క్షమించండి…నేను రాలేను.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ చలమేశ్వర్‌ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జస్టిస్‌ జూస్తి చలమేశ్వర్‌ నిర్ణయాలపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. తాజాగా.. సుప్రీంకోర్టు బార్‌ అసోషియేషన్‌ ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాలనుకుంది. కానీ, బార్‌ అసోసియేషన్‌ ఆహ్వానాన్ని జస్టిస్‌ చలమేశ్వర్‌ సున్నితంగా తిరస్కించారు. సుప్రీంలో సీనియర్‌ జడ్జిగా కొనసాగుతున్న జస్టిస్‌ చలమేశ్వర్‌ పదవీకాలం జూన్‌ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ జస్టిస్‌ చలమేశ్వర్‌కు వీడ్కోలు సభ జరపాలని నిర్ణయించింది. వేసవి కాలం సెలవులకు ముందు సుప్రీంకోర్టు చివరి పనిదినం అయిన ఈ నెల 18న ఈ సభ నిర్వహించాలని బార్‌ అసోషియేషన్‌ భావించింది. ఇందుకోసం గతవారం జస్టిస్‌ చలమేశ్వర్‌ను కలిసిన బార్‌ అసోసియేషన్‌ బాధ్యులు తమ నిర్ణయాన్ని తెలిపారు. దీనికి జస్టిస్‌ చలమేశ్వర్‌ అంగీకరించలేదు. బార్‌ అసోషియేషన్‌ సభ్యులు బుధవారం మరోసారి జస్టిస్‌ చలమేశ్వర్‌ని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జస్టిస్‌ చలమేశ్వర్‌ బార్‌ అసోషియేషన్‌ సభ్యులతో మాట్లాడుతూ.. ‘నేను గతంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి బదిలీ అయినప్పడు కూడా ఎటువంటి వీడ్కోలు సభకు ఒప్పుకోలేదు’ అని తెలిపారు. ఈ విషయంపై బార్‌ అసోషియేషన్‌ గౌరవ కార్యదర్శి విక్రాంత్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తమ సభ్యులు సీనియర్‌ జడ్జి అయినటువంటి జస్టిస్‌ చలమేశ్వర్‌ను వీడ్కోలు సభకు ఆహ్వానించినా.. వారు ఒప్పుకోలేదని తెలిపారు. పదవీ విరమణ పొందుతున్న జడ్జీలకు న్యాయస్థానం వేసవి సెలవులకు ముందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ వస్తుందన్నారు. కాగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఈరోజు(బుధవారం) తన విధులకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టు జడ్జీలలో ఒకరు వారం వారం వంతుల వారీగా తమ సొంత రాష్ట్ర వంటకాలను(ఘర్‌ కా ఖానా) ప్రతి బుధవారం ఇతర జడ్జీలతో పంచుకుంటారు. అందరు కలిసి ఒకే చోట లంచ్‌ చేస్తారు. కానీ గత మూడు బుధవారాలు జస్టిస్‌ చలమేశ్వర్‌ కోర్టుకు హాజరుకావడం లేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com