కలుపు మొక్కలకు కూడా ప్రాధాన్యం ఉంది

పంట చేలో కలుపు మొక్కల్ని తొలగించేందుకు రైతు చాలా మొత్తం, సమయం, శ్రమ వెచ్చిస్తుంటాడు. తను నాటిన, ఉద్దేశించిన మొక్క ఎదుగుదలకు వీటి వల్ల ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే రైతు ఆ పని చేస్తుంటాడు. గుంపులో ఎవరైనా ఒకరు విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వ్యక్తిని కలుపు మొక్కతో పోల్చుతుంటాం. కలుపు మొక్కలను వ్యర్థంగా భావిస్తాం. కానీ, వాటికీ విలువుందని, వాటిని కూడా సొమ్ము చేసుకోవచ్చునని ఎంతమందికి తెలుసు? కలుపు మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయని, అవి మన రోగాలను తగ్గిస్తాయని తెలిస్తే వాటినే అపురూపంగా పెంచుకునే రోజు రాకపోదంటున్నారు మూలికా వైద్యం తెలిసిన వారు. తలనొప్పి, జ్వరం మొదలు పెద్ద పెద్ద గాయాలను సైతం ఇట్టే మాన్పించగల గుణం వీటికుందంటున్నారు. పంట చేను, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాలు, కొండలు, గుట్టలు, అడవులు.. ఇలా ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ ఇవి ఊరకే పుట్టి పెరుగుతాయి. వర్షపు నీరు భూమిలో ఇంకేటట్లు, మట్టి కొట్టుకుపోకుండా మేలు చేస్తాయి.
**ఆయుర్వేదానికి ఆయువు పట్టు
ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రతి మొక్కకు ఎదో ఒక ఔషధ గుణం ఉంటుంది. కొన్ని మొక్కలు విషతుల్యమైనా అవీ కొన్ని రోగాలను నయం చేయగలవు. ఆయుర్వేద వైద్యంలో మొక్కలు, మూలికలదే ప్రాధాన్యం. వీటినుంచే ఔషధాల్ని సంగ్రహించి ఆయా రోగాలకు సంబంధించిన మందులు తయారు చేస్తుంటారు. ఇప్పటికీ పల్లెలు, గిరిజన గ్రామాల్లో మూలికా వైద్యం చేసేవారు చాలా మంది ఉన్నారు. విజయనగరం జిల్లా కురుపాం మండలం పొక్కిరి అనే మారుమూల గ్రామానికి చెందిన రామ్మూర్తి అనే గిరిజనుడు సుమారు 150 రకాల మూలికలతో వైద్యం చేస్తుంటారు. ఇలాంటివారు విశాఖ, శ్రీకాకుళం మన్యాలలో చాలామందే దర్శనమిస్తారు. అల్లోపతి (ఇంగ్లీషు)మందులు వచ్చి త్వరితగతిన స్వస్థత చేకూరుతుండడంతో మూలిక వైద్యానికి ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఇలాంటి వాటిల్లో మనం పనికిరావని తీసిపారేస్తున్న కలుపు మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించి నగంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న కొన్ని కలుపు మొక్కలు, వాటి ఔషధ గుణాల్ని పరిశీలిస్తే…
**కలుపు మొక్క
1. నేల ఉసిరి – పచ్చకామెర్లను తగ్గిస్తుంది. 2. మురిపిండము చర్మవ్యాధులను నివారిస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. 3. గలిజేరు – ఉదరకోశ వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. 4. సహదేవి – ఎలాంటి జ్వరం అయినా తగ్గాల్సిందే. 5. రెడ్డివారి నానుబాలు – కంటి వ్యాధులను నివారిస్తుంది. 6. అత్తిపత్తి – గాయాలను తగ్గిస్తుంది. 7. గడ్డి చేమంతి – జుట్టులో చుండ్రు నివారిస్తుంది, పైత్యం తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టిస్తుంది. 8. తుంగదుంపలు – చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, చలువ చేస్తుంది. 9. విష్ణుకాంతం – మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 10. సుగంధిపాల – చలువ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 11. నేలతాడి – ధాతుపుష్టికి టానిక్‌లా పనిచేస్తుంది. 12. నేలకొబ్బరి – మెదడుకు చలువ చేస్తుంది. 13. నేలవేము – జీర్ణ సంబంధ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఎలాంటి జ్వరాలనైనా నివారిస్తుంది, మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. 14. కొండపిండి – మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. 15. అడవి అల్లం(కారుఅల్లం) – జీర్ణ సంబంధిత వ్యాధులకు సరైన మందు. 16. పిల్లి పీచుర, వస – నరాల మార్గం విప్పుటకు ఉపయోగపడుతుంది. 17. నాగసాగరం – నరాల బలహీనత తగ్గిస్తుంది. 18. పల్లేరు – దశమూలాల్లో కలుపుతారు. 19. రణపాల – గాయాలను మాన్పుతుంది. 20. వెంపలి – పంటి వ్యాధుల్ని నివారిస్తుంది. 21. నేల తంగేడు – మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. 22. గుంటకలవర – కంటివ్యాధుల నివారణకు పనిచేస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com