కర్పూర కాంతి మేనిఛాయ శివయ్య సొంతం

పరమేశ్వరుడు సమస్త ఉత్తమ లక్షణాలు కలిగినవాడు. అందగాడు. మూడు కన్నులు కలిగిన త్రినేత్రుడు. కన్నులు చక్కగా వికసించి తామర పువ్వుల్లాగా ఉంటాయి.. ముఖం మీద మనోహరమైన చిరునవ్వు వికసించి ఉంటుంది. స్వామిరూపం కర్పూర కాంతిని పోలిన తెల్లని మేనిఛాయతో ఉంటుంది. గౌరవర్ణంతో కళకళలాడుతుంటాడు.. పరమేశ్వరుడి తలపైని జడలు గంగానది తరంగాల తాకిడితో పరిశుభ్రంగా ఉంటాయి. నిరంతరం సేవించే దేవతల ఒంటిపైనున్న ఆభరణాల రాపిడి వలన రాలిన బంగారు పొడితో పరమేశ్వరుడి అవయవాలు చక్కగా ప్రకాశిస్తుంటాయి. తన శిగపై చంద్రవంకను ధరించి సుందరంగా కనిపిస్తారు. స్వామి కంఠం నల్లగా ఉంటుంది. మెడలో రుద్రాక్షలు ధరించి ఉంటారు. మహాశివుడికి సాటి వచ్చేవారు వేరొకరు లేరు. ఉదాసీనుడు, నిరాడంబరుడు, దిగంబరుడుగా, విశ్వేశ్వరుడిగా అనేక రూపాల్లో దర్శనమిచ్చే దేవదేవుడు నిత్య ప్రశాంత వదనుడు, ధ్యాన నిమగ్నుడు. చిదానంద స్వరూపుడిగా కీర్తిపొందాడు. ఆయన ధరించిన ఆభరణాలు, అవతారాలు దేవదానవులకు స్ఫూర్తిదాయకమైనవి. ఒళ్లంతా విభూతిని పూసుకొని ఉంటాడు. గంగను జటాజూటంలో నిలుపుకొన్నవాడు. ఢక్క అనే వాయిధ్యాలు, జపమాలను, బ్రహ్మకపాలాలను ధరించి ఉంటాడు. సర్పాలు ప్రమాదకరమైనవి. అలాంటి వాటిని తన వశంలో ఉంచుకొని ఆభరణాలుగా ధరించాడు. ఆదిశేషువును భుజకీర్తి చేసుకొని ఉంటాడు. శివుడు ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించి ఉంటాడు. పులిచర్మాన్ని నడుముకు చుట్టుకొని ఉంటాడు. పరమేశ్వరుడు త్రిశూలాన్ని ఆయుధంగా ధరించి ఉంటాడు. త్రిశూలానికి మూడు కొనలు అగ్ని జ్వల రూపంలో ఉంటాయి. ఈ మూడు కొనలు సత్వరజస్తమో గుణాలకు ప్రతీక. పరమేశ్వరుడి త్రిశూలానికి డ[మరుకం కట్టి ఉంటుంది.‘ శబ్ధ గుణకం ఆకాశం’ అంటారు.. ఆకాశ తత్త్వం లక్షణమే శబ్ధం. మనం మంత్రజపం చేసినప్పుడు గానీ, విన్నప్పుడు కానీ స్పందనలు వెలువడుతాయి. అవి ఆకాశంలో ప్రయాణిస్తాయి. మంత్రపురశ్చరణ చేయడం వల్ల యోగికి ఆనందం కలుగుతుంది. ఆనంద తాండవానికి గుర్తుగానే పరమేశ్వరుడు ఢమరుకం ధరిస్తాడు. నుదుట మూడో కన్నుతో త్రినేత్రుడిగా ప్రసిద్ధి చెందింది ఒక్క పరమేశ్వరుడే. శివుని నేత్రాలు సూర్య, చంద్ర, అగ్ని రూపాలలో ఉంటాయి. అందుకే శివుణ్ణి విరూపాక్షుడు అని అంటారు. జ్ఞాన శక్తి, క్రియాశక్తి, ఇచ్చాశక్తి అనేవి పరమేశ్వరుని మూడుకళ్లని కైలాస సంహితలో పేర్కొన్నారు. త్రినేత్రాలకు గల ఈ శక్తుల వల్ల శివుడు సృష్టి, స్థితి, లయలను కొనసాగిస్తున్నాడని శాస్త్ర వచనం. దివ్యదృష్టికి, అతీంద్రియ దివ్య శక్తికి ప్రతీక ఈ మూడో నేత్రం. ప్రళయకాలంలో రుద్రుడు తన మూడో కంటి అగ్నితో జీవులను దహించి దుఃఖాన్ని కలిగిస్తాడు. ఇతర సమయాల్లో జీవుల దుఃఖాన్ని, దుఃఖ హేతువును తొలగిస్తాడు. అందుకే త్రినేత్రుడిని కాలాగ్ని రుద్రుడిగా రుద్రనమకం తెలియజేస్తోంది. శుభములను ఇచ్చే శుభకరుడు శివుడు. పాపాలను నశింపచేసే వినాశకుడు. ధీనులపాలిట దయామయుడైన దీనదయాళుడు. ఆటంకాలను తొలగించే రుద్రుడు. యజుర్వేదమును శిరముగా, రుద్రమును ముఖముగా, పంచాక్షరిని నేత్రంగా వెలుగొందుతుంటాడు. వేడుకున్నంతనే మోక్షమిచ్చే ప్రదాత. శంకరుడికి మరోపేరు రుద్రుడు. రౌద్రమూర్తిగా శివుడు చేసే తాండవాన్ని తట్టుకునే శక్తి మరెవ్వరికీ లేదు. అలాంటి రౌద్ర రూపం దాల్చి శంకరుడు త్రిపురాసురులనే రాక్షసులను వధించాడు. శివుడు దిగంబరుడిగా ప్రసిద్ధి చెందాడు. దిగంబరుడు అంటే దిక్కులే వస్త్రంగా కలిగిన వాడు అనేది అంతరార్థం. అందుకే ఆయన సర్వాంతర్యామి. ఎద్దును వాహనంగా చేసుకున్న దేవదేవుడు. సంపదలను ఇచ్చే శివుడు శ్మశానవాసి!, శ్మశానంలో తిరిగే