కాషాయం వదిలితేనే కాదల్ ఇస్తాను

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌వి కాషాయ రాజకీయాలు కాకూడదని అంటున్నారు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌. కమల్‌, రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడుకు రెండు కళ్లులాంటివారైన వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని రాజకీయాల్లోనూ కొనసాగిస్తూ తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై గతంలో కమల్‌ స్పందిస్తూ.. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కటే అయితే కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. తాజాగా కమల్‌ అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రజనీ రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావించారు. ‘రజనీ రాజకీయ రంగు కాషాయం(భాజపా) కాదని భావిస్తున్నా. అదే జరిగితే ఆయనతో కలిసి పనిచేయడం జరగదు. మేమిద్దరం మంచి స్నేహితులమే కానీ, రాజకీయాలు వేరు. ప్రస్తుతానికి దీనిపై స్పష్టత లేదు.’ అని అన్నారు. అవసరమైతే ఇతరులతో కలిసి పనిచేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. ఒకవేళ తన పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి, ప్రతిపక్షంలో కూర్చుంటానని అన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే తన సమయం వచ్చే వరకూ వేచి చూస్తానని తెలిపారు. ప్రజలతో కలిసి నడిచేందుకే తాను కొత్తగా పార్టీని ప్రారంభిస్తున్నానని, అంతేతప్ప రాజకీయ నాయకులతో కలిసి పనిచేసేందుకు కాదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కగా లేవని తాజా తమిళ రాజకీయాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ నెల 21 నుంచి కమల్‌ తమిళనాడులో పర్యటించనున్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే. అబ్దుల్‌ కలాం స్వస్థలమైన రామేశ్వరం నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అదే రోజున తన పార్టీకి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. అంతేకాదు.. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు వెల్లడించారు కమల్‌.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com