ఒకనాటి కూలీ. నేటి ఇస్రో ఛైర్మన్.

ఆరుగాలం పొలంలో మట్టిపిసికిన ఆ చేతులే… అంగారకుడిపైకి రాకెట్‌ని ప్రయోగించాయి. ఆకాశంలోని విమానాన్ని ఒక్కసారైనా దగ్గరగా చూడాలని కోరుకున్న ఆ కళ్లే… 104 ఉపగ్రహాలని రోదసికి పంపి రికార్డు సృష్టించాయి. పదో తరగతి తర్వాత కూలీపనులవైపు వెళ్లిన ఆ కాళ్ళూ… భారత అంతరిక్ష పరిశోధనని ముందుండి నడిపిస్తున్నాయి. ఆ చేతులూ, కళ్లూ, కాళ్లు ఇస్రో కొత్త ఛైర్మన్‌ కె.శివన్‌వి. దక్షిణాదిన కట్టకడపటి జిల్లా.. నాగర్‌కోయిల్‌ మాది. తమిళనాడులో ఉంటుంది. కన్యాకుమారి ఉండేది మా జిల్లాలోనే. భారతదేశంలో మరే ప్రాంతానికీలేని ప్రత్యేకత మాకుంది. మనదేశంలోని ఈశాన్య, నైరుతి రుతుపవనాలు రెండూ ఒకదానివెనక ఒకటి వాన కురిపించే ప్రాంతం మాది. అంటే ఏడాదిలో దాదాపు ఎనిమిదినెలలు వర్షంతో తడిసే ఉంటుంది ఇక్కడి నేల. అందువల్ల మా పొలాలన్నీ ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లా ఒకట్రెండు సార్లు అరక దున్ని నాట్లు వేయాలంటే కుదరదు. నేలలో బురదే ఎక్కువ కాబట్టి ప్రతిరోజూ పలుగూ పారతో పొలాన్ని పదును చేస్తూ ఉండాలి. అందుకే సేద్యం చేసే రైతుతోపాటూ ఎంతోమంది కూలీలూ ప్రతిరోజూ పనిలో ఉంటారు. నేనూ అలా చేసినవాణ్నే. మా ఊరు సరక్కల్‌విళైలో ఉన్న సర్కారు బడిలోనే నా చదువు సాగింది. నాకు పన్నెండేళ్లు వచ్చినప్పటి నుంచీ బడి పూర్తికాగానే నేనూ చేలల్లోకే వెళ్తుండేవాణ్ణి. చిన్నపాటి రాళ్లతో నిండిన గట్టి బురద ఉంటుంది ఆ పొలాల్లో. పలుగు పట్టుకుని ఒక్కపూట పనిచేసినా మళ్లీ పైకి లేవలేం! నాకలా ఒళ్లు నొప్పులుగా అనిపించి ‘ఈరోజు మానేద్దాంలే..’ అనుకున్నప్పుడల్లా నాన్న మాటలే గుర్తుకొస్తుండేవి. ‘ఒరే నువ్వెంతకైనా చదువుకో.. కాదన్ను. కానీ అందుకయ్యే ప్రతి పైసా నువ్వే సంపాదించుకుని తీరాలి!’ అనేవాడు. పాపం.. ఆయన నిస్సహాయత ఆయనది.

