు. ఆ ఒరవడిలోనే లిఖితపూర్వక ఒప్పందం విషయంలోనూ వ్యవహరిస్తే అది ఆయనకే మేలు చేస్తుంది. లేనట్టయితే రైతులకు వారి పంథా వారికుంటుంది. ఈ రైతులంతా ఆదివాసీలు. ఈ ‘లాంగ్‌ మార్చ్‌’లో యువ రైతులు మొదలుకొని వృద్ధుల వరకూ ఉన్నారు. కొందరు తల్లులు తమ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. కాళ్లకు చెప్పుల్లేనివారూ, అనారోగ్యంబారిన పడినవారూ, కట్టుకోవడానికి సరైన బట్టల్లేనివారూ ఈ 50,000మందిలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్నామంటున్న రుణాలను పొందలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక మొత్తాల్లో అప్పులు చేసి సేద్యం సాగించినవారు.

విత్తనాలు మొదలుకొని ఎరు వులు, పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ పెరిగిన కారణంగా ఖర్చు తడిసిమోపెడై ఊపిరాడని స్థితికి చేరుకున్నవారు. ఈ కష్టాలన్నిటికీ ప్రకృతి వైపరీత్యాలు తోడై చివరకు దిగుబడి సమయానికి పంటలకు గిట్టుబాటు ధర రాక చితికిపోతున్నవారు. ప్రభుత్వాలు అమలు చేసే రకరకాల ప్రాజెక్టుల కార ణంగా కొంపా గోడూ పోగొట్టుకుంటూ నిరాశ్రయులవుతున్నవారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నవారు. అందువల్లే ఈ రైతులు కేవలం రుణమాఫీని మాత్రమే డిమాండ్‌ చేయలేదు.

అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, స్వామి నాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణ యించాలని, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అకాల వర్షాల వల్ల, చీడపీడల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగే మహారాష్ట్ర రైతులు కూడా వరస కరువుల్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని కోటి 37 లక్షలమంది రైతుల్లో 78 శాతంమంది చిన్న, సన్నకారు రైతులు. ప్రభుత్వం అమలు చేశామంటున్న రుణమాఫీతో సహా ఏదీ సక్రమంగా ఈ రైతులకు దక్కలేదు. అందుకే రైతుల్లో ఇంతగా అసంతృప్తి.

ఈ రైతు యాత్రను ‘లాంగ్‌ మార్చ్‌’గా పిలవడం వల్లనో, ఎర్రజెండాలు దండిగా కనిపించడం వల్లనో, ఆదివాసీలు అధికసంఖ్యలో ఉన్నందువల్లనో బీజేపీ ఎంపీ పూనమ్‌ మహాజన్‌కు ఇది ‘మావోయిస్టుల’ యాత్రగా, అందులోని వారు పట్టణ మావోయిస్టులుగా కనబడ్డారు. ఈ రైతు యాత్ర సాగిన వారం రోజులూ ఒక్కటంటే ఒక్క అపశ్రుతి చోటు చేసుకోకపోవడం, అందులో పాల్గొన్నవారంతా ఎంతో క్రమశిక్షణతో మెలగడం అందరినీ ఆకట్టుకుంది. అంత కన్నా ముఖ్యమైనదేమంటే ఈ యాత్రకు పట్టణ, నగర ప్రాంతాల పౌరుల నుంచి వచ్చిన స్పందన. యాత్ర ప్రారంభమైన నాసిక్‌లోగానీ, ఆ తర్వాత ఠాణేలోగానీ, ముంబైలోగానీ ఆ రైతులకు పౌరులు ఘన స్వాగతం పలికిన తీరు అమోఘం.

పాదరక్షలు లేకుండా నిరంతరాయంగా నడవటం వల్ల అరికాళ్లకు పుళ్లు పడి ఇబ్బందిపడుతున్నవారిని గమనించి వాటిని కొనిపంచినవారు కొందరైతే, తమ పాదరక్షల్ని ఇచ్చినవారు మరికొందరు. వివిధ సామాజిక సంస్థల నిర్వాహకులు ఆ రైతుల ఆకలిదప్పుల్ని తీర్చారు. కొన్ని ఆసుపత్రులు, కొందరు వైద్యులు స్వచ్ఛందంగా రైతులకు వైద్య సేవలందించారు. ఈ ఉద్యమం కారణంగా తమ పిల్లల పదో తరగతి పరీక్షలకు అంతరాయం కలుగుతుందని, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం అసాధ్యమవుతుందని తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. అది తెలుసుకుని నిర్వాహకులు యాత్రలో కొన్ని మార్పులు చేసుకున్నారు.

పర్యవసానంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పరీక్ష పూర్తయ్యాక రైతుల దగ్గరకెళ్లి కృతజ్ఞతలు చెప్పారు. కమ్యూనిస్టులంటే ససేమిరా గిట్టని శివసేన ఈ యాత్రకు మద్దతు ప్రకటించడం ఒక విశేషమైతే…తమ పార్టీ ఎంపీ తెలిసీ తెలియక మాట్లాడిన మాటలను బీజేపీ తిరస్కరించడం మరో విశేషం. ఈ ఆందోళన మహారాష్ట్ర పాలకులకు మాత్రమే కాదు… అన్ని రాష్ట్రాల పాలకులకూ హెచ్చరికే. వాగ్దానాలిచ్చి మాట తప్పితే రైతులు మునుపటిలా మౌనంగా ఉండరని, తిరగ బడతారని వారు గుర్తించడం ఉత్తమం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com