గుప్పెడు స్థలంలో గంపెడు వ్యవసాయం

మట్టిపిసికే రైతుకు వాట్సాప్‌తో, ఫేస్‌బుక్‌తో పనేంటి? అని మనలాంటోళ్లు అనుకోవచ్చు! ఆయన మాత్రం అలా అనుకోలేదు. యూట్యూబ్‌, యాప్‌, ఫేస్‌బుక్‌ వంటి శక్తిమంతమైన సామాజిక మాధ్యమాల తోడుగా రైతులకు ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’పై చక్కని అవగాహన తీసుకురావడం మొదలుపెట్టారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల సాయంతో ఆధునిక వ్యవసాయ పోకడలపైన వేలాదిమంది కర్షకులకు మేలుకొలుపు పాడుతున్నారు. ఆయనే ‘రైతునేస్తం’ ఫౌండేషన్‌ స్థాపించిన యడ్లపల్లి వెంకటేశ్వర్రావు…

బియ్యం దగ్గర నుంచి ఆకుకూరలు, కాయగూరల వరకు ఏది తినాలన్నా మందులు చల్లనివి దొరకడం అసాధ్యం. కాస్తంత పెరటి స్థలం ఉండి… శ్రద్ధగా, ఓపిగ్గా నాలుగు కాయగూరలు పండించుకుందామంటే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో, రసాయనాలు లేకుండా క్రిమిసంహారకాలను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో మనకు తెలియదు. ఇక నగరాల్లో ఉండే వారి పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పడానికేముంది? ఈ సమస్యలని దృష్టిలో ఉంచుకునే మిద్దెమీద కూడా వ్యవసాయం చేసుకునేలా ‘రూఫ్‌ కిచెన్‌ గార్డెన్‌’ వంటి ఆధునిక వ్యవసాయ విధానాలు సైతం తేలిగ్గా అర్థమయ్యేలా ‘రైతునేస్తం’ యాప్‌ని రూపొందించాం అంటున్నారు వెంకటేశ్వర్రావు.

***అరచేతిలో వ్యవసాయజ్ఞానం…
ఈ యాప్‌ అరచేతిలో ఉంటే వ్యవసాయంలో అ..ఆలు తెలియని ఈ తరం పిల్లలకూ అవగాహన పెరుగుతుంది. వివిధ రకాల వ్యవసాయ పరికరాలతో మొదలు పెట్టి వివిధ రకాల వ్యవసాయ విధానాల గురించి లోతుగా తెలుసుకోవచ్చు. పెద్ద చదువులు చదువుకునీ వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న ‘చదువుకున్న రైతుల’ విజయగాధలెన్నో వీడియోల రూపంలో లభిస్తున్నాయి. మీరే స్వయంగా వ్యవసాయం చేయాలనుకున్నా కావాల్సిన స్పష్టమైన మార్గనిర్దేశం అందుతుంది. చీడపీడల నివారణకు అవసరం అయిన సేంద్రియ మందుల తయారీని చదివి, చూసి స్వయంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రసాయనాలు వాడకుండా చేసే సేంద్రియ వ్యవసాయ విధానం గురించిన ప్రాథమిక సమాచారంతోపాటు.. ఈ రంగంలో విజయాలు సాధించిన కర్షకులతో నేరుగా సంప్రదింపులు చేయొచ్చు. మీకున్న సందేహాలను ప్రశ్నల రూపంలో వారిని అడగొచ్చు. కరివేపాకు, ఆముదం, అనాస, దానిమ్మ, సపోట, కోకో, జీడిమామిడి, గులాబి, జర్బరా వంటి వైవిధ్యమైన పంటల గురించిన సమాచారం చక్కగా తెలుగులో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల దగ్గర నుంచి.. వాతావరణ వివరాల వరకూ సమస్త సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ సాయంతో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మన పంటలని మనమే అమ్ముకోవచ్చు. ఏవైనా సందేహాలు వస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులని అడిగేందుకు వీలుగా ఫోన్‌నంబర్లూ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పాతికవేలమందికిపైగా రైతులు ఈ యాప్‌ని వాడుకుంటున్నారు. ప్లేస్టోర్‌లో రైతునేస్తం పేరుతో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. పేరు, ఊరు, ఫోన్‌నంబరు వంటి వివరాలు అందిస్తేచాలు సేవలు పొందొచ్చు.