ఇంజినీరింగ్‌కి వెళ్లలేకపోయా..
ఇంట్లో మేం నలుగురం సంతానం. నాన్నకున్నది ఎకరం పొలం. ఆ ఒక్కదానితో అమ్మానాన్నలు సహా ఆరుగురి పొట్ట నింపాలంటే అయ్యేది కాదు. అందువల్ల నాన్న వ్యవసాయంతోపాటూ మామిడిపళ్ల వ్యాపారం కూడా చేసేవారు. అయినా సరిపోయేది కాదు. అందుకే డిగ్రీ దాకా నాకు పొలం పనులకి వెళ్లక తప్పలేదు. పొలం పనులకి కాకుంటే.. నాన్న కౌలు చేస్తున్న మామిడి తోపుల్లోకి వెళ్లి పళ్లు కోసి మూటగట్టుకుని వస్తుండేవాణ్ణి. అందువల్లనో ఏమో నేను మన మట్టిని ఎంతో ప్రేమించాను. ఇక ఆకాశం విషయానికొస్తే… ఎప్పుడైనా విమానాన్నో, తెల్లటి పొగతోకతో పోతూ ఉండే రాకెట్‌నో చూసి గంతులేసిన జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. రాకెట్‌ గురించి తెలియదుకానీ ఒక్కసారైనా విమానాన్ని నేలపైన దగ్గరగా చూడాలని ఎంతగా ఆశపడ్డానో. పీయూసీ పూర్తయ్యాక ఇంజినీరింగ్‌ చేయాలనుకున్నా.. మా పరిస్థితి అప్పట్లో అస్సలు బాగాలేదు. అందువల్ల ఇక్కడి మా జిల్లా కేంద్రంలోనే ఉన్న ఎస్టీ హిందూ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్‌లో చేరాను. చదువూ, పొలం పనులు తప్ప నాకు ఇంకో ప్రపంచం ఏముంది? అందుకే డిగ్రీలోని నాలుగు సబ్జెక్టుల్లో వందకు వందశాతం మార్కులు తెచ్చుకున్నాను. మా కుటుంబంలోనే తొలి పట్టభద్రుణ్ణయ్యాను. తర్వాత ఏం చేయాలో తెలియక.. మళ్లీ పొలం పనులకే వెళ్లడం మొదలుపెట్టా.

మరో అవకాశం..
ఎవరో నా మార్కుల గురించి మద్రాసు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కి సిఫార్సు చేశారు. ఆ సంస్థ ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో బీఈ చేసే అవకాశమిచ్చింది. అబ్దుల్‌కలాం కూడా అక్కడి విద్యార్థే. కాకపోతే నాకంటే పాతికేళ్లు సీనియర్‌! స్కాలర్‌షిప్‌ ఇస్తారు సరే.. ముందు ఫీజు కట్టాలికదా! అది కూడా కట్టలేని పరిస్థితి మాది. అప్పుడే నాన్న నేనస్సలు ఊహించని ఓ పని చేశాడు. మాకున్న ఎకరం పొలంలో కొంత భాగాన్ని అమ్మేశాడు. ఆ డబ్బు తెచ్చి ఫీజుకని నా చేతిలో పెట్టాడు. చిన్నప్పటి నుంచీ ప్రతి కాణీకీ లెక్కలేసే నాన్న.. ఎన్ని కష్టాలొచ్చినా పొలం అమ్మేదిలేదని తెగేసి చెప్పినాయన.. నాకోసం దాన్ని అమ్మేసిన రోజు నాకు కన్నీరాగలేదు. ఆ ప్రేమ, ఆయన శ్రమ వల్లే మట్టిలో బతికిన నేను.. ఆకాశంపై చూపులు సారించగలిగాను.

విమానాన్ని చూసింది అక్కడే..
చెన్నైకి వెళ్లాక కూడా నాకు విమానాన్ని నేరుగా చూసే అవకాశం రాలేదు. ఎంఐటీలో దాని విడిభాగాలని మాత్రమే చూశాను.
అలా బీఈ పూర్తిచేశాను. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్సీ)లో ఎంఈ చేరాను. అదిగో.. అక్కడే నేను తొలిసారి నేలపై విమానాన్ని చూశాను. ఓ పె..ద్ద కొంగలా తెల్లగా మిలమిలాడుతూ ఉన్న దాన్ని చూసిన నాటి ఉద్వేగం ఇంకా గుర్తుంది నాకు. తర్వాతి రోజుల్లో రాకెట్‌ని చూసినా నాకంత సంబరంగా అనిపించలేదంటే నమ్మండి! ఐఐఎస్సీలో నేను చేసిన ప్రాజెక్టు చూసి అమెరికా, రష్యా నుంచి ఎన్నో ఉద్యోగ ఆహ్వానాలు వచ్చాయి. నాకు ఈ మట్టి నుంచి దూరం కావడం ఇష్టంలేక వద్దన్నాను. అంతరిక్ష పరిశోధనల్లో అప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఇస్రోపైనే నా మనసుపడింది. ఇస్రోలో జూనియర్‌ సైంటిస్టుగా అడుగుపెట్టాను. అది 1982 సంవత్సరం. పీఎస్‌ఎల్‌వీపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అది మనదేశం తొలిసారి పూర్తిస్థాయి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన వాహక నౌక.
రోదసికి మనదేశం పంపిన ఓ పెద్ద ప్రేమలేఖ.. అనీ మాలో మేం అనుకునేవాళ్లం. ప్రేమలేఖంటే గుర్తొచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాకే నాకు పెళ్లైంది. నా భార్య మాలతి చెన్నైలో ఉపాధ్యాయినిగా ఉండేవారు. మాకిద్దరు పిల్లలు. చిన్నవాడు సుశాంత్‌ యానిమేషన్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. పెద్దవాడు సిద్ధార్థ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

