కుట్రల గురించి చంద్రబాబు ఆవేదన

తెలుగుదేశం ఎంపీలు అన్ని జిల్లాల్లో వారానికో కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పొత్తుతో సాధించలేనిది, పోరాటంతో సాధించాలని పిలుపునిచ్చారు. పోరాటంలో ప్రతి నిమిషం అమూల్యమన్న చంద్రబాబు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటు తగదని దిశానిర్దేశం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని, ఎంపీలంతా కడప వెళ్లి సంఘీభావం తెలపాలని సూచించారు. కడప తర్వాత విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. భాజాపా, వైకాపా కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. అమరావతి ప్రజాదర్బార్‌ హాల్‌లో పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. నీతిఆయోగ్‌ సమావేశం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. దిల్లీ వెళ్లి భాజాపా పెద్దలతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ కావడం.. వైకాపా, భాజపా కుట్రలకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. సీఎంవోలో విజయ్‌సాయిరెడ్డి తిష్టవేయడంపై గతంలో ఫోటోలు వచ్చాయని, ఇప్పుడు దిల్లీలో బుగ్గన, ఆకులతో కలిసి వెళ్లడంపై వీడియోలు కూడా వచ్చాయని అన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజాపా అడక్కుండానే వైకాపా భేషరతుగా మద్దతు పలకడాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350కోట్ల రూపాయలు వెనక్కి తీసుకోవడంపై కేంద్రాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసించాలని సూచించారు. రాజధాని అమరావతికి నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి చేయాలన్నారు. చట్టంలో 18అంశాలు, 6 హామీలు నెరవేర్చేదాకా పోరాడాలన్నారు. ఎన్టీఆర్‌తో పెట్టుకుని ఇందిరాగాంధీ చేతులు కాల్చుకున్నారని.. కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడం తెదేపాకి కొత్తేమీ కాదన్నారు. ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే ఇందిర కుట్రలను సమర్ధంగా ఎదుర్కొన్నామని ఇప్పుడు భాజాపా కుట్రలను కూడా అదే స్ఫూర్తితో అధిగమిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, 5కోట్ల ప్రజల హక్కులను పరిరక్షించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com