కూచిపూడికి పల్లకి మోసే బోయలుగా ఉంటాం

* సిలికానాంధ్ర అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనంలో ఆనంద్
* రెండో రోజు కార్యక్రమాల్లో పలు ఆలోచనాత్మక ప్రశ్నలు, అభిప్రాయాల పరస్పర మార్పిడి
silicon andhra tnilive kuchipudi confererence 2017 university of siliconandhra
కూచిపూడి నాట్య రీతులు, గతులు, జతులకు సంబంధించిన జ్ఞాన విజ్ఞానాలు తనకు గానీ తన బృంద సభ్యులకు గానీ ఇసుమంత అయినా లేదని, కానీ ఆ నాట్యరీతిని పల్లకిలో ఊరేగిస్తూ తమ చివరి ఊపిరి వరకు బోయలుగా సేవ చేస్తామని సిలికానాంధ్ర వ్యవస్థపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ పేర్కొన్నారు. సిలికానాంధ్ర సంస్థ ప్రతిష్ఠాత్మకంగా మిల్పిటాస్‌లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తోన్న రెండు రోజుల అఖిల అమెరికా కూచిపుడి సమ్మేళనంలో పలువురు కూచిపూడి గురువులు, నాట్యాచారిణుల ప్రత్యక్ష శిక్షణా తరగతుల ప్రదర్శనల అనంతరం మాట్లాడారు. భామాకలాపం అయినా, పారిజాతపహరణం అయినా ఆయా ఆవృత్తుల వెనుక చరిత్ర తెలుసుకుని సాధన చేసి ప్రదర్శించాలని తద్వార ప్రేక్షకులకు మరింత చేరువ కావడమే గాక వారిలో రసానుభూతిని రగిలించిన వారిగా నిలిచిపోతామని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు ఉదయం సమావేశాల్లో ఆనంద్ నాందీ వచనాలు పలికిన అనంతరం ప్రఖ్యాత నాట్యాచారిణి, గురువు డా.యశోదా టాకూర్ దేవదాసీల చరిత్రపై ప్రసంగించారు. ఆలయాల్లో, రాజుల ఆస్థానంలో, జమీందారుల వద్ద మూడు విభాగాల్లో దేవదాసీలు ప్రదర్శనలు ఇచ్చేవారని ఆమె తన ఉపాన్యాసాన్ని ప్రారంభించారు. ఎటువంటి విద్యా సౌకర్యాలు లేని ఆ పూర్వపు రోజుల్లో దేవదాసీలు అమరకోశాలను ఔపోసన పట్టారని వారు ఆ కాలంలో సమున్నత విద్యావంతులని ఆమె పేర్కొన్నారు. దేవదాసీ యాక్ట్ వెనుక బ్రాహణుల హస్తం ఉందనేది పూర్తిగా అవాస్తవమని దేవదాసీ వృత్తిని తద్వారా నాట్యకళలను పరిరక్షించాలని ఆ రోజుల్లో బ్రాహ్మణ సమాజంలోని న్యాయవాదులు ఎంతో నిబద్ధతతో ప్రయత్నించారని పేర్కొన్నారు. భరతనాట్య మూలాలు దేవదాసీల ప్రదర్శనల్లో ప్రస్ఫుటంగా ప్రకాశిస్తాయని ఆమె తెలిపారు. ఆమె కూర్చుని చేసిన అభినయం, జావళి నృత్యాలు ప్రధానాకర్షణగా నిలిచాయి.

ప్రముఖ నాట్య గురువు డా.సుమతీ కౌశల్ తన 50ఏళ్ల కూచిపూడి ప్రస్థానంలో ఎదురైన పలు మధురానుభవాలాను సభికులతో పంచుకున్నారు. ఏ నాట్యమైనా సాధన చేస్తేనే సొంతమవుతుందని, తన భర్త సలహా మేరకు ఒక్కో ప్రదర్శనను రెండుసార్లు సాధన చేసి గొప్పగా తాను భావించే రోజుల్లో తనకు తారసపడిన కొందరు మహాగురువులు రోజులో 18గంటలు సాధనా తపస్సు చేసేవారని, అటువంటి గురువుల కింద శిక్షణ పొందినందువలనే తాము ఈ స్థాయికి వచ్చామని ఆమె నెమరవేసుకున్నారు. కూచిపూడి గ్రామంలో వానాకాలం బంక మట్టి బురదలో వెళ్లి మరీ నూతన నాట్యరీతులు నేర్చుకున్న సంగతులను ఆమె సభికులతో పంచుకున్నారు. ఈమె ప్రసంగం అనంతరం ఆనంద్ మాట్లాడుతూ కళ వలన కళాకారులు బతుకుతున్నారు తప్ప కళాకారుల వలన కళ జీవిస్తోందనుకోవడం తప్పని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత యామినీ కృష్ణమూర్తి ఢిలీల్లో పురస్కారం తీసుకుని అందలమెక్కితే ఆమె గురువు పసుమర్తి వెంకట గోపాలకృష్ణ శర్మ చిరిగిన పంచెతో కూచిపూడి గ్రామంలో బస్టాండుకు వెళ్లలేక అవస్థలు పడిన అతి దయనీయ దీనస్థితిని ఉటంకించారు. సిలికానాంధ్ర రూ.1.౬౦కోట్లు, ఏపీ ప్రభుత్వం అందించిన రూ.1.౬౦కోట్లు నిధులతో కూచిపూడి గ్రామంలో 8కిమీ మేర రాదారులు నిర్మించామని కూచిపూడికి కాపు కాసే తొలి పూర్తి బాధ్యత సిలికానాంధ్రదేనని ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన యోగా, కూచిపూడి నాట్యాచారిణి రోక్షేన్ మట్లాడుతూ లింగ ఆధారిత వివక్ష వదిలేసి విశాల దృక్పథం అలవరుచుకుంటే ఎటువంటి కళ ఐనా రాణిస్తుందని పేర్కొన్నారు. డా.సుమిత్రా వేలూరి వాచికాభినయంపై ప్రసంగించి రెండో రోజు ఉదయం సమావేశాలను ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ప్రముఖ వైద్యులు డా.హనిమిరెడ్డి లక్కిరెడ్డి, సభల చైర్మన్ దిలీప్ కోండిపర్తి, కన్వీనర్ జ్యోతి చింతలపూడి, సిలికానాంధ్ర సీఈఓ రాజు చమర్తి, సీ.ఎఫ్.ఓ దీనబాబు కొండుభట్ల, బాలక్క, అనుపమ కైలాష్, కోట్ని శ్రీరాం-జయంతి, ప్రభ మాలెంపాటి, కొండా శాంతి, కొండా వెంకట్, జుర్రు చెన్నయ్య, గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com