స్త్రీకి మాతృత్వం ఓ వరం. నవమాసాలు మోసి తీరా ప్రసవం సమయానికి ఒక్కోసారి చావు అంచులదాకా వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయినా కాన్పు తర్వాత బిడ్డను చూసుకుని ఆ బాధనంతా మర్చిపోతుంది. మరి అంతటి గొప్ప అనుభూతిని పొందడానికి కొందరు మహిళలను దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాల కిడ్నీ వ్యాధులకు గురైన మహిళలకు సంతానం పొందే అవకాశం 24శాతం తక్కువని చెబుతున్నారు. అంటే ప్రతి వందమందిలో 24మంది అమ్మతనానికి దూరమవుతున్నారన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం దాదాపు 195 మంది మహిళల్లో సుమారు ఆరు లక్షల మందిపైగా మహిళలు మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు. అంతేకాదు మహిళ మరణానికి కారణాల్లో కిడ్నీ వ్యాధులో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. మరో రెండు దశాబ్దాల తర్వాత ఈ సంఖ్య 5కి చేరుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులున్న మహిళల్లో వారు నివసించే ప్రదేశాన్ని బట్టి, అనుసరించే ఆహార, ఆరోగ్య నియమాలను బట్టి సంతాన సాఫల్యం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై బ్లూమ్ ఐవీఎఫ్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా.రిషికేష్ డి.పాయ్ మాట్లాడుతూ… ‘ఒక వేళ ఇలాంటి మహిళలు గర్భం దాల్చినా ప్రసవం సమయానికి క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది అపరిపక్వ బిడ్డకు జన్మనివ్వడం, మృత శిశువును ప్రసవించడం, పిల్లల్లో పెరుగుదల లోపించడం వంటి సంభవిస్తాయి. అయితే ఈ పరిస్థితి గురించి మన దేశంతో పాటు చాలా దేశాల్లో కనీస అవగాహన లేదు. దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద అశ్రద్ధ. దేశవ్యాప్తంగా కొన్ని నగర ప్రజలను, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై అధ్యయనం చేసినప్పుడు 67శాతం మందికి ఫాస్ట్ఫుడ్స్ అంటేనే ఆసక్తనే విషయం అర్థమైంది. పరిశుభ్రత లోపించిన ఆహారం శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. జీవన విధానం మారినప్పుడే ఇలాంటి సమస్యలకు ముగింపు పలకగలం’అని అన్నారు.