కళ్ళు తెరిచిన యాజమాన్యం

ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం వంటివి చేయకుండా వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరుతూ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన సిబ్బందికి సూచించింది. తరచూ సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఎటువంటి సమయాల్లోనైనా ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. ఘర్షణ జరిగే సూచనలు కనిపిస్తే వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించే విధంగానే ప్రయత్నించాలి. వారితో మాట్లాడేప్పుడూ గొంతు తగ్గించి మాట్లాడండి. గొడవలు జరిగిన తర్వాత దానికి క్షమాపణ లేఖ పెట్టడమనేది సరైనది కాదు. అసలు గొడవ జరిగే పరిస్థితులు రాకుండా బాధ్యతగా వ్యవహరించండి. సమస్యకు పరిష్కారాన్ని వెంటనే కనుగొనండి’ అంటూ ఇండిగో ఫ్లీట్‌ సూపర్‌వైజర్‌ కరుణా సింగ్‌ సిబ్బందికి లేఖ రాసినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రచురించింది. ప్రయాణికులు తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా లేదా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన సమయాల్లో మాత్రమే సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని సింగ్‌ ఉద్యోగులకు లేఖ ద్వారా సూచించారు. గొడవకు దిగిన ప్రయాణికులతో సామరస్యంగా మాట్లాడి విషయాన్ని అక్కడే ముగిసిపోయేలా వ్యవహరించాలని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రయాణికులు తమ తీరును మార్చుకోకపోతే వాళ్లని భద్రతా సిబ్బందికి అప్పగించాల్సిందిగా సూచించారు. అలాగే తోటి సిబ్బంది ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తిస్తే సహోద్యోగులు ఎంతమాత్రం సహకరించవద్దని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన వెల్లడించారు. గత నెల ఇండిగో విమానంలో విపరీతంగా దోమలు ఉన్నాయంటూ సౌరభ్‌ రాయ్‌ అనే కార్డియాలజిస్ట్‌ వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై విమాన యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వాళ్లు సరిగా స్పందించకుండా ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. ఆయన చొక్కా కాలర్‌ పట్టుకొని విమానం నుంచి బలవంతంగా దించేశారు. దీనిపై క్షమాపణ చెప్పాల్సిందిగా ఆయన విమాన సిబ్బందిని డిమాండ్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com