***ఆలోచనకు స్ఫూర్తి…
మట్టిని మంచి చేసుకోవాలి.. మొలకని పలకరించాలి. చినుకుతో చెలిమిచేయాలి. వ్యవసాయంలో ఇవి ఓనమాలు. వీటితో మొదలుపెట్టి ఆధునిక వ్యవసాయంలో పట్టా పుచ్చుకోవాలంటే రైతన్నలకు చక్కని మార్గదర్శకం కావాల్సిందే. అందుకే రైతునేస్తం, పశునేస్తం, ప్రకృతినేస్తం వంటి పత్రికలతో పాటు రైతులకు స్వయంగా దగ్గరుండి ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ను స్థాపించా అంటున్నారు వెంకటేశ్వర్రావు. ‘మాది గుంటూరు దగ్గర కొర్నెపాడు గ్రామం. బీకాం చదువుకున్నా. నాన్న వ్యవసాయదారు కావడంతో నాకు వ్యవసాయం కొత్తకాదు. నాకు ఊహతెలిసాక మిర్చీ, పత్తి పంటలే ఎక్కువగా పండించేవాళ్లం. అంతకుముందు వరిగ, రాగులతోపాటు అనేకరకాల తృణధాన్యాలని పండించేవారు. చిన్నప్పుడు నాన్నతో కలిసి పత్తితీతలకు, పొలం పనులకు వెళ్లేవాడిని. అలా సాగులో లోతుపాతులు బాగా తెలిసిన వాడినే. చదువైపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేద్దామనుకున్నా. హైదరాబాద్‌ వచ్చి కొన్నాళ్లపాటు అకౌంటెంట్‌గా పనిచేసిన తర్వాత ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకున్నా. 2004లో… తీవ్రమైన కరవు. ఎటుచూసిన రైతు ఆత్మహత్యలు. మితిమీరిన రసాయనాల వాడకం, దానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటివన్ని అన్నదాతలని ఆత్మహత్యల దిశగా నడిపిస్తున్నాయి. రైతుకి ఎందుకీ పరిస్థితి అని ఆలోచిస్తే… రసాయనాల కోసం ఎక్కువగా డబ్బుని వెచ్చిస్తున్నాడు. ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా పంటకు గిట్టుబాటు ధరలేకపోతే అప్పుల వలలో చిక్కుకుంటున్నాడు. అలాగే గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరికీ పాడి లేదు. పాలు, పెరుగు సైతం కొనుక్కోవాల్సిందే. పూర్వం గట్లమీద కాయగూరలు పెంచుకుని.. స్వచ్ఛమైన, మందులు వేయని తిండితినేవారు. ఇప్పుడు వాటికోసమూ రోడ్డెక్సాలిందే. వీటన్నింటి ఖర్చు నెలకి వేలల్లో. కానీ ఆదాయం చూస్తే అంత ఉండటం లేదు. వాతావారణం అనుకూలిస్తే ఫర్వాలేదు. లేకపోతే అప్పులే మిగులుతున్నాయి. రసాయనాల వాడకం తగ్గించడం కోసం రైతుకు నావంతుగా ఏదైనా చేద్దాం అనుకున్నా. అలా 2005లో ‘రైతునేస్తం’ పత్రికని ప్రారంభించాను. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతుల అనుభవాలను స్వయంగా మాట్లాడి అందించడం మొదలుపెట్టాం. యువతలో వ్యవసాయంపై ఆసక్తి పెంచడం, ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా మరో రెండు పత్రికలూ ప్రారంభించా. వీటికి చక్కని స్పందన వచ్చింది. మరో అడుగు ముందుకేసి ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ స్థాపించా’ అంటున్నారు వెంకటేశ్వర్రావు.

***ఖర్చు తగ్గించాలనే…
కర్షకులు పెట్టుబడులను తగ్గించుకోగలిగితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన అవసరం ఉండదు. ఆనక.. ఆత్మహత్యల పరిస్థితే రాదు. అది సాధ్యం కావాలంటే రైతుకు ఖర్చు గణనీయంగా తగ్గించే ‘జీరో బడ్జెట్‌’ వ్యవసాయ విధానం గురించి తెలియాలంటారు వెంకటేశ్వర్రావు. ఈ జీరోబడ్జెట్‌ విధానాలతో పాటు రైతన్నలకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఆ ప్రయోజనాలు పొందడం ఎలానో కూడా చెబుతున్నారాయన. ఈ మహోద్యమంలో అందరినీ భాగాస్వామ్యం చేయాలనే తపనతో వ్యవసాయ రంగంలో విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, వ్యవసాయ విలేకరులకు సైతం అవార్డులు ఇచ్చి ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.

***ఐదు ఎకరాలని ప్రయోగశాలగా మార్చా…
కొర్నెపాడు గ్రామంలో ఐదెకరాల స్థలంలో వ్యవసాయ ప్రయోగశాలని ఏర్పాటు చేశారు వెంకటేశ్వర్రావు. పత్తి, మిర్చి, కాయగూరలు, తృణధాన్యాలని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి వాటిని రైతులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ప్రతిజిల్లాలోని రైతుల వద్దకు తమ సిబ్బంది పంపి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ అందిస్తున్నారు. ఇంతవరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదొందల గ్రామాల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందించారు. జీవివైవిధ్యాన్ని కాపాడే దిశగా.. హైబ్రిడ్‌ విత్తనాలు కాకుండా అరుదైన దేశి విత్తనాలని సేకరించడం.. అవసరమైన వారికి వాటిని అందుబాటులో ఉంచడం ఈ ఫౌండేషన్‌ లక్ష్యాల్లో ఒకటి. డివీడీలు, యూట్యూబ్‌ల ద్వారా రైతుల అనుభవాలను అందరికీ చేరువ చేస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ వంటి వాటి ద్వారా ఎప్పటికప్పుడు వ్యవసాయ సమాచారాన్ని రైతులకు చేరువచేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com