“కన్నా” ఏమి సేస్తివి? ఏమిటీ అలకలు-ఆందోళనలు?

ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక ఆ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో కొందరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారిని కాదని… కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవి కట్టబెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. అయితే ఇలాంటి వాటికి కేంద్ర నాయకత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గత ఎన్నికల సమయంలో తెదేపా- భాజపా కలిసి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మారిన పరిణామాల నేపథ్యంతో భాజపాతో తెదేపా తెగదెంపులు చేసుకుంది. దీంతో ఏపీలో స్వతహాగా బలపడాలని ఆ పార్టీ యోచిస్తోంది. రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోయినా కేంద్రంతో పాటు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆర్‌ఎస్ఎస్‌ హిందూత్వ పునాదులపైనే ఆ పార్టీ ఆధారపడి నడుస్తుంటుంది. పార్టీలో ముఖ్య పదవులకు సైతం వీటి ప్రాతిపదికగానే ఎంపిక జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ భాజపా సారథిగా కన్నా లక్ష్మినారాయణకు అవకాశం ఇవ్వటం ఆ పార్టీ నేతల్ని ఒకింత ఆశ్ఛర్యానికి గురిచేసింది. హరిబాబు రాజీనామా తర్వాత అధ్యక్ష ఎంపికపై చర్చ సమయంలో కన్నా పేరు ప్రతిపాదనకు వచ్చినా…. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఇవ్వరనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అనూహ్యంగా ఆయన పేరునే అధిష్టానం ఖరారు చేసింది. ఇది సంప్రదాయ భాజపా వాదుల్లో అసంతృప్తికి కారణమైంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న సోము వీర్రాజుకు తీవ్ర నిరాశ కలిగించింది. సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వహణ కమిటి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన అధ్యక్ష పదవి కోరుకున్నారు. అది నెరవేరకపోవటంతో అసంతృప్తికి లోనై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన ఫోన్‌ స్విచాఫ్ చేశారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సోముకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. కన్నాపై వ్యక్తిగతంగా ఎవరికీ విభేదాలు లేకపోయినా… దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చిన వారికి పదవి ఇవ్వటం సరికాదనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. అదీగాక కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ఆయన్ని ఆపి పదవి ఇవ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా బీజేపీ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోయినా వారిని ఆపే సంప్రదాయం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో కళ్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్‌లో ఉమా భారతి, కర్నాటకలో యడ్యూరప్ప వంటి వారు ముఖ్యమంత్రులుగా పనిచేసిన తర్వాత పార్టీని వీడారు. అయినా వారిని ఆపేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. వారే మళ్లీ పార్టీలోకి తిరిగివచ్చారు. అలాంటిది భాజపా మూల సిద్ధాంతాలతో సంబంధం లేని వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతుంటే పట్టుబట్టి ఆపడం… ఇపుడు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించటం ఏమిటనే ప్రశ్నలు వారి నుంచి వస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com