క్రికెట్ ‘దిల్లు’కు సలాం

సనత్‌ జయసూర్య తర్వాత ఆ స్థాయిలో ఓపెనర్‌గా లంక క్రికెట్లో తనదైన ముద్ర వేసిన తిలకరత్నె దిల్షాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇంకో 50 రోజుల్లో 40వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న దిల్షాన్‌.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీసే తన చివరి అంతర్జాతీయ సిరీస్‌ అని తేల్చేశాడు. ఒకప్పుడు విధ్వంసక బ్యాటింగ్‌తో లంక విజయాల్లో కీలక పాత్ర పోషించిన దిల్షాన్‌.. కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ఆట ఆడట్లేదు. ఫామ్‌లో లేకున్నా జట్టును పట్టుకుని వేలాడుతున్నాడంటూ అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలక్టర్ల నుంచి కూడా రిటైర్మెంట్‌ విషయమై ఒత్తిళ్లు రావడంతోనే దిల్షాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో దిల్షాన్‌ విఫలమయ్యాడు. వరుసగా 22, 10 పరుగులు చేశాడు. సిరీస్‌లో మూడో మ్యాచే తన చివరి వన్డే అని ప్రకటించిన దిల్షాన్‌.. ఈ సిరీస్‌ ముగిశాక అదే జట్టుతో రెండు టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్లు ప్రకటించాడు. ఆదివారం జరగబోయేదే అతడి చివరి వన్డే. సెప్టెంబరు 6, 9 తేదీల్లో తన చివరి రెండు టీ20 ఆడనున్నాడు దిల్షాన్‌. వన్డే ఆటగాడిగా ముద్రపడ్డ తిలకరత్నె.. టెస్టుల నుంచి అనధికార రిటైర్మెంట్‌ తీసుకుని చాలా కాలమైంది. 2013లో అతను చివరి టెస్టు ఆడాడు. అప్పట్నుంచి అతడికి టెస్టు జట్టులో చోటు లేదు. టెస్టులకు ప్రత్యేకంగా రిటైర్మెంట్‌ ప్రకటించకపోయినా మొత్తంగా దిల్షాన్‌ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లే. ఆ షాట్‌ అందమే వేరు..: స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి.. కొన్నేళ్ల పాటు ఆ పాత్రలోనే కొనసాగిన దిల్షాన్‌.. డాషింగ్‌ ఓపెనర్‌గా పరిణామం చెందిన తీరు ఆసక్తికరం. ముందు అతణ్ని ఓ బ్యాట్స్‌మన్‌గా ఎవరూ గుర్తించలేదు. చాలా ఏళ్ల పాటు లోయర్‌ మిడిలార్డర్లో బ్యాటింగ్‌ చేస్తూ.. స్పిన్నర్‌గా సేవలందిస్తూ.. ఓ మోస్తరు ఆల్‌రౌండర్‌గా కొనసాగుతూ వచ్చాడు తిలకరత్నె. ఐతే జయసూర్య రిటైరయ్యాక ఓపెనింగ్‌ విషయంలో అనేక ప్రయోగాలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ సిరీస్‌లో దిల్షాన్‌తోనూ ఇన్నింగ్స్‌ ఆరంభించింది లంక జట్టు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దిల్షాన్‌ చెలరేగిపోయాడు. సెహ్వాగ్‌ తరహాలో తొలి బంతి నుంచే దూకుడుగా బ్యాటింగ్‌ చేయడం అలవాటుగా మార్చుకుని ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. బ్యాటింగ్‌లో పేరు తెచ్చుకున్నాక బౌలింగ్‌ను పక్కన పెట్టేశాడు దిల్షాన్‌. 2009 నుంచి మూణ్నాలుగేళ్ల పాటు అతడి హవా సాగింది. మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా లంకకు కీలకంగా మారాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఓపెనర్లలో ఒకడిగా ఎదిగాడు. టీ20 క్రికెట్‌ ప్రవేశంలో కొత్త కొత్త షాట్లు పుట్టుకొస్తున్న తరుణంలో దిల్షాన్‌ ఆవిష్కరించిన స్కూప్‌ షాట్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. వికెట్లకు అడ్డంగా నిలబడి కండువాను భుజం మీదికి వేసుకున్న తరహాలో బ్యాట్‌ను ఉపయోగిస్తూ అతను చేసే స్కూప్‌ సంచలనం రేపింది. దీనికే ‘దిల్‌ స్కూప్‌’ అని పేరొచ్చింది. ఈ షాట్‌ను కొందరు అనుకరించే ప్రయత్నం చేసినా.. విజయవంతం కాలేకపోయారు. దిల్‌ స్కూప్‌.. దిల్షాన్‌కే సొంతం. ఐపీఎల్‌లోనూ ఒకట్రెండేళ్లు తనదైన ముద్ర వేసిన దిల్షాన్‌.. మూణ్నాలుగేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతడి మెరుపులు అరుదైపోయాయి. దిల్షాన్‌ రిటైర్మెంట్‌ గురించి రెండేళ్ల కిందట్నుంచే వూహాగానాలు వినిపిస్తుండగా.. ఎట్టకేలకు అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన 11 మంది ఆటగాళ్లలో దిల్షాన్‌ ఒకడు. చివరగా ఆ ఘనతను అందుకున్నదీ అతడే. సంగక్కర, జయవర్దనె గత ఏడాదే రిటైరయ్యారు. దిల్షాన్‌ కూడా నిష్క్రమించడంతో 90ల ఆటగాళ్లు పూర్తిగా లంక జట్టును వీడినట్లయింది. 40వ పడిలోకి అడుగుపెట్టబోతున్న దిల్షాన్‌.. దేశవాళీ క్రికెట్‌, టీ20 లీగ్‌ల్లో కూడా కొనసాగకపోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com