కోరి శత్రువులను ఎందుకు తయారు చేసుకోవడం?

తన రాజకీయ ప్రయాణంలో స్నేహితులను శత్రువులుగా మార్చుకోలేనని అంటున్నారు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌. తన చిరకాల స్నేహితుడైన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశిస్తూ‌ కమల్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వస్తు్న్నట్లు గత డిసెంబర్‌ 31న రజనీకాంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌, రజనీ కలిసి ఒకే పార్టీ పెట్టబోతున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. మరోపక్క రాజకీయం విషయంలో కమల్‌..రజనీతో ఎన్నటికీ చేతులు కలపరని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం గురించి కమల్‌.. ఓ తమిళ పత్రికకు రాసిన ఆర్టికల్‌లో స్పందించారు. ‘ నా రాజకీయ ప్రయాణంలో స్నేహితులను శత్రువులుగా మార్చుకోలేను. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఇలాంటి పనులు చేయను. ఇలా చేయడం ప్రజలకు కూడా నచ్చదు’ అని పేర్కొన్నారు. అనంతరం తాను ప్రారంభిస్తానన్న యాప్‌ గురించి కమల్‌ ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. ‘యాప్‌ ప్రారంభించడంలో ఆలస్యమవుతోందని చాలా మంది నాపై కామెంట్లు చేస్తున్నారు. యాప్‌ లాంచ్‌ చేయడం సినిమా విడుదల చేసినంత సులువేం కాదు. ఈ యాప్‌ ప్రజల కోసం. కాబట్టి తొందరపడకుండా ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు. మరోపక్క రజనీ తన పార్టీ గుర్తు, పేరు ప్రకటించడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. బాబా గుర్తును రజనీ పార్టీ గుర్తుగా వాడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రజనీ స్పష్టంచేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com