కాశీలో ప్రదక్షిణం చేస్తే మోక్షం ఖాయమా?

పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. అలా కొంతకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షుల లాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు, వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తూండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు. వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజలందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురువెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి, సత్కరించాడు. యోగక్షేమ పరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి, రెండు కల్పాల పాటు స్వర్గసుఖాలను ఇచ్చిందనీ, ఈ జన్మలో కూడా మహారాజయోగాన్ని కూడా కలుగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణా విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి.కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ, అన్నపూర్ణ మందిరాల ప్రదక్షిణ చేయండి. కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళ్తుందన్నది నమ్మకం. కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు. కాశీ మహానగర మహత్యాన్ని తెలిపే కథ ఒకటి దేవీ భాగవతం పదకొండో స్కంధంలో కనిపిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com