ఐటీ రంగానికి నూతన ఏడాది ఓ సరికొత్త పరీక్ష

వీసాల మంజూరు విషయంలో యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలు విధిస్తున్న ఆంక్షలు కారణంగా 2018 సంవత్సరం భారతీయ ఐటీ పరిశ్రమకు కఠిన సవాల్‌ అని నాస్‌కామ్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘2018లో ఐటీ పరిశ్రమకు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. డిమాండ్‌ పరంగా చూస్తే పెద్ద సవాళ్లేమి ఉండకపోవచ్చు. 8 నుంచి 10శాతం వృద్ధితో ఐటీ పరిశ్రమ 150 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే వీసాల జారీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగానే సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. దీంతో పాటు యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాలు కూడా వలసదారులను తగ్గించే ప్రయత్నం చేయటంతో పాటు, వ్యాపారాన్ని మరింత సరళతరం చేయనున్నాయి.’’ అని అన్నారు. భారతీయ ఐటీ పరిశ్రమకు 2017 ఓ ఆసక్తికర సంవత్సరమని మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలరంగం నగదు రూపేణా 8 నుంచి 10శాతం స్థిరమైన వృద్ధిని సాధించడమే కాకుండా గతేడాది అంచనాలను మించిందని తెలిపారు. కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకోవడంతో పాటు, సరఫరా విషయంలోనూ వేగంగా వృద్ధిని కనబరిచిందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవడంలో సవాల్‌ను ఎదుర్కొన్నారని తెలిపారు. ‘యాంత్రీకరణ, కృత్రిమమేథ కారణంగా వృద్ధిరేటు కాస్త తగ్గింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సంరక్షణవాద సంకేతాలు ప్రతికూలంగా మారాయి.’ అని పేర్కొన్నారు. స్టార్టప్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 చివరి నాటికి 5,900 అంకుర సంస్థలను డీఐపీపీ గుర్తించిందని వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com