గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ కళ

గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ఎగిరే రోజు దగ్గరపడింది. ప్రస్తుతం విమాన సర్వీసులు నడిపేందుకు ఏమేం అడ్డంకులు ఉన్నాయో.. వాటన్నింటిపైనా అధికారులు దృష్టిసారించారు. విమానాశ్రయంలో ప్రధానమైన ఇమ్మిగ్రేషన్‌ అనుమతులకు ముందడుగు పడింది. ఇమ్మిగ్రేషన్‌, ఎన్‌ఐసీ సహా అన్ని విభాగాల అధికారులు విమానాశ్రయాన్ని శుక్రవారం సందర్శించారు. గతంలో ఉన్న పాత టెర్మినల్‌ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలన్నింటినీ పరిశీలించారు. అధునాతన భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాలు, ఎక్స్‌రే బ్యాగేజీ స్కానింగ్‌ యంత్రాలు, ప్రయాణికుల లోపలికి వచ్చే, బయటకు వెళ్లే మార్గాలు, వేచి ఉండే హాలు, మూడంచెల తనిఖీ విధానం, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ కార్యాలయాలకు ఏర్పాట్లు అన్నింటినీ పరిశీలించారు. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి దేశీయంగానే సర్వీసులు నడుస్తున్నాయి. గత రెండేళ్లలోనే వీటికే.. ప్రయాణికుల సంఖ్య ఐదారు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఏడున్నర లక్షల మందికి పైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడకు చుట్టుపక్కలా కృష్ణా, గుంటూరు సహా నాలుగు జిల్లాల వారికి గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపితే.. ఏడాదిలోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని.. ఇప్పటికే అనేకసార్లు చేపట్టిన సర్వేలలో తేలింది. కానీ.. విదేశాలకు సర్వీసుల విషయంలో జాప్యం జరుగుతూనే వచ్చింది. ఇన్నాళ్లకు అంతర్జాతీయ హోదా వచ్చినా.. అనుకున్నంత వేగంగా ప్రక్రియ ముందుకుసాగడం లేదని స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నడిచేందుకు అవసరమైన టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 2286 మీటర్ల రన్‌వే భారీ విమానాలు నడిచేందుకు సరిపోతుంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుతం విస్తరిస్తున్నారు. ఈ పనులు కూడా వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. విమాన సర్వీసులను రాత్రివేళ ఇక్కడ నిలిపి ఉంచేందుకు అవసరమైన పార్కింగ్‌ బేలు సైతం 16 వరకూ విమానశ్రయంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూసేకరణ కూడా పూర్తయింది. 537 ఎకరాల్లో ఉన్న విమానాశ్రయానికి అదనంగా మరో 700 ఎకరాలను సమకూర్చారు. 160 కోట్లతో నూతన టెర్మినల్‌ భవనం కూడా అందుబాటులోనికి వచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయంలో అన్ని సౌకర్యాలు సమకూరాయి. అంతర్జాతీయ సర్వీసులు నడపడం ఒక్కటే మిగిలింది. ఇదికూడా త్వరితగతిన చేపడితే.. విమానాశ్రయం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది. దీనికి కూడా ప్రక్రియ అంతా పూర్తయినా.. ఇమ్మిగ్రేషన్‌ అనుమతులు ఒక్కటే ఆగాయి. ఇవికూడా ప్రస్తుతం పూర్తయ్యేందుకు అధికారులు చొరవ తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌ నిర్వహణను చూసుకునే బాధ్యతను రాష్ట్ర పోలీసులకే అప్పగించాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా ఇక్కడి పోలీసు సిబ్బందికే శిక్షణ ఇచ్చి ఇమ్మిగ్రేషన్‌ విధులకు కేటాయించనున్నారు. 55 మంది సిబ్బంది కావాలంటూ.. కేంద్రం నుంచి వచ్చిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రాష్ట్ర పోలీసులకు తెలియజేశారు. త్వరలోనే ఈ సిబ్బందిని కేటాయిస్తే.. శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇదొక్కటి పూర్తయితే.. గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ విమానం గాలిలోనికి లేవనుంది. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలంటే ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలే కీలకం. ఒక ప్రయాణికుడు విదేశాల రావాలన్నా.. ఇక్కడి నుంచి వెళ్లాలన్నా ఈ రెండు విభాగాల భద్రతా వలయాన్ని దాటుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏమేం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదనే తనిఖీలన్ని ఇక్కడే జరుగుతుంటాయి. దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాల ఆధారంగా.. ఇది ఆధారపడి ఉంటుంది. పేలుడు పదార్థాలు, బంగారం, వజ్రాలు, కరెన్సీ వంటివి విచ్చలవిడిగా తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. దీనితోపాటూ మాదకద్రవ్యాల నిరోధకానికి సైతం ఇక్కడే అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం కస్టమ్స్‌కు అన్ని చిక్కులు తొలగిపోయాయి. ఇమ్మిగ్రేషన్‌ అనుమతులకు సైతం కీలకమైన అడుగు శుక్రవారం పడింది. ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ హోరా సింగ్‌ స్వయంగా దిల్లీ నుంచి వచ్చి విమానాశ్రయాన్ని పరిశీలించి వెళ్లారు. ముఖ్యమైన కేబుళ్లు వంటివి ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్‌ఐసీ టెక్నికల్‌ డైరెక్టర్‌ మాధవేంద్ర సింగ్‌ కూడా దిల్లీ నుంచి వచ్చారు. వీరితో పాటూ ఎన్‌ఐసీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బి.రాజేందర్‌, విజయవాడ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ బి.వి.రమణకుమార్‌, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) చెన్నై జీఎం పి.కె.శ్రీవాస్తవ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ ఏఏఐ జీఎం జి.ప్రభారన్‌, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ డీజీఎం ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయవాడ డీసీపీ గజరావ్‌ భూపాల్‌, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావుతో పాటూ బీవోఐ, కస్టమ్స్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఏపీటీడీసీ తదితర విభాగాల అధికారులు విమానాశ్రయాన్ని శుక్రవారం పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని, అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఈ అధికారులంతా సంతృప్తి వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com