ఓట్స్ ఈజ్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

బిజీ లైఫ్ అనేది ఈరోజుల్లో సర్వసాదారణమైపోయిన అంశం. ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన మనిషి ఒక్కోసారి రాత్రి రెండైనా నిద్రకు ఉపక్రమించలేనంతటి దుస్థితి. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారానికి కూడా నిర్దిష్టమైన సమయం కేటాయించలేక, తీసుకునే ఆహారంలో కాలరీల సంఖ్య అధికమవడం వలన, ఊబకాయానికి గురవడమే కాకుండా ఫాట్సో లాంటి బిరుదులతో బ్రతుకుబండి ఈడుస్తున్నారు. అవునా? ఈ సర్వసాధారణమైన సమస్యను పరిష్కరించడానికి, మన విలువైన సమయాన్ని వృధా చేయకుండా, శరీరంలోని చెడు కొవ్వు నిల్వలు తగ్గించడానికి, మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఒక మార్గం ఉంది. ఈ ఊబకాయానికి కారణమయ్యే అనేక అంశాలకు ఒకే ఒక్క సమాధానం ఓట్స్. ఇటీవలి కాలంలో యువత ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ మరియు నిలువ ఉంచిన ఆహారపదార్ధాలవైపు మొగ్గుచూపడం కాస్త భాదాకరమైన విషయo. ఒకవేళ ఇంట్లో అల్పాహారం చేస్కోవాలని ఆలోచిస్తే, 2 నిమిషాల నూడుల్స్ అంటూ ఆలోచనలు చేస్తున్న కాలమిది. అధిక బరువును, వికారమైన పొట్ట, తొడలను కరగదీయాలన్న ఆలోచన ఉన్నవారు ముందుగా చూసే అల్పాహారం ఓట్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పోషకాలను పూర్తిస్థాయిలో అందివ్వడమే కాకుండా, ఇతర జంక్ మరియు చీజీ, యమ్మీ, నోరూరించే అనారోగ్య కొవ్వు ఆహార పదార్ధాల మూలంగా కలిగే అధిక కాలరీలను తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. అధిక బరువు అనేది అనేక వ్యాధులకు ప్రధాన కారకం. అనగా రక్తపోటు, మధుమేహం , అజీర్ణ సమస్యలు మొదలైన సాధారణ దీర్ఘకాలిక సమస్యలకు ప్రధాన హేతువుగా ఈ ఊబకాయం ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలలో కనిపించే అనేకములైన సాధారణ వ్యాధులు ఊబకాయం వలనే సంభవిస్తున్నాయి అనడంలో ఏమాత్రం ఆశర్యం లేదు. ఓట్స్ బరువును తగ్గించటానికి సిఫార్సు చేయబడిన అత్యంత సులభమైన ఆహారం. ఎక్కువ మొత్తంలో పోషక విలువలు ఉండడమే కాకుండా, మానవ శరీరం యొక్క ప్రాధమిక పోషక అవసరాన్ని తీర్చటానికి సూచించదగ్గ ఆరోగ్యకరమైన ఆహారపదార్ధంగా ఉన్నది.
కొన్ని అధ్యయనాల ప్రకారం, వారంలో 5 సార్లు కనీసం ఓట్స్ ఆహారంగా తీసుకోవడం మూలంగా, శరీరంలోని క్రొవ్వులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతాయని తేలింది. ఓట్స్, మానవ శరీరంలోని చెడు కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కండరాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది కూడా.

ప్రతిరోజూ ఆహారంలో ఓట్స్ ఎందుకు తీసుకోవాలి?

1.ఓట్స్, అధిక నీటి నిల్వలను నియంత్రించే తక్కువ పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఓట్స్ మన నడుము యొక్క చుట్టుకొలతను తగ్గించడంలో సహాయం చేస్తుంది, అంతే కాకుండా జీవక్రియల రేటును పెంచడం ద్వారా శరీరానికి ఊబకాయం వలన కలిగే రోగాలను సైతం దరిచేరనీయకుండా చూడగలదు.

