కూచిపూడి సుగంధాలతో పరవశించిన అమెరికా


* ముగిసిన సిలికానాంధ్ర కూచిపూడి సమ్మేళనం
సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో మిల్పిటాస్ నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనం ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. కూచిపూడి నాట్యరీతికి సంబంధించిన అన్ని అంశాలను సున్నితింగ స్పృశించి అమెరికా ప్రవాసులకు దాని పరిమళాలను మధురంగా పంచింది. ముగింపు రోజు వేడుకల్లో భాగంగా పలువురు నర్తకీమణుల ప్రత్యక్ష ప్రదర్శనలు కూచిపూడి నాట్యరీతి పట్ల విలువైన సమాచారాన్ని అందించింది. భక్తి సాహిత్యంలో చిత్రాల ఆధారంగా అభినయంపై డా.అనుపమ కైలాష్, భరతనాట్యం కూచిపూడిల మధ్య వ్యత్యాసాలపై శోభా నటరాజన్, నాట్యశాస్త్రం కూచిపూడిల మధ్య సంబంధాలపై డా.పప్పు వేణుగోపాలరావు ప్రసంగాలు మధ్యాహ్నం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించారు. సాయంకాల కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డిని సిలికానాంధ్ర నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. హనిమిరెడ్డి మాట్లాడుతూ రాజులెందరు ఉన్నా శ్రీకృష్ణదేవరాయులే ప్రథమంగా నిలుస్తారని అలానే తెలుగు సంస్థలు ఎన్ని ఉన్నా సిలికానాంధ్ర తొలిస్థానంలో నిలుస్తుందని దానికి కారణం కళాపోషణ అని పేర్కొన్నారు. తనకు దేవుడు దానం చేసే శక్తిని ఇచ్చాడని, సిలికానాంధ్ర వంటి సంస్థలకు అందుకునే అర్హతను ఇచ్చాడని ఆయన కొనియాడారు. శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ అశోక్ వెంకటేశన్ సాయంకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ సత్యభామ-శ్రీకృష్ణ్ల సంభాషాణల మధ్య పద్యాలను ఆలపించగా అశోక్ దానికి ప్రతిస్పందిస్తూ గోపాలకృష్ణ ఆలపించిన తెలుగు పద్యం అర్థం తనకి తెలియకపోయినా దాని విలువను, భావాన్ని, ఆర్ద్రతను తాను అర్థం చేసుకోగలిగానని ఆ శక్తి కళలకు ఉన్నదని ఆయన సంతోషం వ్యక్తపరిచారు. సిలికానంధ్ర అభ్యర్థన మేరకు వచ్చే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాన్సులేట్ సహకారంతో నిర్వహిస్తామని అశోక్ తెలిపారు. అనంతరం ఆయన్ను, కాన్సుల్ అధికారి కూచిభొట్ల వెంకటరమణలను డా.హనిమిరెడ్డి సత్కరించారు. ఆనంద్ మాట్లాడుతూ కూచిపూడి గ్రామంతో పాటు దాని చుట్టు పక్కల 5లక్షల మంది ప్రజానీకానికి సరైన ఆరోగ్య సదుపాయం లేదని దీన్ని గుర్తించిన సిలికానాంధ్ర సంజీవిని పేరిట ఆసుపత్రిని నిర్మిస్తోందని దీనికి ప్రవాసులు తోడ్పడవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణానికి విరాళంగా $50 అందించవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం సమిధా సత్యం విద్యార్థుల స్వరజతి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. కూచిపూడి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల బృందావని తిల్లాన, డా.సిందూరి జయసింగే ప్రత్యక్ష వాయిద్యాలపై ప్రదర్శన, సునీత పెందెకంటి శిష్యుల నారాయణ నృత్యమాల, డా.రమాదేవిచే జక్కిని దరువు రూపకంలో పసుమర్తి వెంకట గోపాలకృష్ణ శర్మకు నీరజనం, కళారత్న బాలా కొండలరావు ఆధ్వర్యంలో కూచిపూడి వైభవం పేరిట నిర్వహించిన ముగింపోత్సవం అతిథులను మైమరిపించాయి. సిలికానాంధ్ర ప్రధాన కార్యదర్శి మాలెంపాటి ప్రభ వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి. ఈ వేడుకలను చైర్మన్ దిలీప్ కొండిపర్తి, కన్వీనర్ జ్యోతి చింతలపూడి, సిలికానాంధ్ర సీఈఓ రాజు చమర్తి, సీఎఫ్ఓ దీనబాబు కొండుభట్ల తదితరులు సమన్వయపరిచారు.More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com