కులాలు పోతేనే అమరావతి నిలబడుతుంది

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా గెంటేశారు, ఒక పద్ధతి లేకుండా విభజన చేశారన్న ఆవేదనతోనే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదివారం అమరావతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘అమరావతిని ప్రారంభించినప్పుడు అందరిలానే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిగా, ముఖ్యంగా బాపట్లలో పుట్టిన వాడిగా ఇక్కడ రాజధాని రావడం నాకు ఇష్టమే. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సరైన విధి విధినాలతో ఎదుర్కొనేందుకు ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో జనసేన ఆవిర్భవించింది. గాంధీనగర్‌, చండీగఢ్‌ విడతల వారీగా అభివృద్ధి చెందింది. చండీగఢ్‌ను మొదటి దశలో భాగంగా 7,500వేల ఎకరాలతో, ఆ తర్వాత 8,500 ఎకరాలతో అభివృద్ధి చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఒక విశాల నగరం కట్టాలనే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు. అలా మన ముఖ్యమంత్రిగారికి కూడా ఉండొచ్చు. ఆ ఆకాంక్షలో భాగంగానే లంక రైతులు భూములను ఇచ్చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా’అని రైతులను అడిగాను. ‘లేదు మా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నా’మన్నారు. అవసరం మేరకే తీసుకోవాలని నేనంటా. సింగపూర్‌ తరహా పాలన కావాలనుకుంటున్నప్పుడు అక్కడ పాలకుల గురించి, వారి పాలన గురించి ముందు తెలుసుకోండి. లీక్‌వాన్‌యూ ఎలా చేశారో ఇంటర్నెట్‌లో చూడండి. అక్కడ భిన్న జాతుల వారు ఉన్నారు. వారంతా సింగపూర్‌ వాసులమని చెప్పుకొనేందుకు ఆయన గొప్ప త్యాగం చేశారు. అందరికీ ఒకే న్యాయం జరగాలని కృషి చేశారు. అందుకే సింగపూర్‌ అందరికీ అది ఒక ప్రమాణమైంది. అభివృద్ధి అందరికీ జరగాలి. అసమానతలే గొడవలకు కారణం. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలి.’’ ‘‘నా వల్ల సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టికి వెళ్తుంది. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాంతాలను ఒకలా, అధికార పక్ష ఎమ్మెల్యే ప్రాంతాలను మరోలా చూడకూడదు. జనసేన పార్టీ ఎవరినీ రాజకీయ లబ్దితో చూడదు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల గొడవలు ఎక్కువగా ఉంటాయి. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు అసమానతలు తొలగించాలి. కులాల కల్చర్‌ పోనంతవరకూ అమరావతి విశ్వనగరం కాదు. మనసులు విశాలంగా ఉండాలి. ప్రభుత్వం ఏమైతే చెప్పిందో వారికి సమాన న్యాయం చేయండి. ‘ఓట్లేస్తేనే అభివృద్ధి చేస్తాం’ అని అనవద్దు. ఈ ఉగాదినాడు శుభాలు పలకాలని నేను కోరుకుంటున్నా. దళిత భూములకు, అసైన్డ్‌ భూములకు అన్యాయం జరిగింది. దీనికి సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నా. రాజకీయాలంటే నాకు వ్యక్తులతో గొడవలు ఉండవు. ఏక వచన సంభోదనలు, తిట్లు నేను తిట్టను. నేను గొడవపడేది కేవలం పాలసీ విధానంపైనా, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపైనే. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకెళ్లవద్దు.’’ అని అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com