కదలిక లేని ప్రకాశం జిల్లా ట్రిపుల్ ఐటీ పరిస్థితి

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది ప్రకాశం జిల్లా ట్రిపుల్ ఐటీ పరిస్ధితి. మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరుతో ట్రిపుల్‌ ఐటీ మంజూరు చేసింది. కానీ వసతుల కల్పనను పట్టించుకోక పోవటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము వసతులు కల్పించలేమని ఇడుపుపాయ ట్రిపుల్‌ ఐటీ చేతులెత్తేయడంతో ప్రకాశం జిల్లాలో క్లాసుల నిర్వహణ అనివార్యమైంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది ? 2016లో ప్రకాశం జిల్లాలో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్లయించింది. ఆవెంటనే ట్రిపుల్‌ఐటీ కోసం 100 ఎకరాలకుపైగా స్థలం కేటాయిస్తున్నట్లు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. ఆవిద్యా సంవత్సం నుంచే ఒంగోలు ట్రిపుల్ ఐటీ పేరిట విద్యార్దులకు సీట్లిచ్చి ఇడుపులపాయలో క్లాసులు ప్రారంభించారు. అయితే ట్రిపుల్‌ ఐటీ పరిధిలో 2016-17 విద్యా సంవత్సరంలో వెయ్యి మంది విద్యార్థులు, 2017-18 విద్యాసంవత్సరంలో వెయ్యి మందితో పాటు సూపర్‌ న్యూమరరీ కోటా కింద మరో 114 మంది మొత్తం 2114 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన వెయ్యి సీట్లతో పాటు సూపర్ న్యూమరిరీ కింద మొత్తం 140 సీట్లు మొత్తం కలిపి 1140 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 3254 మంది విద్యార్థులవుతారు. అయితే వీరందరికీ ఇడుపులపాయలో తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. 6 వేల మంది విద్యార్దులకు మాత్రమే బోధనా సామర్ధ్యం ఉన్న ఇడుపులపాయలో ప్రకాశం ట్రిపుల్‌ఐటీ విద్యార్దులకు వసతులు కల్పించడం తలకుమించిన భారంగా మారింది. అటు ఫ్యాకల్టీ సైతం ఒంగోలు ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇడుపులపాయలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్యాకల్టీ సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యార్థులది అదే పరిస్థితి. వసతుల లేమితో వారి చదువులు సజావుగా సాగడం లేదు. మరోవైపు తాము వసతులు కల్పించలేమని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ చేతులెత్తేసింది. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ తరగతులు ఎక్కడ నిర్వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఒంగోలు మండలం యరజర్ల కొండ ప్రాంతాన్ని ట్రిపుల్ ఐటీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయించారు. ఈ మేరకు సర్వే నెం 418లో 200 ఎకరాలు పైగా స్థలాన్ని డీ నోటిఫై చేసేందుకు రెవిన్యూ అధికారులు ప్రతిపాదించారు. ట్రిపుల్ ఐటీకీ 100 ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో 2వేల ఎకరాలపైగా భూములను ఇనుప ఖనిజం తవ్వకాల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం లీజుకిచ్చింది. అయితే ఇందులోనే ట్రిపుల్ ఐటీకి స్థలం కేటాయించాలని అధికారులు కేంద్రానికి నివేదించారు. ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే భూములు కేటాయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తర్వాత చాలా స్థలాలు పరిశీలనకు వచ్చాయి. అయితే ఒంగోలుకు సమీపంలోనే ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఊపుందుకుంది. ఒంగోలుకు సమీపంలోనే ట్రిపుల్‌ఐటీ ఉండాలన్న డిమాండ్‌ పెరుగుతుండటంతో జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించారు. జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పెళ్ళూరులో సర్వే నంబరు 517, 518, 519, 520, 526లో 25.26 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దీనితో పాటు ఇక్కడి రైతులు కూడా మిగతా 75 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు ఆర్డీఓ శ్రీనివాసరావు ఇప్పటికే ఈప్రాంతాన్ని పరిశీలించి స్ధానికులతో మాట్లాడారు. ఇక్కడ అయితే స్ధల సేకరణ సులువుగా ఉండటంతో పాటు ట్రిపుల్ ఐటీకి కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు అనువుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందరికి అనువైన, అమోదయోగ్యమైన ఒంగోలుకు సమీపంలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని అటు విద్యార్దులతో పాటు వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com