కాన్సాస్‌లో మహిళా దినోత్సవ వేడుకలు


కాన్సస్ లో ఈ వారాంతంలో అహ్లాదకర వాతావరణంలో సాయంత్రం వేళ కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ KCTCA ఆధ్వర్యంలో దక్షిణ అమెరికా తెలుగు సంఘం -నాట్స్, తానా, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కాన్సస్ లో తొలిసారిగా నిర్వహింప బడ్డ ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో వందలాది మంది కుటుంబాలతో సహా హాజరై సంబరాలు జరుపుకొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళల పాటలు, నృత్యాలు అక్కడికొచ్చిన వారందరిలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ టీవీ యాంకర్, నటి, గాయకి ఉదయభాను ఆత్మీయ అతిథిగా విచ్చేసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సరళమైన అభినయం, చెరగని చిరునవ్వుతో రెండున్నర దశాబ్దాలకు పైగా కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేస్తూ స్త్రీ స్వేచ్చ, స్వాభిమానం, సృజనాత్మక సంపత్తికి ఓ చెరగని సంతకం లా నిలచిన ఉదయభాను ని మిన్నంటిన కరతాళ ధ్వనుల మధ్య నాట్స్ కాన్సస్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి వేదికపైకి ఆహ్వానించగా, సాంస్కృతిక కార్యక్రమాలు వినాయకుని పూజతో శ్రీకారం చుట్టుకుని ఉదయభాను దీపప్రజ్వలనతో ఆరంభం అయ్యాయి. ప్రతి మనిషి జీవన వికాసంలో వివిధ దశలో ఒక అమ్మమ్మగా, నాయనమ్మగా, జేజమ్మగా, అమ్మగా , చెల్లెగా, అక్కగా, అత్తగా,భార్యగా, వదినగా, బిడ్డగా, గురువుగా మరెన్నో ప్రతిరూపాల్లో మహిళల పాత్ర అపురూపమని ఘనంగా శ్లాఘిస్తూ ఆద్యంతం ఆసక్తిదాయకరంగా జరిగిన ఈ వేడుకలను స్త్రీ లకు అంకితం చేసారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను, కూడగట్టిన మద్దతును భారతదేశంలోని ఎంపిక చేసిన పాటశాలల్లో చిన్నారుల చదువులకోసం, మహిళా సాధికారత, మరియు చేనేతల అభివృద్ధి, సంక్షేమానికి చేయూత ఇవ్వాలని, చేనేత ఉత్పత్తులని అమెరికాలో ప్రోత్సహించాలని, ప్రచారం కల్పించాలనే సమున్నత లక్ష్యంతో సాగిన ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగువారు, ప్రవాస భారతీయులు, యువతీ యువకులు ఆనందోత్సాహాలతో చిన్నాపెద్దా తేడా లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా పెద్దసంఖ్యలో పాల్గొని మేము సైతం అంటూ మద్దతుగా నినదించారు. మహిళలు విచిత్ర వేషధారణలు, శాస్త్రీయ నృత్యాలు, ఆటలు, పాటలతో అలరిస్తూ నూతన పునరుత్తేజాన్ని అందించడమే కాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేర్చడంతో స్ఫూర్తిదాయకంగా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాన్సస్ తీసుకువచ్చిన సిరిసిల్ల చేనేత దుస్తుల తో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యెక ఆకర్షణగా నిలవగా, చేనేత ప్రోత్సహించేందుకు మహిళలంతా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు.

బిందు చీదెళ్ళ అధ్యక్షతన KCTCA స్పూర్తిమంతమైన, జనరంజకమైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, చైల్డ్ ఎడ్యుకేషన్ ని కూడా మద్దతుగా విశేషమైన కృషి చేస్తూ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాట లేస్తోందని కొనియాడుతూ, దేశవ్యాప్తంగా నేతన్నలకోసం చేస్తున్న కృషిని అందరూ అభినందించారు. దక్షిణ అమెరికాలోని తెలుగు వారికి వెన్నెముకగా నిలుస్తూ వినూత్నమైన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను అలుపెరుగకుండా అందిస్తున్న నాట్స్ ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన బోన్ మారో డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ఉత్సాహంతో సేవాదళం సభ్యులు రుచికరమైన ఆహారాన్ని తాజాగా అందించారు. ఉదయ భాను వివిధ ఫామిలీ గేమ్ షోస్ ద్వారా, సరదా ఆటలతో అందరి మనసుల్లో తనదైన మాయాజాలం తో చెరగని ముద్రవేశారు. చిన్న పిల్ల లు చేసిన దేశ భక్తులు రూపకం, ఇటీవల కీర్తి శేషులు అయిన ప్రముఖ నటి శ్రీదేవికి నివాళిగా అర్పించిన కార్యక్రమం, బాలీవుడ్ డాన్స్ , ఫ్యాషన్ షో, బాలలు ఆలపించిన పాటలు, సంప్రదాయ, ఫ్యూజన్ నృత్యాలు, తదితర ప్రదర్శనలు ఆహుతులు ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఓ తీయని మధురానిభూతిని కలిగించాయని విచ్చేసిన అందరూ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన మొత్తానికి సంబంధించి భారతదేశంలో పేద లబ్ది దారుల వివరాలు సభా ముఖం గా తెలపటం జరిగింది. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ, ప్రాయోజిత వర్గానికి, దాత ల కు పేరు పేరున నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది. కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, ప్రెసిడెంట్ బిందు చీదెళ్ల వైస్ ప్రెసిడెంట్స్ దినేష్ చినలచయ్యగారి , మహతి మంద, శ్రీదేవి గొబ్బూరి, సునీల్ ముడుసు, ప్రోగ్రాం చైర్ గౌరీ చెరుకుమూడి, చైతన్య రంగిని, సెక్రటరీ విజయ్ కొండి మరియు బోర్డు మెంబెర్స్ వెంకట పుసులూరి, కిరణ్ కణకడందుల,విశ్వమోహన్ అమ్ముల, శ్రీనివాస్ తలగడదీవి, వెంకట్ రావు, రాజేంద్ర చీదెళ్ళ, ప్రశాంత్ ఠాకూర్, రఘు, వేణు, మన్మోహన్ మరియు సుచరిత వాసం తదితరులు, పాల్గొన్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకరించిన అందించిన నాట్స్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, మరియు వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి, వెన్నెల నీతిపూడి మరియు ఈ కార్యక్రము జరగటానికి మూలబిందువు తానా, వెన్నంటి ఉండి నైతిక మద్దతు అందించిన అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరగా ప్రెసిడెంట్ బిందు చీదెళ్ల వందన సమర్పణతో ఈ వేడుకలు ముగిసాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com