ఔషధ మొక్కల వివరాలు

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లిష్ మందుల ప్రభావం మనపై ఎక్కువగా ఉంది. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుని దగ్గరికెళ్లడం లేదా సొంత వైద్యం చేసుకోవడం అధికమైంది. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు తమ ఇళ్లు లేదా పరిసరాల్లో పెంచుకునే పలు మొక్కలనే తేలికపాటి సమస్యలకు ఔషధాలుగా ఉపయోగించేవారు. వాటితో పలు రకాల రసాలు, చూర్ణాలు తయారుచేసి ఉపయోగించేవారు. కానీ కాంక్రీట్ జంగిల్గా మారిన నేటి అధునాతన ప్రపంచంలో సాధారణ మొక్కలను పెంచడమే బాగా తగ్గిపోయింది. ఇక ఔషధ మొక్కల గురించి పట్టించుకోవడం దాదాపుగా మానేశారనే చెప్పవచ్చు.కింద పేర్కొన్న పలు మొక్కలను మన ఇళ్లలో, నివాస స్థలాల్లో పెంచుకుంటే వాటిని స్వల్ప అనారోగ్యాలకు ఔషధ మొక్కలుగా బాగా ఉపయోగించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. తులసి
అనేక మంది ఇండ్లలో ఈ మొక్కను కుండీల్లో పెంచుతారు. దీనికి సర్వరోగ నివారిణి అనే పేరుంది. తులసి ఆకులు రుచికి వగరుగా, చేదుగా సువాసన కలిగి ఉంటాయి. అయినప్పటికీ వీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. 6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుంచి రసం వడ కట్టి అరస్పూన్ తేనెతో కలిపి రోజులో 2 సార్లు 3 నుంచి 4 చుక్కల మోతాదులో తీసుకుంటే గొంతు గరగర తగ్గిపోతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. జలుబు, దగ్గు ఉంటే రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది. పరగడుపునే 2,3 తులసి ఆకులను కొన్ని రోజుల పాటు నమిలితే ముక్కు దిబ్బడ వంటి శ్వాస సమస్యలు తొలగించబడతాయి. తులసి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధకశక్తి కలుగుతుంది. గాలిని శుభ్రం చేస్తూ క్రిమ కీటకాలను దూరం తరిమే గుణం దీనికి ఉంది. ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమలు ఉండవు.
2. కలబంద
కుండీల్లోనూ, నేలపైన పెంచుకోవడానికి సౌకర్యవంతంగా ఉండే కలబంద (అలోవేరా) గుబురుగా పెరగడంతోపాటు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కలబంద గుజ్జను పసుపుతో కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకుంటే జీర్ణకోశంలోని క్రిములు తొలగించబడతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. క్లోమగ్రంథిని కలబంద శుద్ధి చేస్తుంది. కాలేయం సక్రమంగా విధులు నిర్వహించేలా చేయడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో, నేత్ర సంబంధ వ్యాధులను తగ్గించడంలో, కాలిన గాయాలు, దీర్ఘ కాలిక పుండ్లకు, ప్లీహం, కాలేయం, మూత్రకోశ సంబంధ వ్యాధుల్లో, గర్భాశయ, రుతు సంబంధ చికిత్సలకు కలబంద ఉపయోగపడుతుంది. కలబంద ఆకుల నుంచి తయారయ్యే ‘ముసాంబ్రం’ అనే పదార్థం నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.
3. పుదీనా
కుండీల్లోనూ, నేలపైన అల్లుకుని పుదీనా పెరుగుతుంది. దీంట్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. 10-15 పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో ఉడికించి, వడకట్టి, చల్లార్చి దానికి చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు తగ్గుతాయి. కాలేయం, క్లోమ గ్రంథిని శుభ్రం చేస్తుంది. దగ్గు, తుమ్ములు, ఆయాసం వచ్చే వారు పుదీనా రసాన్ని వాడితే ఫలితం ఉంటుంది. పుదీనా రసాన్ని నోటిలోకి తీసుకుని పుక్కిలిస్తే దుర్వాసన తగ్గుతుంది. మజ్జిగలో పుదీనా ఆకులను కలుపుకుని తాగితే ఎండాకాలంలో కలిగే వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. పుదీనా ఆకులను బాగా నలిపి వాటి నుంచి వచ్చే వాసన పీలిస్తే తలనొప్పి, తల తిరుగుడు వంటి సమస్యలు తగ్గుతాయి. ఆస్తా రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. పుదీనా పసరును చర్మంపై రాస్తే మెరుపు పెరుగుతుంది. దంత సంరక్షణకు మెరుగ్గా పనిచేస్తుంది.
4. మందార
అధిక శాతం మంది ఇళ్లలో పెరిగే మందార ఆకులు, పూలు, వేర్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మందార పూలతో చేసిన కషాయం తాగితే మహిళలకు రుతుచక్రంలో కూడా రక్తసరఫరా మెరుగవుతుంది. కాలేయ సమస్యల నుంచి ఉపశమనానికి, రక్తపోటును తగ్గించేందుకు మందారను వాడతారు. మందార ఆకులు, పువ్వులను బాగా నలిపి తలపై మర్దనా చేస్తే ఒత్తిడి వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపులకు చికిత్సగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మందార ఆకులతో తయారు చేసిన టీ లో విటమన్ సి అధికంగా లభిస్తుంది. మందార పువ్వులను నూనెలో మరిగించి, వడకట్టి, ఆ నూనె జుట్టుకి రాస్తే జుట్టు నిగనిగలాడుతుంది.
5. గోరింట
తక్కువ స్థలంలోనే గుబురుగా పెరిగే మొక్క గోరింట. ఇందులోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. గోరింటాకు లేపనం కీళ్ల నొప్పులు, వాతాలను నివారిస్తుంది. గోరింట బెరడుతో కాచిన కాషాయం రక్తవిరోచనాలకు మంచి మందుగా పనిచేస్తుంది. దీని పువ్వులను నూరి వెనిగర్తో కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. గాయాలు, పుండ్లు, గజ్జి, తామర వంటి సమస్యలకు గోరింటాకు ముద్ద మంచి లేపనంగా పనిచేస్తుంది. ఆవ నూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు మృదువుగా మారుతాయి, పెరుగుతాయి. గోరింటాకు ముద్దను చేతి వేలికి చుట్టుకుంటే గోరుచుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి, నిద్రలేమిలను ఇది దూరం చేస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com