కేంద్ర కుంభకోణాలను బయట పెడతాం

ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు కేంద్ర ప్రభుత్వంపైనా, భాజపా నేతలపైనా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతోందన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో దాన్ని బయట పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. గుర్తు పెట్టుకోండి.. కచ్చితంగా ప్రకంపనలు పుట్టిస్తాం అని భాజపా నేతలను హెచ్చరించారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. యూసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పరిశీలనకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సిద్ధమా? అని ప్రశ్నించారు. జీవీఎల్‌ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోబెల్స్‌ మాదిరిగా ప్రచారం చేయడంలో ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై వాస్తవాలు వెల్లడించేందుకు కేంద్రం తరఫున నలుగురిని, రాష్ట్రం తరఫున నలుగురిని పెట్టి చర్చిద్దామని సవాల్‌ విసిరినా జీవీఎల్‌ స్పందించలేదని కుటుంబరావు ఆరోపించారు. 2016లో దిల్లీ – ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు రూ.495 కోట్లు కేటాయిస్తే.. దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం 4.5 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ఎస్పీవీ పెడితే శ్రీకాళహస్తి, కృష్ణపట్నం అభివృద్ధి చేస్తామంటున్నారని గుర్తు చేశారు. దేశంలో 25 నోడ్స్‌ ఉంటే ఐదు నోడ్స్‌ గుజరాత్‌లోనే ఉన్నాయన్నారు. ఈ ఐదు నోడ్స్‌లో కూడా డొలేరాకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని విమర్శించారు. కృష్ణపట్నం నోడ్ విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. యూసీలు అడగడానికి జీవీఎల్‌ ఎవరని నిలదీశారు. నిధుల మళ్లింపు, యూసీల విషయంలో సమావేశం ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. తప్పని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు. జీవీఎల్‌ సహా భాజపా నేతలెవ్వరూ వార్డు సభ్యులు కూడా కాలేరని విమర్శించారు. తొమ్మిది నెలల్లో అద్భుతంగా భాజపా జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా? అని నిలదీశారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. పీఎంవోలో ఫైల్‌ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని ఆరోపించారు. ఎయిర్‌ ఏషియా వ్యవహారంలో 85శాతం పని యూపీఏ-2లో పూర్తయిందని.. ఎయిర్‌ ఏషియా వ్యవహారానికి ఆమోదం తెలిపింది మోదీ కేబినెటేనన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com