ఓ వికలాంగ కుమారుడు. ఓ కసాయి తండ్రి. ఓ వినూత్న హత్య.

చేతికి అంది వచ్చే వయసున్న కొడుకును అనారోగ్యం వెంటాడుతోంది. భారంగా మారాడన్న భావనతో అతడిని స్వయంగా కన్నతండ్రే హతమార్చాడు. ఏడాది కిందట జరిగిన ఘటన పోలీసు దర్యాప్తులో ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వందలాది ‘అదృశ్యం’ కేసులను పోలీసులు శోధించారు. ఏడుగురు తల్లిŸŒండ్రులకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేశారు. అయినా మృతుడు ఎవరో తెలియలేదు. ఎట్టకేలకు ప్రారంభించినచోటే మళ్లీ మొదలెడితే మృతుడి వివరాలు తెలిశాయి. నిందితుడూ దొరికిపోయాడు. హత్యకు కారణం తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. హృదయవిదారకమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కేసు వివరాలివి. కందులాపురం గ్రామానికి చెందిన కుల్లూరి శ్రీనివాసరావుకు ముగ్గురు కొడుకులు. పెద్దవాడు వెంకట్రావుకు 14 ఏళ్ల నుంచే మూర్ఛ వ్యాధి ఉంది. ఎందరు వైద్యులకు చూపించినా జబ్బు నయం కాలేదు. 23 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ వ్యాధి వెంటాడుతూనే ఉంది. కుటుంబభారం మోయాల్సిన కొడుకు బరువైపోయాడని తండ్రి అంటుండేవాడు. చంపేస్తే సమస్య తీరుతుందనే దారుణ నిర్ణయానికి వచ్చాడు. గతేడాది నవంబరు 15 అర్ధరాత్రి వేళ ఫిట్స్‌ వచ్చినప్పుడు కొడుకును స్వయంగా కన్నతండ్రే శ్మశానానికి మోసుకెళ్లాడు. అక్కడే కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహంపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయి ఉంటాడని తన కుటుంబసభ్యులతోపాటు చుట్టుపక్కల వారినీ నమ్మించాడు. శ్మశానంలో శవం సగమే కాలింది. దీనిపై హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం సగం కాలిపోవడంతో దర్యాప్తు క్లిష్టంగా మారి మృతుడెవరో తెలియలేదు. జిల్లాలో నమోదైన ‘అదృశ్యం’ కేసులను తొలుత పరిశీలించినా కూపీ లభించలేదు. పోలీసు శాఖలోని క్రైమ్‌ అండ్‌ క్రిమినల్స్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌(సీసీటీఎన్‌ఎస్‌) ద్వారా తెలుగురాష్ట్రాల్లో నమోదైన మరో 1200 కేసులనూ శోధించారు. చివరకు స్థానికంగానే ఆరా తీయగా శ్రీనివాసరావు కుమారుడు వెంకట్రావు ఏడాదిగా కనిపించడం లేదని తేలింది. దీనిపై అప్పట్లోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదనే అనుమానంతో పోలీసులు కూపీ లాగారు. మృతుడి తండ్రి శ్రీనివాసరావును డీఎన్‌ఏ పరీక్షకు పిలవగా.. ఏదో ఒక వంకతో వాయిదా వేయసాగాడు. దీంతో పోలీసుల అనుమానం బలపడింది. పట్టుబట్టి పరీక్ష నిర్వహిస్తే విషయం తేలిపోయింది. అనారోగ్యంతో కొడుకు పడుతున్న బాధలు చూడలేకే హత్య చేశానని శ్రీనివాసరావు అంగీకరించాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com