క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా క్రికెట్ ఆస్ట్రేలియా

అది 1987 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఒక్క వికెట్టే చేతిలో ఉండగా చివరి బంతికి పాక్‌ 2 పరుగులు చేయాలి. బౌలర్‌ వాల్ష్‌ బంతి వేసేలోపే నాన్‌ స్ట్రైకర్‌ క్రీజు వదిలి చాలా ముందుకెళ్లిపోయాడు. వాల్ష్‌ రనౌట్‌ చేస్తే విండీస్‌దే విజయం. కానీ అతను బ్యాట్స్‌మన్‌ను మన్నించి వదిలేశాడు. మ్యాచ్‌లో పాక్‌ గెలిచింది. ఆ ఓటమి విండీస్‌ సెమీస్‌ అవకాశాల్నే దెబ్బ తీసింది.

అది 1981 బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ సిరీస్‌ కప్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌. కివీస్‌ చివరి బంతికి ఆరు పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌.. తన తమ్ముడైన బౌలర్‌ ట్రెవర్‌ చాపెల్‌తో అండర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయించాడు. బంతి పిచ్‌ అయి పైకి లేస్తే బ్యాట్స్‌మన్‌ సిక్సర్‌ బాదేస్తాడేమోనని బంతిని దొర్లించాడు ట్రెవర్‌. పరుగే రాలేదు. ఆస్ట్రేలియా గెలిచింది.