పీఎస్‌ఎల్‌వీతోబాటే ఎదిగా..
మీకో విషయం తెలుసా? సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో.. మిగతా అన్ని ప్రభుత్వ సంస్థలకంటే ఇస్రో ఎంతో ముందంజలోనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా విరివిగా ఉపయోగిస్తున్న క్లౌడ్‌ సిస్టమ్‌, డేటా అనలటిక్స్‌ ఇవన్నీ మొదట ఇస్రో నుంచే మొదలయ్యాయని చెప్పొచ్చు. ఎందుకో రాకెట్‌ విడిభాగాల రూపకల్పన, నిర్మాణంపైకన్నా నా దృష్టి ముందు నుంచీ ఆ రాకెట్‌ని నడిపించే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌పైనే ఉండేది. అందుకే మా సీనియర్‌ కలాంగారు ఎప్పుడూ నన్ను ‘మిస్టర్‌ సాఫ్ట్‌వేర్‌’ అనే పిలుస్తుండేవారు! అలా పీఎస్‌ఎల్‌వీకి ఆకృతినవ్వడంలోనూ.. ఆకాశంలో నిర్దేశిత లక్ష్యాన్ని అందుకోగల వేగాన్నివ్వడంలోనూ నేను చురుగ్గా పాల్గొన్నా. నిజానికి నా ఎదుగుదల పీఎస్‌ఎల్‌వీతోపాటే సాగిందని చెప్పాలి. తొలిసారి దాన్ని అంతరిక్షంలోకి పంపినప్పటి ఆ ఉద్విగ్నం ప్రతిసారీ ఉంటూనే ఉంది. పీఎస్‌ఎల్‌వీతో నేను చేసిన ప్రయోగాలే నన్ను స్వదేశీ క్రయోజనిక్‌ సాంకేతికతతో పనిచేసే జీఎస్‌ఎల్‌వీ రూపకల్పన ప్రాజెక్టుకీ డైరెక్టర్‌ని చేశాయి. అక్కడి విజయమే నా జీవితంలో పెద్ద మలుపు.
ఆ తర్వాత ‘విక్రమ్‌ సారాభాయ్‌’ కేంద్రానికి డైరెక్టర్‌నైనా, అంగారకుడిపైకి పంపిన ‘మామ్‌’ ప్రాజెక్టుకి నేతృత్వం వహించినా, గత ఫిబ్రవరిలో ఒకేసారి 104 ఉపగ్రహాలని నింగిలోకి తీసుకెళ్లిన రికార్డు ఫీటుని ముందుండి నడిపించినా.. ఆ తొలి విజయం అందించిన ఆత్మవిశ్వాసంతోనేనని చెప్పాలి.

