కర్నూలు పర్యటనలో జగన్

కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం నలుగురికి మాత్రమే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని గౌడ్ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…

రైతు భరోసా యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చి, అందులో భాగంగా ఆత్మకూరుకు వచ్చి మీ అందరి ప్రేమాభిమానాల మధ్య నిలుచున్నా
ఇదే కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
కానీ ఇంతవరకు కర్నూలు జిల్లాలో ఎంతమందికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని చంద్రబాబును నిలదీసి అడుగుతున్నా
కేవలం నలుగురికి మాత్రమే ఆ ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు
రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు, రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి లేదు
రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది
రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీవీలలో చెప్పేవారు, గోడల మీద రాసేవారు
రైతన్నలను మోసం చేశారు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా మోసం చేశాడు
చదువుకునే పిల్లలను కూడా వదల్లేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు
ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
ఎన్నికలయ్యాయి.. చంద్రబాబు సీఎం జాబ్ తీసుకుని కుర్చీలో కూర్చున్నారు
రైతన్నల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ అయ్యాయా?
రైతులను, పిల్లలను కూడా చంద్రబాబు మోసం చేశారు
చంద్రబాబు చెప్పారు కాబట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు కట్టలేదు
రైతులకు ఇంతకుముందు లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ మాత్రమే పడేది
లక్ష నుంచి మూడు లక్షల వరకు కేవలం పావలా వడ్డీ పడేది
ఇప్పుడు బ్యాంకులు రైతుల నుంచి రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నాయి
ఈవాళ రైతులు రుణాలు కట్టకుండా పోయినందుకు రుణాలు రెన్యువల్ కాలేదు, ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు
బ్యాంకులకు వెళ్లే పరిస్థితి లేదు
రబీ లెక్కలు చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులన్నీ కలిపి రైతులకు 24వేల కోట్ల పంట రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, 9800 కోట్ల టెర్మ్ లోన్స్ ఇవ్వాలని అనుకున్నారు
కానీ ఇచ్చింది కేవలం 4900 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు
బ్యాంకుల దగ్గరకు రైతులు వెళ్లే పరిస్థితి లేదు. రైతులకు రుణాలు దొరక్క రబీ వేసుకోడానికి దిక్కులేక బయట 2, 3 రూపాయల వడ్డీకి తీసుకుంటున్నారు
రబీ మొత్తానికి 24 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ ఈసారి వేసింది కేవలం 11.9 లక్షల హెక్టార్లు మాత్రమే
అంటే 48 శాతం కూడా పంటలు వేయలేకపోయారు
ఇంతటి దారుణంగా రైతులు బతుకుతుంటే, చంద్రబాబు కేబినెట్ మీటింగులలో రైతులకు ఏం చేయాలో పట్టించుకోరు, పేదలు ఎలా ఉన్నాడో పట్టించుకోరు
ఆరోగ్యశ్రీ పథకం విఫలమై నెలల తరబడి నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు కట్టక ఆ పథకం నీరసించిపోయింది
డయాలసిస్ చేయించుకోవాల్సిన పేషెంట్లను ఏడాది తర్వాత రమ్మని ఆస్పత్రులు చెబుతున్నాయి
చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జోక్‌గా తయారుచేశారు
పేదలు అప్పులపాలు కాకుండా ఉండాలంటే ఆ పేదల కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి ఆలోచన చేశారు
ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు లక్షకుపైగా ఉన్నాయి. మెడికల్ కాలేజిలో ఏడాదికి 11 లక్షలు చెబుతున్నారు. కానీ వీళ్లిచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ ముష్టి 35 వేలు
ఆ రోజుల్లో వైఎస్ అయితే ప్రతి పైసా పూర్తిగా ఇచ్చేవారు
కేబినెట్ సమావేశాల్లో కూర్చున్నప్పుడు రైతులకు, పేదలకు ఏం చేస్తున్నారో చంద్రబాబు ఆలోచించరు
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు తోడుగా నిలబడ్డారు
కేబినెట్ మీటింగులో చంద్రబాబు రైతుల నుంచి భూములు ఎలా లాక్కోవాలి, వాటిని కమీషన్లు తీసుకుని ఎవరికి అమ్మాలని మాత్రమే ఆలోచిస్తున్నారు
నిన్న శ్రీశైలం డ్యాం ఇంజనీర్లను.. డ్యాంలో 844 అడుగుల పైన ఎన్నిరోజులున్నాయని అడిగా
ఆగస్టు 16 నుంచి 844 పైనే ఉన్నాయని వాళ్లు చెప్పారు.
కానీ వాటి నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వదిలే పరిస్థితి లేదు
ఏ ప్రాజెక్టు చూసినా సగంలోనే ఆగిపోయాయి
గాలేరు-నగరి, కేసీ కెనాల్ మరమ్మతులు అన్నీ సగంలోనే ఆగాయి
రైతు భరోసా యాత్ర చేస్తే.. రైతులు ఎలా బతుకుతున్నారో తెలుస్తోంది
ఇదే కర్నూలు జిల్లాలో ఉల్లి కిలో 2 రూపాయలకు అమ్మలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు
టమోటా కిలో 2 రూపాయలకు అమ్ముకోలేక వదిలేస్తున్న దుస్థితి కర్నూలు జిల్లాలోనే ఉంది
మిరప పంటకు 7వేల ధర పలుకుతోందని, అది పెట్టుబడులకు కూడా చాలదని రైతులు వాపోతున్నారు
రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు రైతులు పడుతున్న బాధలు అర్థం కావాలని ప్రయత్నిస్తున్నా
ఈవాళ ఇదే చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి రావాలంటే ఆయన గాజు మేడల నుంచి బయటకొచ్చి, సామాన్యులతో తిరిగితే ఆయనను రాళ్లతో కొడతారని అర్థమవుతుంది
ఇదే చంద్రబాబుకు ఒక్క విషయం గట్టిగా చెబుతాను
ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు డబ్బుల ఆశ చూపించి కొనుగోలు చేశారు
ఇదే జిల్లా నుంచి ఐదుగురిని కొనుగోలు చేశారు
చంద్రబాబు గారూ, రేపు మీరు గెలవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొంటే చాలదు.. ప్రతి పేదవాడికి మంచి చేస్తే, ప్రతి పేదవాడి ఇంట్లో నీ ఫొటో ఉండేలా చేసుకో, అప్పుడు గెలుస్తావని చెబుతున్నా
చంద్రబాబు నాయుడి నైజం ఈవాళ ఎంత డబ్బు సంపాదించాం, ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం, రాజకీయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించాం అని చూస్తున్నారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com