2.ఒక కప్పు ఓట్స్ 4-5 గ్రాముల ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ఫైబర్ చెడు కొవ్వులను నిల్వ చేసుకున్న కణజాలాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నిజానికి ఈ కణజాలాలు నిల్వ ఉంచుకున్న కొవ్వు మన శరీరo యొక్క అసాధారణ ఆకృతికి కారణమవుతుంది. కణజాలాలలోని చెడుకొవ్వును కరిగించడమే కాకుండా, కణజాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

3.ఇక పోషకాల విషయాల గురించి మాట్లాడితే, ఓట్స్ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లలో పుష్కలంగా నిండి ఉంటాయి. దీనిలో ప్రధానంగా రెండు ప్రత్యేకమైన పోషకాలు ఉన్నాయి, అవి (1) బీటా గ్లూకాన్స్ మరియు (2) స్టెరోయిడల్ సఫోనిన్లు. బీటా గ్లూకాన్స్ ఒక రకమైన కార్బోహైడ్రేట్.

4.ఓట్స్ జీర్ణమయ్యే ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. ఓట్స్ నెమ్మదిగా జీర్ణమవుతుంది, అందువల్ల ఇవి రక్తపోటుపై మిగిలిన ఆహారాలవలె ఎక్కువ ప్రభావం చూపదు. సాధారణంగా ప్రజలలో కనిపించే కొలెస్ట్రాల్ సమస్యలను సరైన మోతాదులో రోజూవారీ ఆహారప్రణాళికలో భాగంగా తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు.

రక్తపోటు, మధుమేహం మరియు ఊబకాయం వంటివి బరువు పెరుగుట వల్ల కలిగే సర్వసాధారణమైన రోగాలు. కావున మీ శరీరంలోని కొవ్వులను నియంత్రణలో ఉంచుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన చర్య. ఆహార ప్రణాళికలో భాగంగా ఫైబర్ మరియు పోషకాలతో, తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఓట్స్ రోజూవారీ తీసుకోవడం మూలంగా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఒకప్పుడు ఓట్స్ అంటే ఒకరకమైన హేయభావం ఉండేది. రోగుల ఆహారమని పిలిచేవారు కొందరు. మార్కెట్లో కూడా అంత తేలికగా లభ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఓట్స్ లేని కిరాణా దుకాణం లేదు అంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఓట్స్ విలువ ప్రజలకు తెలియడమే. మొదట్లో తక్కువ సమయంలో తయారయ్యే ఆహారపదార్ధంగా ప్రజలు భావించినా, రుచి పరంగా, ఆరోగ్య సంబంధిత లక్షణాల కారణంగా నెమ్మదిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంది. అనేకమంది ఇళ్ళల్లో ఓట్స్ అనేది సాధారణ ఆహారం. ముఖ్యంగా అల్పాహారంగా తీసుకొనుటకే ఎక్కువ మొగ్గు చూపుతారు. సులభరీతిలో జీర్ణమవడమే కాకుండా, శరీరంలోని జీవక్రియల రేటును పెంచడంలో, అనేక అనారోగ్యాలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా రాకుండా అడ్డుకోగలదు.

కానీ ఊబకాయం తగ్గడానికి ఓట్స్ ఒక్కటే సరిపోదు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నిలువ ఉంచిన ఆహారపదార్ధాలను, డీప్ ఫ్రై వంటి అధిక నూనెలు కలిగిన పదార్ధాలను, అధిక కాలరీలు, పిండిపదార్ధాలు కలిగి ఉన్న పదార్ధాలను దూరంగా ఉంచడం ఎంతో మంచిది. అంతేకాకుండా రోజూవారీ వ్యాయామం, కంటి నిండా నిద్ర, సమయానుసారం సరైన మోతాదులో పోషకాలతో నిండి ఉన్న ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వంటివి కూడా ముఖ్యమే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com