కూచిపూడి ఆనందమే సిలికానాంధ్ర సంపద-TNI ప్రత్యేక సమీక్ష


సంపద వలన పంచేంద్రియాలకు ఐహికసహిత ఆనందం ప్రకాశిస్తుంది. కానీ సిలికానాంధ్ర “సంపద” ద్వారా ఉత్తమాంగ సంతృప్తితో పాటు పారమాత్మికైన మానసిక ప్రశాంత శోభ కూడా పరిఢవిల్లుతుంది. రెండు రోజుల పాటు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో గల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డా.లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో నిర్వహించిన అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనంలో శైలుషీ విదూషాన్ని ఆస్వాదించిన ఎవరైనా దీన్ని నిజం కాదనలేరు. వీధిభాగవతారులు-దేవదాసీల నాట్యరీతుల భంగిమలను సిద్ధేంద్ర యోగి సమ్మోహనముగా సంయుక్తపరిచి వేదాంతం, వెంపటి, చింతా, పసుమర్తి వంటి వారికి వడ్డించిన ఫలాల మాధుర్యం దశాబ్దాలు, శతాబ్దాల తరబడి అప్పటి శిష్యులు, నేటి గురువుల రూపేణా ఇంకా రుచికెక్కాయనే వాదన ఈ సమ్మేళనం ద్వారా మరోసారి నిరూపితమైన వాస్తవం. కూచిపూడి క్రాష్ కోర్సులా, ప్రభల ప్రతిభా ప్రతీకమైన కళాకారుల సంగమంగా ఈ వేదిక వినుతికెక్కడం తెలుగువారందరికీ పండుగ దినోత్సవం. అనుపల్లవి, స్వరపల్లవి, స్వరజతి, నట్టువాంగం, థిల్లానా, మేజువాణి, పదం, దరువు, ఆంగికాభినయం, నేత్రవిలాసం, తాళవైవిధ్యం, సాత్వికాభినయం, వాచికాభినయం, దేవదాసీల చరిత్ర, గొల్ల కలాపం, స్వరసంకలనం వంటి ఎన్నో పాత విషయాలు కొత్త బట్టలు వేసుకుని ఈ సభామండపం వద్ద తమదైన శైలిలో నర్తించి నటరాజుకు జోహార్లు అర్పించాయి. కూచిపూడికీ భరతనాట్యానికీ మధ్య ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వ్యత్యాసాలను వివరించిన తీరు ఎందరో బాలవిద్యార్థులకు విలువైన ప్రారంభ స్థానం.
kuchipudi siliconandhra tnilive kuchipudi in usa items anand kuchibhotla lakireddy hanimireddy jyothi chintalapudi kuchipudi
మగాడికి మొనగాడికి మధ్య వ్యత్యాసాన్ని నిర్ణయించేది – ఆసక్తికి తపనకి మధ్యన ఉండే ఓ చిన్నగీత. ప్రతివారికి తెలుగుకు ఏదో చేయాలనే ఆసక్తి ఉంటుంది. వీరు మగాళ్లు. కొందరికి ఆ ఆసక్తి ప్రచార సాధనాల పట్ల వల్లమాలిన ప్రేమ వలన కలిగే తాత్కాలిక అలవాటు అయినప్పటికీ ఎక్కడో కొద్దిమందికి మాత్రమే ఎట్టిపరిస్థితుల్లో అయినా తెలుగుకు వెలుగులు అద్దాలనే తపన ఉంటుంది. వీరు మొనగాళ్లు. అటువంటి మొనగాళ్లు, తపనకారుల తొలిచిరునామాగా గడిచిన శని,ఆదివారాల్లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భాసిల్లింది. సహజంగా తెలుగు సంఘాల కార్యక్రమాల్లో సూటు, బూటు, ఘాటైన సెంటు కొట్టుకుని మొదటి వరుస కుర్చీల కోసం తద్వారా టీవీల్లో ప్రచార ప్రసారం కోసం పాకులాడేవారిని విరివిగా చూస్తుంటాం. కానీ సిలికానాంధ్ర నాయకాగణం అందరూ దైనందిన కూలీల మాదిరి కుర్చీలు ఏర్పాటు చేయడం నుండి ఖాళీ గ్లాసులు ఏరడం వరకు అన్నీ గంజీ ఇస్త్రీ పట్టించిన పంచె నిండుగా కట్టుకుని అవసరమైనప్పుడు ఎగ్గట్టుకుని మరీ బాధ్యతగా చేయడం వారి కర్తవ్యదీక్షకు నిదర్శనం. తమ కార్యక్రమానికి వచ్చినవారికే గాక ప్రపంచంలోని కూచిపూడి అభిమానులందరికీ ఈ సమ్మేళనం ద్వారా లభించే పాఠాలు లాభించాలని తలచి ప్రత్యక్ష ప్రసారాన్ని సైతం ఏర్పాటు చేయడం వీరి కళాభిమానానికి తార్కాణం.
