కొత్త ఏడాదిలో సరికొత్త ఆహారం

మన జీవన విధానం ఎన్నో కొత్త రకాల వ్యాధులకు నిలయం అయిపోయింది. అందుకే, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇప్పుడు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా తులసి రసం, పసుపు, మిరియాల కషాయం, అశ్వగంధ, యాపిల్‌ సిడార్‌, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు… లాంటి వాటితో చేసే టానిక్కులు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చాయి. ఆరోగ్యాన్నీ వ్యాధి నిరోధక శక్తినీ పెంచేందుకు వస్తున్న ఈ టానిక్కులు 2017లో బాగా ప్రాచుర్యంపొందే అవకాశం ఉందట. ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారత్‌ కాబట్టి వీటి వాడుక మన దేశంలో మరింతగా పెరగొచ్చు. వంకాయ రంగు పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మామూలు క్యారెట్లతో పోలిస్తే వూదారంగు వాటిలో 28శాతం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయంటేనే ఆ విషయం అర్థం చేసుకోవచ్చు. ఇవి వృద్ధాప్య లక్షణాలను నిలువరించి యవ్వనంగా ఉండేందుకు తోడ్పడతాయి. వంకాయలూ, ఆ రంగులో ఉండే క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, ఆలూ, బెర్రీ, ద్రాక్ష, నలుపు బియ్యంలాంటి వాటన్నిటిలోనూ ఉండే వూదారంగు వర్ణద్రవ్యంలోని ఫ్లేవనాయిడ్లు రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు, కొన్నిరకాల క్యాన్సర్లను నిరోధించే వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వూదారంగు కూరగాయలూ పండ్ల లాభాలెన్నో. అందుకే, ఈ ఏడాది వీటిదే హవా. వెల్లుల్లి అనగానే మనకు గుర్తొచ్చేది తెలుపు రంగే. కానీ ముందు ముందు నలుపు వెల్లుల్లికి ఆదరణ బాగా పెరిగిపోతుందట. మామూలు వెల్లుల్లిని కొన్ని రోజులపాటు ప్రత్యేక పద్ధతుల్లో వేడి చేసి వీటిని తయారు చేస్తారు. ఈ నల్ల వెల్లుల్లి పేస్టుతో చేసిన వంటకాలు రుచిగా ఉండడంతో పాటు, ఆరోగ్యానికీ మంచివట. అందుకే, వీటితో సాస్‌లు కూడా చేస్తున్నారు. దీంతోపాటు, నల్ల నువ్వుల పేస్టు, దానిమ్మ జామ్‌, బీట్‌రూట్‌ సాల్సా, మెక్సికన్‌ హాట్‌ చాకొలేట్‌ స్ప్రెడ్‌… లాంటి వాటి వాడకం పెరుగుతుందట. మామూలు పాస్తాలో ఉండే పోషక విలువలు చాలా తక్కువ. అందుకే, ఇప్పుడు క్వినోవా, పప్పు ధాన్యాలూ, శనగలూ, సీ వీడ్‌, కీరా, క్యారెట్‌, బీట్‌రూట్‌ లాంటి వాటితో పాస్తా, నూడుల్స్‌లను తయారు చేస్తున్నారు. ఆరోగ్యం కోసం తపించేవాళ్లకు ఇలాంటివి నచ్చకుండా ఉంటాయా… ఈ కారణంతోనే 2017లో వీటి అమ్మకాలు బాగా పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి. కొబ్బరిలో ఉన్న ఔషధ గుణాల దృష్ట్యా గత మూడు నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. అందులోభాగంగానే కొబ్బరి ఐస్‌క్రీమ్‌, కొబ్బరి చిప్స్‌, కొబ్బరి బటర్‌, వేరు వేరు వంటకాలు చేసుకునేందుకు కొబ్బరి పిండి, కొబ్బరి పంచదార(పంచదారకు ప్రత్యామ్నాయంగా తయారు చేసే దీన్లో 16 రకాల అమైనో యాసిడ్లూ నాలుగు రకాల బీ విటమిన్లూ మరెన్నో పోషకాలు ఉంటాయి)… ఇలా ఎందెందు వెదకినా అందందు కలదు కొబ్బరి అన్నట్లూ ఎన్నెన్నో కొబ్బరి ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకే, కొత్త ఏడాదిలో హాటెస్ట్‌ ఆహార పదార్థం ఇదేనట.
వీటితో పాటు, వంటచేసుకునే సమయం లేనివారికోసం ‘ఓవెన్‌ రెడీ మీల్‌ కిట్స్‌’ కూడా బాగా ప్రాచుర్యం పొందుతాయట. ముందే ఉడికించి ప్యాక్‌ చేసిన వీటిని ఓవెన్‌లో కొన్ని నిమిషాలు ఉంచి తీసి తినేయొచ్చన్నమాట. వీటిలోనూ బ్రౌన్‌రైస్‌, కూరగాయలూ పప్పుధాన్యాలతో చేసిన వాటికే ఎక్కువమంది ఓటేస్తున్నారు. ఇకపోతే, జపనీయుల సీవీడ్‌ వంటకాలూ నువ్వుల నూనెతో వారు చేసుకునే పదార్థాలూ పచ్చళ్లక్కూడా గిరాకీ పెరుగుతుందంటున్నారు నిపుణులు. జపనీయుల ఆరోగ్యానికి కారణం వారు తినే ఆహారమే అని ఎన్నో పరిశోధనల్లో తేలడమే అందుక్కారణం. మొత్తమ్మీద చూస్తే… జనం 2017లో ఆరోగ్యానికి బాగానే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. శుభం… ఆరోగ్యమస్తు!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com