పై రెండు ఉదంతాల్లో ఎంత వ్యత్యాసం? ఆటగాళ్ల ఆలోచనల్లో ఎంత వైరుధ్యం! నాడు విండీస్‌ మ్యాచ్‌ ఓడితేనేమి.. వాల్ష్‌ తన చర్యతో క్రికెట్‌ ప్రపంచం మనసులు గెలిచాడు. అప్పుడు ఆస్ట్రేలియా గెలిస్తేనేమి.. తమ చర్యలతో చాపెల్‌ సోదరులు జనం దృష్టిలో పరాజితులుగా మిగిలారు. క్రీడా స్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయాడు వాల్ష్‌. క్రీడా స్ఫూర్తి మంటగలిసిన సందర్భం ఏదైనా చాపెల్‌ సోదరుల ఉదంతం చర్చల్లోకి వస్తుంది. ఇప్పుడు స్మిత్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రణాళిక ప్రకారం బాల్‌టాంపరింగ్‌కు పాల్పడటం ద్వారా తాము చాపెల్‌లకు ఘనమైన వారసులమని చాటుకుంది. ‘‘నా నాయకత్వంలో ఇలా జరగడమిదే తొలిసారి. ఇకపై ఇలా జరగద’’ంటూ ఘనంగా ప్రకటించాడు స్మిత్‌. మిగతా క్రికెట్‌ ప్రపంచం సంగతలా ఉంచుదాం.. ఆస్ట్రేలియన్లయినా ఈ మాటల్ని నమ్ముతారా అంటే సందేహమే! ఆ దేశ క్రికెటర్లకున్న విశ్వసనీయత అలాంటిది మరి! స్మిత్‌ బృందం అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ప్రతినిధులు, ఆ దేశ మాజీలు ఆశ్చర్యపోతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా క్రికెట్‌ సంస్కృతి తెలిసిన వాళ్లకు స్మిత్‌ బృందం ఇలాంటి పని చేయడం ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. ఏం చేసైనా సరే గెలవాల్సిందే అన్నది దశాబ్దాలుగా ఆస్ట్రేలియా ఆటగాళ్ల నరనరానా జీర్ణించుకుపోయిన సూత్రం! ఆ జట్టు ఆటగాళ్లు గెలుపు కోసం అడ్డదారులు తొక్కడానికి ఏమాత్రం సందేహించరడానికి తాజా రుజువు బాల్‌టాంపరింగ్‌ ఉదంతం! 90ల్లో స్టీవ్‌ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు చాలా ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ఆ జట్టులో ఎటు చూసినా దిగ్గజాలే. ఐతే ఆటతోనే గెలిచే సామర్థ్యం ఆ జట్టుకున్నా సరే.. ప్రత్యర్థులపై మాటల దాడికి దిగడం, వారిని మానసికంగా దెబ్బ తీయడాన్ని తమ ఆట సంస్కృతిలో ఒక భాగంగా మార్చేశారు కంగారూలు. తర్వాతి తరం క్రికెటర్లు ఆటలో ముందు తరాన్ని అందుకోలేకపోయారు కానీ.. స్లెడ్జింగ్‌ దుస్సంప్రదాయాన్ని మాత్రం బాగానే అందిపుచ్చుకున్నారు. మైదానంలో, మైదానం అవతల వారి ప్రవర్తన అంతకంతకూ దిగజారుతోందే తప్ప ఏమాత్రం మెరుగైంది లేదు. ఈ విషయంలో ఆ దేశ క్రికెట్‌ పాలకులు, మాజీలు, మీడియా బాధ్యత కూడా లేకపోలేదు. ప్రవర్తన నియమావళి విషయంలో తమ క్రికెటర్లను అదుపు చేయడం, స్లెడ్జింగ్‌ను నివారించడం లాంటి ప్రయత్నాలు వీరిలో ఎవ్వరూ చేయలేదు.. పైగా ప్రోత్సహించారు! ఏమైనా అంటే దూకుడు ఆస్ట్రేలియా క్రికెట్‌ సంస్కృతి అంటారు. యాషెస్‌ సిరీస్‌ వస్తే అందరూ ఆటగాళ్లను ఉసిగొల్పేవాళ్లే. ప్రపంచ క్రికెట్లో భారత్‌-పాకిస్థాన్‌ పోరును మించిన ఆదరణ దేనికుంటుంది? ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగితే వీక్షకుల సంఖ్య వంద కోట్లు దాటుతుంది. యాషెస్‌ సిరీస్‌ మొత్తం వీక్షకుల సంఖ్య కొన్ని కోట్లే ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా వాళ్లు మాత్రం యాషెస్‌ను మించిన క్రికెట్‌ పోరే లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇందుకోసం ఉద్రేకపు మాటలు, మైదానంలో అతి ప్రవర్తనలకు లెక్కే ఉండదు. యాషెస్‌ అనే కాదు.. ఏ కీలక సిరీస్‌ వచ్చినా ఆస్ట్రేలియా ఆటగాళ్ల అతికి హద్దుండదు. 2008లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ‘మంకీ గేట్‌’ వివాదం తలెత్తినపుడు హద్దులు దాటి ప్రవర్తించిన ఆస్ట్రేలియన్లు.. ‘సిరీస్‌లో ఒక్క జట్టే క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అన్న కుంబ్లే వ్యాఖ్యతో ఎలా ఉడికిపోయారో, ఆత్మరక్షణలో పడ్డారో తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా క్రికెట్లో వివాదాలెన్నెన్నో. బంతి తాకి ప్రాణాలు వదిలిన హ్యూస్‌ ఉదంతంతో చలించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మెక్‌కలమ్‌.. ప్రత్యర్థులతో శత్రుత్వం అనవసరమని, స్నేహపూర్వకంగా ఉండాలని పిలుపునిచ్చి తమ జట్టులో మంచి సంస్కృతిని పెంపొందించాడు. కానీ హ్యూస్‌ సొంత దేశ ఆటగాళ్లలో మాత్రం మార్పు లేదు. అతను చనిపోయిన కొన్ని నెలలకే మైదానంలో తమ నైజాన్ని చూపించారు. లీమన్‌ కోచ్‌గా, స్మిత్‌ కెప్టెన్‌గా బాధ్యతలందుకున్నాక ఆస్ట్రేలియా మరింత దారి తప్పింది. క్రికెటర్‌గా ఉండగా శ్రీలంక ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన చరిత్ర లీమన్‌కు ఉంది. నిరుడు యాషెస్‌ సిరీస్‌ ముంగిట.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను లక్ష్యంగా చేసుకుని, అతను ఏడుస్తూ స్వదేశానికి వెళ్లేలా చూడండంటూ తమ అభిమానులకు పిలుపునిచ్చిన ఘనుడు లీమన్‌. ఇక స్మిత్‌ కెప్టెనయ్యాక పలుమార్లు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి హెచ్చరికలు, జరిమానాలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌లో వైస్‌కెప్టెన్‌ వార్నర్‌.. డికాక్‌ మీదికి ఎలా దూసుకెళ్లాడో తెలిసిందే. ఇలాంటి వాళ్ల నేతృత్వంలో నడుస్తున్న ఆస్ట్రేలియా జట్టు నుంచి ఎలా క్రీడా స్ఫూర్తిని ఆశిస్తాం? టాంపరింగ్‌ లాంటి ఉదంతం చూసి ఎందుకు ఆశ్చర్యపోతాం? అయినా ఏడు టెస్టుల అనుభవమున్న బాన్‌క్రాఫ్ట్‌ టాంపరింగ్‌ బాధ్యతను తనకప్పగించినపుడు ఇది తప్పు కదా అని అడక్కుండా, ఉత్సాహంగా ఆ పని చేయడానికి అంగీకరించాడంటే.. మ్యాచ్‌లో అంపైర్ల ముందు తన నట కౌశలంతో నాటకాన్ని రక్తి కట్టించాడంటే.. ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి సంస్కృతి అలవడిందో, వర్ధమాన ఆటగాళ్లు ఎలాంటి ఆలోచనతో ఆ జట్టులోకి వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com