kuchipudi university of siliconandhra
తొలిరోజు సాయంత్రం సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వేదిక మీద పాతికమంది నటరాజు అంశలను సత్కరించిన అనంతరం మాట్లాడుతూ మీమాంశ లేకుండా సిలికానాంధ్ర “సంపద”(Silicon Andhra Music, Performing Arts & Dance Academy) కూచిపూడి ఆనందాన్ని పంచుతూ, అందాన్ని పెంచుతూ భావితరాల వారికి ఓ విద్యాలయంగా ఉపయుక్తమవుతుందని పేర్కొనడం సిద్ధేంద్రుడికి నిజమైన తర్పణం. నాట్యగురువులు అందరూ తమతో పాటు తమ విద్యార్థులను కూడా వారి “సంపద”లో భాగస్వాములను చేయాలని తద్వారా ఓ కళాకారుల సంగమంగానే “సంపద” వెలుగొందడం గాక విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో WASC గుర్తింపు పొందిన “సంపద” అర్హతాపత్రాల ద్వారా లబ్ధి పొందుతారనడటం ఒకే దెబ్బకి రెండుపిట్టలను కొట్టడం అనే నానుడికి నిజజీవన ఉదాహరణం. విద్యార్థులు ఈ అర్హతాపత్రాలను గోడకు తగిలించుకోకుండా భారతీయ కళల ఉనికిని ప్రచారం చేసే బాధ్యతను కణికలుగా పుణికి పుచ్చుకుని మరీ వ్యాప్తిలోకి తీసుకొస్తారని…ఈ క్రమంలో ప్రపంచ సంస్కృతుల్లోకి మనదైన కళలు చొచ్చుకుపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తపరచడం ముదావహం. సిలికానాంధ్ర ముడినగలో నాట్యగురువులనే వజ్రాలను, నిత్యవిద్యార్థులనే ముత్యాలను పొదగడానికి అందరూ కలిసి కదిలిరావాలన్న ఆయన పిలుపు ఆశావహం.
kuchipudi usa sammelanam convention kuchipudi siliconandhra
ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆహ్వాన పత్రికలు అందుకున్న నర్తకీమణులు, గురువులు కొందరు కావాలనే మొహం చాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినప్పటికీ వచ్చిన వారంతా లబ్దప్రతిష్ఠులు కావడం, సభ సదాశయాన్ని ఆకళింపు చేసుకోవడం వేడుకలకు వన్నె తెచ్చింది. మనబడి కార్యక్రమం విజయవపథంలో దూసుకుపోతూ తెలుగుకు పరుగులు నేర్పిస్తున్న తరుణంలో కూచిపూడి వంటి ఖరీదైన నాట్యకళను విస్తృతం చేసే సంకల్పంతో నిర్వహించిన ఈ సమ్మేళనం లక్ష్మీదేవి కరుణకు కాసింత దూరంగానే నిలబడాల్సి వచ్చిందనేది బాధాకరం. విమానం ఎక్కబోతూ అది ప్రమాదానికి గురైతే తాను ఇచ్చిన మాటకు ఎక్కడ తలొంపులు వస్తాయనే ఆలోచనతో ముందుగానే చెక్కు రాసి ఇంట్లో పెట్టి విమానం ఎక్కే డా.లకిరెడ్డి హనిమిరెడ్డి లాంటి ఆసేతు హిమాచల స్థాయి స్వాప్నికుడు, సేవకుడు, వదాన్యుల దాతృత్వంతో భరతమాతకు తెలుగు తిలకం దిద్దిన సిలికానాంధ్ర కార్యకర్తలు ఇప్పుడు కూచిపూడి వాడీ నాడీలకు పుచీపడే జోడీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “జయహో కూచిపూడి” కార్యక్రమ పరిమితులు కృష్ణా జిల్లా దాటి వస్తాయనే సమాచారంపై ఎటువంటి స్పష్టత లేని సమయంలో ఓ ఆశయసాధన కోసం “సంపద”ను సృష్టించిన సిలికానాంధ్ర బృందం ప్రస్తుతం ఆ ఆశయసిద్ధి కోసం సంపదను వెదకడం ప్రాధామ్యంగా మలుచుకుంది. వారి స్థాయి నిబద్ధత, నిజాయితీలకు ఇది పున్నమి రాతిరి మిణుగురుల వేట వంటిది.
lakireddy siliconandhra
tnilive kuchipudi usa
రానున్న అయిదారేళ్లలో 300-600 ఎకరాల్లో సువిశాల స్థలంలో తమకంటూ ఓ విశ్వవిద్యాలయ ప్రాంగణం ఏర్పాటు చేసుకుని అమెరికాకే గాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మన కళలు, నాట్యరీతులు, సంస్కృతి, సాంప్రదాయాలకు చిరునామాగా వినుతికెక్కాలనుకుంటున్న సిలికానాంధ్ర కదన కుతూహలాగ్నికి TNI ఓ సమిధగా తోడ్పడుతుందని తెలియజేస్తూ….అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనాన్ని దిగ్విజయంగా నడిపించిన వారందరికీ అభినందనలు.—సుందరసుందరి(sundarasundari@aol.com)
kuchipudi siliconandhra usa
tnilive kuchipudi usa siliconandhra california kuchipudi
tnilive jayaho kuchipudi

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com