కర్నూలు తెదేపాలో చిచ్చు పెట్టిన లోకేష్-అడ్డం తిరిగిన టీజీ

తెదేపా ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్‌ సోమవారం కర్నూలు పర్యటనలో చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. నగరంలోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాన్ని తీసుకొచ్చి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుకను భారీ మెజార్టీతో గెలిపించి ఒకరిని శాసనసభకు, మరొకరిని లోక్‌సభకు పంపుదామని పిలుపునిచ్చారు. ఈ పిలుపు కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపేందుకే అయినా కర్నూలు రాజకీయాల్లో కుదుపు తెచ్చింది. మైనార్టీ మహిళలతో మధ్యాహ్నం నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్‌ ప్రకటనతో స్టేజీ పైనే టీజీ వెంకటేష్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం సర్వజన వైద్యశాలలో గైనిక్‌ విభాగం ప్రారంభోత్సవానికి టీజీ హాజరైనా లోపలికి వెళ్లకుండా అలకబూనారు. సభ ముగిసిన అనంతరం తిరిగి వెళుతున్న లోకేష్‌ కాన్వాయ్‌ను టీజీ అనుచరులు చుట్టుముట్టారు. ఎన్నికల వాతావరణం లేకుండా ఇలా అభ్యర్థిని ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. దీనికి లోకేష్‌ స్పందిస్తూ అభ్యర్థులను ప్రకటించేది తాను కాదని, అధిష్ఠానమని చెప్పి వెళ్లిపోయారు.ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసినా సర్వే చేసి టిక్కెట్టు ఇస్తామన్నారని, ముందుగా అభ్యర్థిని ప్రకటించడం తెదేపాలో కొత్త చరిత్ర అని టీజీ వెంకటేష్‌ అన్నారు. కర్నూలు శాసనసభ స్థానాన్ని ఆయన తన కుమారుడు భరత్‌కు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ ప్రకటన తమకు అర్థం కాలేదని, ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనిపై నాయకత్వమే జవాబు చెప్పాలని, అప్పుడే మా నిర్ణయం చెబుతామని టీజీ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com