కార్డులు ఇలా భద్రం

*కార్డు ఇప్పుడు మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది. గుర్తింపు కార్డు నుంచి ఆధార్‌ కార్డు వరకు ప్రతి కార్డు అవసరం ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు ఏటీఎం కార్డులు ఉండనే ఉన్నాయి. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకేచోట పెట్టుకుంటాం. అనుకోని పరిస్థితి ఎదురైతే మొత్తం కార్డులన్నింటినీ ఒకేసారి పోగొట్టుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, మళ్లీ వాటిని పొందడం ఎలా అన్న సందేహం సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు టెన్షన పడాల్సి పనిలేదని, కాస్త సమయం తీసుకున్నా ప్రతి కార్డుకు డూప్లికేట్‌ పొందే సదుపాయం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

1.AADHAAR CARD
ఆధార్‌ కార్డు పోతే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18001801947 కి కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం, చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డు మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. కార్డు ఏదైనా దాన్ని స్కాన్ చేయించి ఈ మెయిల్‌ అడ్రస్‌కు అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవడం చాలా మంచిది. ప్రధాన కార్డులను (ఏటీఎం కార్డులు కాదు) డూప్లికేట్‌ చేయించుకుని వీలైనంత వరకు వాటినే జేబులో పెట్టుకు తిరగాలి. సాధారణంగా పిక్‌పాకెటింగ్‌ జరుగుతుంది కావున ముఖ్యమైన కార్డులు పర్సులోకాకుండే ప్రత్యక వాలెట్‌లో పెట్టుకుంటే మంచిది.

2.VOTER CARD
ఓటరు గుర్తింపు కార్డు కూడా మనకు చాలా విధాలుగా ఉపయోగ పడుతుంది. కేవలం ఓటు వేయడానికి కాకుండా నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీన్ని అడుగుతుంటారు. ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్‌బూత్, కార్డు నంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు తిరిగి పొందవచ్చు. కార్డు నంబర్‌ ఆధారంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు సంబంధిత మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు.

3.RATION CARD
కుటుంబ అవసరాలకు రేషన కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువుల కోసమేకాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన కార్డును కీలక ఆధారంగా అడుగుతుంటారు. తెల్లకార్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా కల్పిస్తోంది. అందువల్ల మన జీవితంలో రేషనకార్డు ప్రాధాన్యం చాలా ఎక్కువ. అంత ప్రాధాన్యం ఉన్న రేషన కార్డు పోగొట్టుకున్న వారు www.icfs2.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్న user name : guest, password:guest123 సాయంతో విచారణను ఉపయోగించి మన రేషన్‌కార్డు నంబర్‌ సాయంతో జెరాక్స్‌ ప్రతిని పొందవచ్చు. దానిద్వారా ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్‌ దానిని పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నంబర్‌పై కార్డు జారీ చేస్తారు

4.PAN CARD
ఆర్థిక లావాదేవీల్లో పాన్‌కార్డు ఇప్పుడు చాలా కీలకం. ఆదాయ పన్ను శాఖ అందించే పాన్ (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌) కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు పాత పాన్‌ కార్డు జీరాక్స్‌, రెండు కలర్‌ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా మరో రూ.90 చెల్లించాలి. కొత్త కార్డు వచ్చేసరికి మూడు వారాల సమయం పట్టవచ్చు. www.nsdl.pan అనే వెబ్‌సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. దీని కార్యాలయం ద్వారకానగర్‌లో మెయిన్‌ రోడ్డులో ఉంది. అక్కడకు వెళ్లి అధికారులను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం వుంది.

5.DRIVING LICENCE
వాహనం నడిపేందుకు తప్పనిసరిగా ఉండాల్సింది డ్రైవింగ్‌ లైసెన్స్‌. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ పత్రంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందించాలి. అలాగే, రూ.10 బాండ్‌ పేపర్‌పై కార్డు పోవడానికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందేందుకు అవకాశం ఉంది. aptransport.org అనే వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ఎల్‌డీ ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని మరిన్ని వివరాలు పొందవచ్చు. అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా పోయిన కార్డును పొందవచ్చు.

6.ATM CARD
ఏటీఎం కార్డును పొగొట్టుకున్నా, ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్‌ చేయించాలి. తరువాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్‌ ఈ విషయాన్ని నిర్థారించుకుని కొత్త కార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకులు నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.

7.PASS PORT
పాస్‌ పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి పాస్‌ పోర్టు లభించకుంటే నాన్‌ ట్రేస్ట్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌ పోర్టు అధికారి, హైదరాబాద్‌ పేరిట రూ.1000 డీడీ తీయాలి. రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తరువాత డూప్లికేట్‌ పాస్‌ పోర్టు జారీ చేస్తారు. తత్కాల్‌ పాస్‌ పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov.in ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com