గిట్టుబాటు ధరలు తెగ్గోసుకుపోతున్నాయి-చలమేశ్వర్ ఆవేదన

దేశ జనాభాకు అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను పండిస్తున్న రైతులను నాశనం చేయవద్దని, వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. ‘‘గతేడాది మినుములకు రూ.12వేల ధర లభించగా ఈ ఏడాది రూ.4వేలు ఉందని ఇటీవల మా ఊరు వెళ్లినప్పుడు రైతులు దిగులు చెందారు. రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గకుండా చూస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు’’ అని ప్రభుత్వాలకు సూచించారు. గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్‌ కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగిన రైతుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘దేశంలో వ్యవసాయం చేసి కోట్లు సంపాదించినవారిని చూడలేదు. ఇది లాభసాటి కాకపోయినా దేశంలో 90శాతం మంది సేద్యంపైనే ఆధార పడుతున్నారు. సేద్యంలో చోటుచేసుకునే పలు కారణాలతో రైతులు ఒడుదొడుకులకు లోనుకావటంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీన్నుంచి బయటపడటానికి తక్కువ వ్యయంతో కూడిన వ్యవసాయంపై అన్నదాతలు దృష్టి సారించాలి. కృత్రిమ వ్యవసాయంలో అనర్థాలు ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయంపై ఇప్పుడే రైతాంగం అవగాహన పెంచుకుంటోంది. ఇది శుభపరిణామం’’ అని చలమేశ్వర్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందాకా తాను ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటానన్నారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com