ఒంగోలు గిత్తకు కష్ట కాలం

వ్యవసాయరంగంలో చోటు చేసుకున్న పరిణామాలు., పెరిగిన యాంత్రీకరణ నేపథ్యంలో పశువుల వినియోగం తగ్గిపోయింది. అదేవిధంగా భారంగా మారిన పోషణ కూడా పశు సంపదపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పూర్వం ఎంతో ఆదరణ పొందిన., వృషభ రారాజు అయిన ఒంగోలు జాతి పశువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కొందరు ఔత్సాహికులు నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శనలు, బంటలాగుడు పోటీలు చీకటిలో చిరుదీపంలా మారాయి. పందెల మోజుతో కొందరు ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తుండగా., మరికొందరు వ్యవసాయంతో పాటు., పోటీలతో  పాల్గొంటూ వీటి పోషణను కొనసాగిస్తున్నారు. ఆహార్యంలో రాజసం., నడకలో ఠీవి. కొండలనైనా లాగిపడేస్తామన్నంత పిక్కబలం. ఇవన్నీ ఒక్క ఒంగోలు జాతి వృషభ రాజానికే సొంతం. తెలుగువారి పశుసంపద విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన ఈ  జాతి ఎద్దులు తెలుగింటికే గర్వకారణం. ఒంగోలు  జాతి ఎద్దుల పేరు వింటేనే రైతులకు తెలియని ఉత్సాహం. అయితే., పశుపోషణ భారంగా మారటం., యాంత్రీకరణ ప్రభావం. కారణాలు ఏవయితేనేం., ఒంగోలు జాతి ఎద్దులు రైతులకు క్రమేపి దూరమయ్యాయి. తెలుగునేలపై పుట్టి ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా పేరుగాంచిన ఈ జాతి వృషభరాజులు పుట్టినిట్టిలోనే అరుదుగా మారిపోయాయి. కొందరి ఔత్సాహికుల వద్ద మాత్రమే ఒకటో రెండో దర్శనమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ సందర్భాల్లో జరుగుతున్న ఎద్దుల బలప్రదర్శనలు, పోటీలు ఒంగోలు జాతి గిత్తల పెంపకం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ పనులకు.., సాగు సీజన్ ముగిసాక పందెం కోసం కొందరు రైతులు వీటిని పెంచుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు మాత్రం., హోదా కోసం పోషిస్తూ., ఒంగోలు జాతి మనుగడను కాపాడుతున్నారు. ఒంగోలు జాతి పశువులను పోషించడంమంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయం.. అందులో పోటీలకు పంపించాలనుకునే గిత్తలను తయారు చేయడం మరింత భారం.. పాల పళ్ళు నుంచి సేద్యపు విభాగం, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ఎక్కడ జరిగినా తమ గిత్తలను తీసుకువెళ్ళేవారు ఉన్నారు… ఇందుకోసం వీటికి ప్రత్యేక శిక్షణ, ఆహారం అందిస్తామని పశుపోషకులు పేర్కొన్నారు.  ఏడాది పొడవునా వీటిని అత్యంత శ్రద్ధతో పోషించాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా సాధారణ ఆహారంతో పాటు., ఉలవలు, రాగి, జొన్న సంగటితో పాటు., ఖర్జూరం, పాలు ఇస్తుంటారు. దీని కోసం ఒక్కో ఎద్దుకు రోజుకు సుమారు 1000 నుంచి 1500రూపాయల వరకు ఖర్చు చేస్తుంటారు. మరోవైపు., ఒక పందెంలో పాల్గొనాలంటే., రవాణా, కూలీలు తదితర కలుపుకొని., 10వేల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అంటున్నారు. అయినప్పటికీ ఈ జాతి పశువుల మీద ఉన్న మమకారం.., ఉత్సాహం కోసం వీటిని పెంచుతూ., పందెల్లో పాల్గొంటున్నామని పోషకులు చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com