కోడిపందేలు కావు. అదే సంక్రాంతి గొప్పదనం

సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో- ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. ‘తిల సంక్రాంతి’గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు, మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి, ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా- మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, తిలలతో కూడిన పదార్థాల నివేదన- శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక- ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా-యమునా-సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం. ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో, స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు.దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి… ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. సూర్యుణ్ని నారాయణుడిగా; శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక, పంటల శోభ, సంపదల పుష్టి… అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయసిద్ధమైన కళలు, ఉత్సాహాల ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు- వెరసి సంక్రాంతి వైభవాలు!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com