ఒక్క పాయింట్ తేడాతో ఓడిన సింధు

మరో పాయింటు గెలిస్తే ఇండియా ఓపెన్‌ మళ్లీ సింధుదే..! ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లు గెలిచిన అనుభవం ఆమెది. కానీ ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు చుక్కెదురైంది. సొంతగడ్డపై ఇండియా ఓపెన్‌ టైటిల్‌ నిలబెట్టుకోవాలనుకున్న ఆమె ఆశలపై అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ నీళ్లు చల్లింది. ఆదివారం హోరాహోరీ సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 18-21, 21-11, 20-22తో బీవెన్‌ చేతిలో పోరాడి ఓడింది. గంటా 9 నిమిషాల పోరులో సింధు, జాంగ్‌ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కిక్కిరిసిన స్టేడియంలో భారీ అంచనాల మధ్య ఫేవరెట్‌గా బరిలో దిగిన సింధు స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమైంది! తీరిక లేని షెడ్యూల్‌ లేదా మరో కారణమో గానీ సింధు తొందరగా అలసిపోయినట్లు కనిపించింది. సుదీర్ఘ ర్యాలీలు ఎక్కువగా ఉండటం కూడా అందుకు కారణమే. తొలుత వెనకబడినా ఆ తర్వాత సింధు పుంజుకోవడంతో మ్యాచ్‌లో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి గేమ్‌లో ఒకదశలో 15-14తో సింధు ముందంజలో ఉంది. ఐతే వరుసగా 3 పాయింట్లతో ప్రత్యర్థి 17-15తో ముందుకెళ్ళింది. ఒక పాయింటుతో సింధు ప్రత్యర్థి ఆధిక్యాన్ని 16-17కు తగ్గించింది. ఈ సమయంలో తొలుత జాంగ్‌.. తర్వాత సింధు రెండేసి పాయింట్లు సాధించారు. అయినా 19-18తో గేమ్‌ ప్రత్యర్థి పక్షం వైపే ఉంది. చివరికి 21-18తో తొలి గేమ్‌ ప్రత్యర్థి సొంతమైంది. రెండో గేమ్‌లో సింధు చెలరేగింది. దూకుడుగా ఆడుతూ జాంగ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టింది. వరుసగా పాయింట్లు రాబడుతూ 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. జాంగ్‌ అడపాదడపా పాయింట్లు గెలిచినా సింధును సమీపించలేకపోయింది. మరింత దూకుడుగా ఆడిన సింధు 21-11తో రెండో గేమ్‌ దక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ సమానంగా తలపడ్డారు. మొదట్లో ప్రత్యర్థే కాస్త ఆధిపత్యం కనబరిచింది. బాగా అలసిపోయిన సింధు శక్తినంత కూడదీసుకుని ఆడింది. 15 పాయింట్ల వరకు స్కోర్లు సమమవుతూ వచ్చాయి. స్మాష్‌లతో విజృంభించిన జాంగ్‌ 19-17తో ముందంజ వేసింది. సింధు కూడా స్మాష్‌లతో చెలరేగి 19-19తో పాయింట్లను సమం చేసింది. ప్రత్యర్థి షటిల్‌ను బయటకు ఆడటంతో 20-19తో సింధు మ్యాచ్‌ పాయింటుకు చేరువైంది. ఐతే సింధు అనవసర తప్పిదంతో 20-20తో పాయింట్లు సమమయ్యాయి. తర్వాతి షాట్‌ను స్మాష్‌గా మలిచిన జాంగ్‌ 21-20తో మ్యాచ్‌ పాయింటుకు దగ్గరైంది. ఏకాగ్రత కోల్పోయిన సింధు షటిల్‌ను బయటకు ఆడటంతో 22-20తో మూడో గేమ్‌, మ్యాచ్‌ ప్రత్యర్థి సొంతమయ్యాయి. నిరుడు విజేతగా నిలిచిన సింధు.. ఈసారి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలల్లో మేజర్‌ టోర్నీ ఫైనల్స్‌లో సింధుకు ఇది నాలుగో ఓటమి. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, హాంకాంగ్‌ ఓపెన్‌, దుబాయ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో ఆమె పరాజయం పాలైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com