గూగుల్ సరికొత్త పుంతలు

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ తన అప్లికేషన్లకు మరిన్ని అదనపు సౌలభ్యాలను జోడించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇవాళ జరిగిన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌లో తమ ఉత్పత్తులకు మరింత మెరుగులు, సరికొత్త సాంకేతికతను జోడిస్తూ పలు అప్‌డేట్స్‌ను తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ ‘పి’ వెర్షన్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, జీమెయిల్‌, మ్యాప్స్‌ తదితర వాటిల్లో తీసుకురానున్న మార్పులను వెల్లడించింది. అవేంటో ఓసారి పరిశీలిస్తే..

ఆండ్రాయిడ్‌ ‘పి’
ఆండ్రాయిడ్‌ రాకతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగమే మారిపోయింది. గూగుల్‌ తీసుకొచ్చిన ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇక ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను, సౌలభ్యాలను జోడిస్తూ తదుపరి వెర్షన్‌లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓరియో 8.0 వినియోగంలో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్‌ ‘పి’ని తీసుకురాబోతున్నారు. మార్చిలోనే డెవలపర్‌ ప్రివ్యూ విడుదల చేసినప్పటికీ ఇవాళ జరిగిన కార్యక్రమంలో బీటా వెర్షన్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ సారి కేవలం పిక్సెల్‌ ఫోన్లకు మాత్రమే కాకుండా సోనీ ఎక్స్‌పిరియా ఎక్స్‌ జడ్‌2, షియోమీ ఎంఐ మిక్స్‌ 2ఎస్‌, నోకియా 7 ప్లస్‌, ఒప్పో ఆర్‌15 ప్రొ, వివో ఎక్స్‌ 21, వన్‌ప్లస్‌ 6 మోడళ్లకు కూడా కొత్త వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. కొత్త వెర్షన్‌లో బ్యాటరీ వినియోగంపై గూగుల్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘అడాప్టివ్‌ బ్యాటరీ’ అనే ఫీచర్‌ను అందిస్తోంది. అంతేకాదు ‘అడాప్టివ్‌ బ్రైట్‌ నెస్’లోనూ స్వల్పమార్పులు చేసింది. కొత్త డ్యాష్‌బోర్డు ఫీచర్‌ను ఉపయోగించి ఏ అప్లికేషన్‌ ఎంత సమయం వినియోగిస్తున్నామో తెలుసుకోవచ్చు. ఇక ‘విండ్‌ డౌన్’ ఫీచర్‌ను ఉపయోగించి రాత్రి సమయాల్లో స్క్రీన్‌ని నలుపు తెలుపుల్లోకి మార్చుకోవచ్చు. దీంతో రాత్రి నిద్రించే ముందు ఫోన్‌ వినియోగం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ‌

మరింత ఉపయోగకరంగా ‘మ్యాప్స్‌’
‘మ్యాప్స్‌’ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు తీసుకొస్తూ మరిన్ని సౌలభ్యాలను జోడిస్తున్న గూగుల్ ఈసారి విజువల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ను జోడించింది. దీని ప్రకారం ఇక గూగుల్‌ మ్యాప్స్‌ను వినియోగించే తీరులో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మీరేదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ మీరు ఆ ప్రాంతాన్ని మీ ఫోన్‌ కెమెరా ద్వారా మ్యాప్స్‌లో చూడటం ద్వారా మీరు ఎటు వెళ్లాలో అందుకు సంబంధించిన డైరెక్షన్స్‌ను ఫోన్‌ స్క్రీన్‌పైనే చూపిస్తుంది.

సరికొత్తగా జీమెయిల్‌
గూగుల్‌ తెస్తున్న కొత్త మార్పులతో జీమెయిల్‌లో మెయిల్స్‌ మరింత వేగంగా పంపించవచ్చు. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో స్మార్ట్‌ కంపోజర్‌ మరింత వేగంగా వినియోగదారులకు వాక్యాలను సూచిస్తూ పూర్తి చేస్తుంది. నలుపు-తెలుపు రంగులు మార్చుకునేలా.. ‌ప్రస్తుతం ఉన్న గూగుల్‌ ఫొటోస్‌కు మరికొన్ని ఆసక్తికర ఫీచర్లను సంస్థ జోడించింది. ఓ ఫొటోలోని బ్యాగ్రౌండ్‌ని నలుపు తెలుపుల్లోకి మార్చడంతో పాటు నలుపు తెలుపులో ఉన్న ఫొటోలను కృత్రిమ మేథ సాయంతో రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యాన్ని అందించబోతోంది. ఇక దీంతో పాటు రొటేట్‌, బ్రైటెన్‌, షేర్ వంటి ఆప్షన్లను జోడిస్తోంది.

కొత్తగా ఆరు స్వరాలు..
దాదాపు ప్రతి ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోనూ గూగుల్‌ అసిస్టెంట్‌ ఉంటుంది. ఆరు కొత్త స్వరాలను గూగుల్‌ జోడిస్తోంది. అంతేకాదు కొత్తగా తీసుకొస్తున్న ‘కన్‌టిన్యూయడ్‌ కన్వర్జేషన్‌ ఫీచర్‌’ సాయంతో ఇక ప్రతిసారి ‘హే గూగుల్‌’ అనాల్సిన అవసరం లేదు. అప్లికేషన్‌ డిజైన్‌ను సైతం మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com