ఎన్నో కలలున్నాయి..
ఇస్రోకి నన్ను ఛైర్మన్‌గా చేశారని వినగానేమానసికంగానే కాదు శారీరకంగానూ కదిలిపోయాను. నా శరీరం వణికిపోయింది. మహామహులు కూర్చున్న కుర్చీ కదా అది! ఆ స్థానంలోకి నేను వెళ్లడం ఉద్వేగంగా అనిపించింది. నా ముందు ఎన్నో పెద్ద లక్ష్యాలున్నాయి. లక్ష్యాలనే బదులు కలలంటే బావుంటుంది. ప్రస్తుతం మనం ఓ రాకెట్‌ని నింగిలోకి పంపిస్తే.. అది ఉపగ్రహాలని ఆకాశంలోకి వదిలాక, దానికదే విచ్ఛిన్నమైపోతుంది. అలాకాకుండా దాన్ని మళ్లీ ఉపయోగించగలిగేలా రూపొందిస్తే మనకు ఇప్పుడు ఓ రాకెట్‌ ప్రయోగానికి అవుతున్న ఖర్చు పదోవంతు తగ్గొచ్చు. దానికి సంబంధించిన రీ-యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌(ఆర్‌ఎల్‌వీ)- టీడీ ప్రాజెక్టు ఇప్పుడు మా ముందున్న లక్ష్యాల్లో ఒకటి. ఇంకా చంద్రయాన్‌-2, అతిశక్తిమంతమైన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 కోసం మేం పరుగులెత్తాల్సిన సమయం ఇది. మానవసహిత అంతరిక్షయానం.. భారతదేశంలోని ప్రతిపౌరుడి ఉమ్మడి కల! దాని నెరవేర్చేందుకు నా వంతుగా అన్ని ప్రయత్నాలూ చేస్తా. నాకు ఆదర్శమంటూ ఎవరూలేరు. నాకు కొత్త విషయాలు నేర్పించిన ప్రతివాళ్లనీ గురువులుగానే భావిస్తా. నేను చూసే ప్రతి వ్యక్తి నుంచి కొత్తవి నేర్చుకుంటూ ఉంటా. మా ఊరి దేవత భద్రకాళియమ్మ నా ఇష్టదైవం. ప్రతి పెద్ద రాకెట్‌ ప్రయోగానికి ముందు ఆమెని దర్శించుకుంటా. నావంతు ప్రయత్నం చేసి.. ‘ఫలితాన్ని నువ్వే చూసుకో తల్లీ!’ అని నిశ్చింతగా ఉండిపోతా.

6డీ ‘సితార’ సృష్టికర్త..!
ఇస్రోలోని ప్రతి రాకెట్‌ శాస్త్రవేత్తకీ ఇష్టమైన పదం సితార! ఏమిటిదీ అంటే.. ఇప్పుడు ప్రతి ఇంజినీరింగ్‌ కాలేజీలోనూ కంప్యూటర్‌ ‘సిమ్యులేషన్స్‌’ ఉంటున్నాయి కదా! మనం తయారుచేసే వాహనమో, ఎలక్ట్రానిక్‌ పరికరమో, ఇంకేదైనా పెద్ద యంత్రమో వాస్తవంలో(రియల్‌టైమ్‌) ఏ రకంగా ఎంత వేగంగా పనిచేస్తుందో చూసే సాఫ్ట్‌వేర్‌ ఇది. ఇస్రోలోనూ ఓ ఉపగ్రహాన్నో, రాకెట్‌నో ప్రయోగించడానికి ముందు అది పనిచేసే తీరుని పరీక్షించి, పర్యవేక్షించడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేరే ఈ సితార(సాఫ్ట్‌వేర్‌ ఫర్‌ ఇంటగ్రేటెడ్‌ ట్రాజెక్టరీ అనలిసిస్‌ విత్‌ రియల్‌టైమ్‌ అప్లికేషన్‌). దీని రూపశిల్పి శివనే. ఇప్పుడు మనకు బయట దొరికే సిమ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌లు కేవలం 3-డీ రూపంలో ఉంటాయి. కానీ సితార 6డీ! దీన్ని కూడా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఘనత శివన్‌ది. నాసా, రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థలకి దీటుగా మనకూ ఈ సదుపాయాన్నీ తీసుకొచ్చారు ఆయన.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com