కోటి రూపాయిల పైగా రాముడికి ఆదాయం

శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా రామాలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గత నెల 18 నుంచి ఈ నెల 1 వరకు నవమి వేడుకలు నిర్వహించారు. గతంతో పోల్చితే చాలా విభాగాల్లో ఈసారి ఆదాయ పెరుగుదల అధికంగా ఉంది. లడ్డూలపై ఆదాయం అంతగా లేదు. వీటిని తయారు చేపించేందుకు దాదాపు అదే స్థాయిలో వెచ్చించాల్సి వచ్చింది. హుండీ ఆదాయాన్ని రెండ్రోజులపాటు లెక్కించగా రూ.1,18,08,260 సమకూరింది. ఇందులో బుధవారం రూ.94.10 లక్షలు రాగా గురువారం మధ్యాహ్నం వరకు సాగిన లెక్కింపులో రూ.23,97,588 ఆదాయం వచ్చిందని ఈవో ప్రభాకర శ్రీనివాస్‌, ఏఈవో శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. బంగారం 130 గ్రాములు ఉండగా వెండి ఒక కిలో 250 గ్రాములు సమకూరింది. గత ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలకు రూ.1.01 కోట్లు ఆదాయం హుండీల రూపంలో వచ్చింది. ఈ లెక్కల ప్రకారం రూ.17 లక్షల మేర పెరిగినట్లు భావిస్తున్నారు. గత ఉత్సవాల సమయంలో 42 రోజుల ఆదాయాన్ని లెక్కించగా ఆ మొత్తం వచ్చింది. ఈసారి 51 రోజుల ఆదాయం ఇది. సాధారణంగానే రోజుకు రూ.1.6 లక్షల ఆదాయం హుండీలో వస్తుంది. ఇలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం గతం కంటే సుమారు రూ.3 లక్షలు పెరిగి ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా విళంబినామ వత్సర పుణ్యమా అని ఆదాయం పెరగడం విశేషం. సెక్టార్లపైనే రాముడి ఆదాయం కాస్త ఆశాజనకంగా కనిపిస్తుంది. మొత్తం టిక్కెట్‌లు 22815 ఉండగా వీటిలో విక్రయించినవి 15339. మిగిలినవి 7476. వాస్తవంగా రావాల్సిన ఆదాయం రూ.1.47 కోట్లు. వచ్చింది రూ.1.24 కోట్లు. సకాలంలో కొన్ని టిక్కెట్‌లను విక్రయించడంలో సమన్వయం లోపించడం వల్ల రూ.23.24 లక్షల విలువైన టిక్కెట్‌లను మిగిల్చారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దవడంతో ఆ సెక్టార్‌ను కూడా విక్రయించడం వల్ల ఆదాయంలో పెరుగుదల కనిపించింది. 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సరం విశిష్టత భక్తులను భద్రాద్రికి భారీగా తీసుకు రాగలిగింది. ఈ ఉత్సవాలకు అన్ని శాఖలకు కలిపి సుమారు రూ.1.3 కోట్ల ఖర్చు అయి ఉంటుందని తెలిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com