కోమటిరెడ్డి కుమారుడిని హత్య చేసిన నయీం?

మానిపోతున్న గాయాన్ని ప్రాణం పోయిన ఓ గొంతుక మళ్ళీ రేపింది. ఒక జీవితకాలమంతా మర్చిపోలేని కడుపుకోతను అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ అమ్మానాన్నల గుండెను మరోసారి పుండు చేసింది. షాద్‌నగర్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం నేలకొరిగినా… పూటకొకటిగా బయటకొస్తున్న అతని అకృత్యాలు ఎన్ని జీవితాలతో ఆటలాడుకున్నాయో సోమవారం బయటకొచ్చిన అతని బెదిరింపుల వార్త కర్కశంగా బయటపెట్టింది. భువనగిరికి చెందిన రైస్ మిల్లర్ గంపా నాగేంద్రను గతంలో నయీం బెదిరించినప్పుడు రికార్డు అయిన ఆడియో (పై వీడియో చూడండి…), ఆ వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్‌స్టర్ మాటలు ఇప్పుడు తూటాల్లా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని తాకాయి. “కోమటిరెడ్డి కొడుకును చంపినట్లే.. నీ పిల్లల్నీ చంపేస్తా !” (కింది లింకులోని వార్త) అంటూ నయీం వార్నింగ్ ఇచ్చాడని నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో నాటి దుర్ఘటన జ్ఞాపకాలు కోమటిరెడ్డి కుటుంబాన్ని తట్టిలేపాయి. పిల్లలు ఏదో ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని, విధి రాత అంటూ ఆ కన్నప్రాణాలు సరిపెట్టుకుని ఆ జ్ఞాపకాలలో జీవిస్తుంటే… ఉన్నట్టుండి నేనే చంపేశానంటూ నయీం గొంతుక విచ్చుకత్తిలా విసురుగా వచ్చి వినిపించింది. ఐదేళ్ళ నాటి ఆ ఘోర ప్రమాద నేపథ్యంపై మరోసారి కలకలం రేపింది. ప్రతీక్‌ను చంపించినట్టుగా తన పిల్లల్ని కూడా చంపుతానని నయీం బెదిరించినట్లు రైస్ మిల్లర్ నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కేవలం నాగేంద్రను బెదిరించేందుకే ప్రతీక్ మరణాన్ని నయీం తన ఖాతాలో వేసుకున్నాడా… లేదంటే నయీం చెప్పింది నిజంగా నిజమేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ముందుగా ప్రతీక్ మరణానికి దారితీసిన పరిస్థితిని గమనిద్దాం… డిసెంబర్ 20, 2011న మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి, అతని స్నేహితులు సుజిత్, చంద్రారెడ్డి, ఆరవ్ రెడ్డి స్కోడా వాహనంలో గండిపేట నుంచి కొల్లూర్ గ్రామ ఔటర్ రింగ్ సర్వీసు రోడ్డువైపు గంటకు 150 కిలోమీటర్ల (స్పీడో మీటర్ దృశ్యాల ఆధారంగా) వేగంతో వచ్చారు. అదే సమయానికి అటుగా వచ్చిన మేకలు, గొర్రెల మందను తప్పించబోయారు. కానీ, అతి వేగం వల్ల ఈ కారు వాటిని ఢీకొని ఏడెనిమిది పల్టీలు కొట్టి, 30 అడుగుల ఎత్తుకు ఎగిరి మళ్ళీ సర్వీస్ రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ప్రతీక్‌తో పాటు సుజిత్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మరణించారు. వీరి మృతదేహాలు దాదాపు 60 నుంచి 100 మీటర్ల దూరాన రోడ్డు పైన, పక్కన, పొల్లాల్లోను చెల్లాచెదురుగా పడ్డాయి. ఇదీ నాటి పరిస్థితి. దీనిని అందరూ రోడ్డు ప్రమాదంగానే భావించారు. ఆ వాహనంలో మద్యం సీసాలు ఉన్నట్టు కూడా అనుమానాలు తలెత్తాయి. అతివేగంగా నడపడం లేదా మద్యం తాగి నడపడం వల్ల మాత్రమే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావించారు. పోలీసు దర్యాప్తులో కూడా ఇది హత్య అనే విధంగా ఎలాంటి ఆధారాలూ బయటకు రాలేదు. కానీ, నయీం మాటలతో (కింది లింకులోని వార్త) ఇప్పుడు అందరూ ఉలిక్కి పడ్డారు. అయితే, ప్రతీక్ మరణానికి కొద్దిరోజుల ముందు కోమటిరెడ్డి కుటుంబానికి కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ గురించి కోమటిరెడ్డి కుటుంబం పోలీసులకు చెప్పినప్పటికీ, వారు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోలేకపోయారని సమాచారం. అయితే, కేవలం దీని ఆధారంగా అది హత్య అని భావించలేమని, ఆ సంఘటనపై మరోసారి దర్యాప్తు జరిగితే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తన కుమారుడిని హత్య చేసినట్లు నయీం చెప్పాడన్న విషయం బయటపడిన నేపథ్యంలో మంగళవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చాలా విచారంగా ఉన్నట్లు తెలిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com