భారత ఆక్రమిత కశ్మీర్ ’ అంటూ ఇటీవల అవాకులు చవాకులు పేలిన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యల వెనుక పెద్ద కథే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇప్పటికే ముగియగా.. పాకిస్థాన్‌లో లీగ్‌లు ఆడుతూ కాలక్షేపం చేస్తున్న ఈ క్రీడాకారుడు.. కశ్మీరీల కష్టాలపై కన్నీరు ఒలకబోయడానికి కారణాలు అనేకం. రాజకీయ, సామాజిక, కుటుంబ కారణాలతో అఫ్రిది తరచూ భారత్ అంతర్గత విషయాలపై వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన భవిష్యత్ కోసం పొరుగు దేశాల వ్యవహారాల్లో తల దూర్చడం పాకిస్థానీలకు కొత్తేమీ కాదు. ఇప్పుడు అఫ్రిదీది అదే బాట. ఐపీఎల్లో ఆడాలని ఆబగా ఎదురు చూసి పాక్ క్రికెటర్లు భంగపడిన విషయం తెలిసిందే. ఒకప్పుడు అఫ్రిదినే ఐపీఎల్ అద్భుతం అంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఇప్పుడు మళ్లీ మాటమార్చి ఐపీఎల్ నుంచి పిలుపు వచ్చినా ఆడేది లేదంటూ ఆవేశపడ్డాడు. అసలు ఐపీఎల్లో ఆడాలని పాక్ క్రికెటర్లను అడిగింది ఎవరో అతనికే తెలియాలి. కొన్నేళ్ల నుంచి పాక్ క్రికెటర్లకు ఐపీఎల్లో చోటు దక్కని విషయం తెలిసిందే.