గొలుసుకట్టు వలసలకు ప్రతిభతో కళ్లెం

గొప్ప ప్రతిభా నేపథ్యం ఉన్నవారినే అమెరికాలోకి అనుమతించాలని అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం స్పష్టం చేశారు. గొలుసుకట్టు వలసల(చైన్‌ మైగ్రేషన్‌)కు ముగింపు పలకాలని కూడా పిలుపునిచ్చారు. అమెరికా పౌరులుగా లేదా చట్టబద్ధ నివాసిగా ఇప్పటికే ఉన్న వారి ద్వారా కుటుంబసభ్యులు అమెరికాలోకి చట్టబద్ధంగా అడుగుపెట్టవచ్చు. ఈ పద్ధతి చాలా తేలికయిన, వేగవంతమయినది. దీన్నే గొలుసుకట్టు వలసలుగా పిలుస్తున్నారు. ‘‘కెనడా, ఆస్ట్రేలియాలో మాదిరిగా ప్రతిభ ఆధారిత వలస విధానం మనకు ఉండాలి. వలసలకు సంబంధించి ప్రవేశపెట్టే ఏ బిల్లులో అయినా ‘ప్రతిభ’ అనే పదాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నా.’’ అని శ్వేతసౌధంలో తనను కలిసిన రెండు పార్టీల శాసనకర్తల గ్రూప్‌తో ట్రంప్‌ అన్నారు. అమెరికాలోకి వలసలను తగ్గించడానికి ప్రతిభ ఆధారిత వ్యవస్థ ఉండాలని ట్రంప్‌ తరచూ అంటున్న సంగతి తెలిసిందే. ‘‘ప్రస్తుతం మనం అనుమతిస్తున్నట్లు కాకుండా అమెరికాలో ప్రవేశించేవారికి గొప్ప ప్రతిభా నేపథ్యం ఉండాలి.’’ అని శాసనకర్తలతో అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు పలువురు శాసనకర్తల నుంచి మద్దతు లభించింది. గొలుసుకట్టు వలసలను అడ్డుకోవాలంటూ ‘‘ఈ పద్ధతితో ఒకరి వెంబడి చాలా మంది అమెరికాలోకి అడుగుపెడుతున్నారు. వారెవరూ మనకు ఉపయోగపడే పని చేయడం లేదు.’’ అని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా తమ పార్టీలతో వలసలపై చర్చించి ఒక అంగీకారానికి రావాలని కోరారు. సమావేశం అనంతరం శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి సారా శాండర్స్‌ మాట్లాడుతూ సమావేశం విజయవంతమయిందన్నారు. సరిహద్దు భద్రత, గొలుసుకట్టు వలసలు, వీసా లాటరీ, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన లేదా అక్రమంగా ఉండిపోయిన మైనర్‌ పిల్లలపై అనుసరించే విధానం (డీఏసీఏ)పై దృష్టి సారించి, చర్చించాలని సమావేశంలో అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి హెచ్‌1బి వలసదారులు సహాయపడుతున్నారని, నవ్య ఆవిష్కరణ పథానికి వారు ప్రేరకశక్తిగా ఉన్నారని డెమొక్రాట్‌ పార్టీకి చెందిన శాసనకర్త తుల్సి గబార్డ్‌ అన్నారు. హెచ్‌1బి వీసాదారులను బలవంతంగా స్వదేశానికి పంపించేలా నిబంధనలను మార్చే ప్రతిపాదననేమీ పరిశీలించడం లేదని ట్రంప్‌ యంత్రాంగం స్పష్టీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరో భారతీయ అమెరికన్‌ శాసనకర్త రాజా కృష్ణమూర్తి కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏ ప్రక్రియనయినా గరిష్ఠ ఫలితం కోసం నిరంతరం మెరుగుపర్చుకోవచ్చని, ప్రస్తుత హెచ్‌1బి ప్రక్రియను కూడా మెరుగుపర్చుకోవచ్చని, కానీ మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తే చాలా మందిపై ప్రభావం చూపిస్తుందని అలోక్‌ మాడసాని చెప్పారు. గత ఏడాది కేన్సస్‌లో శ్వేత జాతీయుడొకరు జరిపిన విద్వేష పూరిత కాల్పుల్లో అలోక్‌ గాయపడి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com