వాడని, శవాలు కాల్చిన బూడిద ఒంటినిండా రాసుకునేవాడని, కపాలంలో భిక్షాటన చేస్తాడని వేదాంతులు శివుని గురించి వివరించారు. కాటి బూడిద పవిత్రమైది కనుకే ఆయన నాట్యం చేస్తూ అభినయిస్తున్నప్పుడు రాలిన ఆ బూడిదను దేవతలు శిరస్సుపై ధరిస్తారు. ఎవరైనా సుగంధాలతో కూడిన పుష్పాలను అలంకరించుకుంటారు. ఈశ్వరుడు మాత్రం ఏ వాసన లేని తుమ్మిపూలనే ఆభరణంగా ధరిస్తారు.!. అర్ధరాత్రి పెళ్లి చేసుకుంటారు. ఆయన ప్రతి చర్య అంతులేనంతంటి అంత‌రార్థం కలిగి ఉంటుంది. భూలోక కైలాసమైన శ్రీశైల క్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. శివనామ స్మరణతో భక్తజనం శ్రీగిరికి చేరుకుంటోంది. మహాదేవుడికి ప్రీతికరమైన పర్వదినాల్లో దివ్యదర్శనం చేసుకొని భక్తజనం ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతున్నారు. బ్రహ్మోత్సవాల నాల్గో రోజు శుక్రవారం పార్వతీ రమణుడు శ్రీమల్లికార్జునస్వామి భక్తులకు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో విశేష పుష్పాలంకారం నడుమ దేవదేవులు ఇరువురు జోడిగా కొలువుదీరారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు భక్త కోటికి ఆభయహస్త దీవెనలిస్తూ కొలువయ్యారు. ఉభయదేవాలయాల అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణలతో, మంగళహారతులు సమర్పించి పూజలు చేశారు. మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవానికి తీసుకురాగా, ఈఓ భరత్‌గుప్తా నారికేళాలు సమర్పించి ముందుకు నడిపారు. దేవదేవులను పురవీధుల్లోకి ఆహ్వానిస్తూ శంఖనాదాలు మిన్నంటాయి. గొరవయ్యల ఢమరుక నాదాలు సందడి చేశాయి. తప్పెట చిందులతో కళాకారులు అలరించారు. కోలాటాలు, చెక్కభజనలతో కళాకారులు ఉత్సవం ఎదుట సందడి చేశారు. దేదీప్యమైన శోభతో తరలివస్తున్న స్వామిఅమ్మవార్లను వీక్షించేందుకు భక్తజనం రాజగోపురం ఎదుట వేచి ఉన్నారు. అప్పుడే అంబరాన్నంటే సంబరంతో స్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై తరలివచ్చారు. భక్తజన హృదయం పరవశించిపోయింది. దేవదేవుల వైభవాన్ని కన్నులారా తిలకించి దీవెనలిమ్మని వేడుకున్నారు. గంగాధరమండపం, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రశోభితంగా జరుగుతున్నాయి. ఆలయ ఈశాన్యభాగంలోని పుష్కరిణి వద్ద గుంటూరుకు చెందిన లక్ష్మి 12 మంది బృందంతో కలిసి సాంప్రదాయ నృత్యప్రదర్శన చేశారు. సినీనేపథ్యగాయకులు పవన్‌ చరణ్‌, దివ్య బృందం భక్తిసంగీత విభావరి నిర్వహించారు. ఆధ్యాత్మిక భక్తిగీతాలు ఆలపించి భక్తులను మైమరపించారు. డాక్టర్‌ జయప్రద రామమూర్తి వేణుగానంతో అలరించారు. శివభక్తిగీతాలను వేణునాద స్వరఝరితో సమ్మోనపరిచారు. అమలాపురానికి చెందిన మపర్తి చంద్రశేఖర్‌ గాత్రకచేరీ చేశారు. పాతాళగంగ మార్గంలోని మరోవైపు శివదీక్ష శిబిరాల్లో సాంస్కృతిక వేదికపై కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గుంటూరుకు చెందిన లక్ష్మీ అన్నపూర్ణ హరికథ కార్యక్రమంలో శివుని కథలు వివరించారు. కాకినాడకు చెందిన శివలెంక ప్రకాశరావు ప్రవచనం చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సురభినాటకం కొనసాగుతోంది. నంద్యాల భరధ్వాజ కళా పరిషత్తు వారు సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఐదో రోజు శనివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు రావణవాహనసేవ జరుగనుంది. శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు చేసి రావణవాహనంపై గ్రామోత్సవానికి తీసుకువస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సాయంత్రం ఆలయ పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com