గాంధీజీని చంపడానికి కుట్ర పన్నారు. అమెరికా నుండి సీల్డు కవరులో ఆధారాలు.

‘‘జాతిపిత మహాత్మాగాంధీ హత్య వెనుక పెద్ద కుట్రే జరిగింది. ఇందుకు సంబంధించి అమెరికా నుంచి నేను తెచ్చిన ఆధారాలను పరిశీలించండి’’ అని- గాంధీ హత్యపై పునఃవిచారణ కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టును పిటిషనర్‌ అభ్యర్థించారు. ముంబయికి చెందిన ‘అభినవ్‌ భారత్‌’ సంస్థ ధర్మకర్తృత్వ మండలి సభ్యుడు డా.పంకజ్‌ ఫడనీస్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుల ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. ‘‘అమెరికా నుంచి తిరిగివస్తూ అక్కడి లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ నుంచి కొన్ని పత్రాలను తీసుకొచ్చాను. వీటిని బట్టి జాతిపిత హత్య వెనుక భారీ కుట్ర జరిగినట్లు అవగతమవుతోంది. అయితే కీలకమైన ఈ పత్రాలను భారత ప్రభుత్వం గతంలో నిషేధించింది. ఈ కేసులో న్యాయవైజ్ఞానిక ఆధారాలను పొందొవచ్చని అమెరికాకు చెందిన అటార్నీ ఒకరు సూచిస్తూ రాసిన లేఖను కూడా చూడండి’’ అని ఫడనీస్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ లేఖను పరిశీలించిన ధర్మాసనం- ఇందులోని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయనీ, సాంకేతికత అభివృద్ధి చెందినందున ఫోరెన్సిక్‌ ఆధారాల సేకరణ సాధ్యమవుతుందని పేర్కొంది. కేసును పునర్విచారించే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామంది. పిటిషనర్‌ సీల్డు కవరులో ఆధారాలను సమర్పిస్తూ- వీటిని భారత ప్రభుత్వం గతంలో నిషేధించిందనీ, దానిని ఎత్తివేయాలని కోరుతూ ముంబయి కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ… వీటిని దరఖాస్తుకు జోడిస్తూ సమర్పించాలని ఆయనకు సూచించింది. మీరు కోర్టుకు ఏదైనా సమర్పించదలిస్తే- వీటిని ఇంతకుముందు ఎందుకు సమర్పించలేదో; మీ కేసుకు సంబంధించి వీటిలో ఏమేం ప్రాధాన్యాంశాలున్నాయో తమకు విస్పష్టం చేయాలంది. ‘ఈ దస్త్రాల సీలును తెరిస్తే… నిషేధిత పత్రాలను తెరచి నేరం చేసినవాడనవుతానేమో’ అని పిటిషనర్‌ సందేహం వ్యక్తంచేశారు. దరఖాస్తుతో పాటు ఆ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని ధర్మాసనం ఆయనను ఆదేశిస్తూ విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com