కోర్టు ముంగిట తితిదే పంచాయితీ

తితిదే అధికారులు కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో కోర్టు మెట్లెక్కారు. నిధుల కేటాయింపు దగ్గర నుంచి… అక్రమాలపై పర్యవేక్షణ లోపించడం, నిర్వహణ లోపాలు బయటపడటం లాంటివి హైకోర్టు వరకు వెళ్లాయి. పలువురు వేసిన వ్యాజ్యాలను హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. కోర్టు సైతం వీరు వేసే పిల్స్‌ను స్వీకరిస్తోంది. తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి తితిదే నిధులను ఇవ్వడం, తిరుమల సిబ్బందిని అక్కడకు పంపి తిరుమలలో స్వామికి జరిగే సేవలనే అక్కడ చేయించేలా గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో లేని ఓ ఆలయానికి నిధులు, సిబ్బందిని ఎలా కేటాయిస్తారని మాంగటి గోపాల్‌రెడ్డి కోర్టులో పిల్‌ వేశారు. దీంతో ఆ ఉత్తర్వుకు కోర్టు స్టే ఇచ్చింది.
* గతేడాది అనకాపల్లిలోని ఓ ఆలయ అభివృద్ధికి కేవలం నోటిమాట ద్వారా తితిదే నిధులు ఇవ్వాలని అనుకున్నారు. రూ.5 కోట్లకు చెక్‌ను సైతం అందజేశారు. దీనిపై గోపాల్‌రెడ్డి హైకోర్టులో రిట్‌ వేయడంతో ఎక్సపెండేచర్‌ విషయంలో బ్రేకులు పడ్డాయి.
* 2016లో తితిదే నిధులతో చెరువులను సుందరీకరించాలని కేవలం జీవో లేకుండానే నోటిమాటతో డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు అందాయి. తితిదేకు సంబంధం లేని వాటి విషయంలో నిధుల ఖర్చు సరికాదని హైకోర్టులో రిట్‌ పడింది. ప్రస్తుతం పనులు ఆగిపోయాయి.
* 2017 జులైలో రేణిగుంట కూడలి నుంచి కల్లూరు వరకు జాతీయ రహదారి సుందరీకరణకు తితిదే నిధులు రూ.10 కోట్లను తుడాకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జాతీయ రహదారుల సందరీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని… తితిదేకు సంబంధం లేదని, తితిదే నిధులు దీనికి ఇవ్వడం ఎందుకని ప్రశ్నిస్తూ పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు నిధులను నిలుపుదల చేయించింది.
* తితిదే నిధులను ధార్మిక సంస్థలకు ఇవ్వకూడదు. హెచ్‌టీపీటీ అనే సంస్థకు రూ.12 కోట్లను గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ మరోసారి నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై కోర్టు స్పందించి నిధుల విడుదల నిలుపుదల చేయించింది.
* స్విమ్స్‌లో మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని తితిదే నిధులతో నడుస్తున్న సంస్థలో జరుగుతున్న అవినీతి తతంగాన్ని గతేడాది నవీన్‌కుమార్‌రెడ్డి లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణలో ఇది నిజమే అని తేలింది.
* ఎస్వీబీసీలో జరిగిన కొన్ని అవకతవకలను తాజాగా కోర్టు తప్పుబట్టింది.
* హోటళ్ల నిర్వహణ, అధిక ధరలపై తిరుపతికి చెందిన భరద్వాజ వేసిన వ్యాజ్యం తీవ్ర చర్చనీయాంశమైంది. హైకోర్టు దీనిపై ప్రత్యక్షంగా కల్పించుకొని.. పిటిషనర్‌కు రక్షణ కల్పించింది. ధరల అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది.

తితిదే తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవ్వడం మాట అటుంచితే…. తితిదేకు ఈ కేసుల నుంచి బయటపడటం పెద్ద తలనొప్పిగా మారుతోంది. దీనికి ఆర్థికంగానూ దెబ్బ పడుతోంది. తితిదే న్యాయప్యానెల్‌ ఉంటుంది. దీనిలో సుమారు 20 మంది న్యాయవాదులు ఉంటారు. కిందిస్థాయి కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు వివిధ కేసులను ప్యానెల్‌లోని న్యాయవాదులు వాదిస్తారు. దీనిలో కొందరు న్యాయవాదులు దేవుడి సేవగా భావించి…. కొన్ని కేసులను కొందరు ఉచితంగా వాదిస్తున్నా… కొన్ని కేసుల్లో ఫీజుల భారం తితిదేపైనే పడుతోంది. ఒక్కో కేసుకు దాని తీవ్రతను బట్టి లక్షల రూపాయల ఫీజు అవుతోంది. ఇక సాక్ష్యాలు చెప్పేందుకు… కోర్టు ముందు హాజరు అయ్యేందుకు అధికారులు పెట్టే ఖర్చులు అదనం. అవి కూడా తితిదేనే భరించాలి. తితిదేపై వేసిన కేసుల్లో పిటిషనర్లకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. భరద్వాజ.. హోటళ్లపై వేసిన పిల్‌, తర్వాత ఆయనకు బెదిరింపులు వచ్చిన విషయం పెద్ద చర్చకు దారి తీసింది. కొన్ని కేసుల్లో అధికారులు పిటిషనర్లతో బతిమలాటలు, మధ్యవర్తిత్వం చేయించడం, మా పరిస్థితి అర్ధం చేసుకోవాలని, ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతోంది. పిల్స్‌ను విత్‌ డ్రా చేసుకోవాలని.. పిటిషనర్లను బతిమాలుకోవడం కూడా విశేషం. ‘‘తమకు నిబంధనలన్నీ తెలుసునని… అయితే కొన్ని కారణాల వల్ల తప్పడం లేదంటూ’’ ఓ అధికారి చెప్పడం విశేషం. ‘‘ఆలయంలో స్వామి నిలబడి… మనల్ని.. మన కుటుంబాల్ని కూర్చొబెట్టి హాయిగా జీవించేలా కాపాడుతున్నాడు’’ అని తితిదేలోని చాలామంది ఉద్యోగులు బలంగా నమ్ముతారు. తితిదేకు స.హ.చట్టం వర్తించదు. అయినా కొన్ని కీలకమైన ఉత్తర్వులు బయటకు వస్తున్నాయంటే ఉద్యోగుల చిత్తశుద్ధే కారణం. ఏదైనా స్వామికి చెందిన కీలక నిర్ణయంలో తప్పు జరిగితే…. చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా స్పందిస్తారు. తమ పరిధిలో కాకుంటే… తిరుపతిలోని సామాజిక వేత్తలకు ఆ విషయం చేరవేసి.. స్వామి నిధులు కాపాడిన ఘనత ఉద్యోగులదే. ఇది ఎన్నో విషయాల్లో బయటపడింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఓ సీనియర్‌ అధికారిని ప్రశ్నించగా… కేవలం మేం అధికారులం మాత్రమే… ఏదైనా ఎదుర్కొవాలి. అన్నీ విషయాలు మా పరిధిలో ఉండవు. ఒక్కోసారి మంచి కోసం చేసే పని కూడా… తప్పు అవుతుందని వ్యాఖ్యానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com