చంద్రబాబును కూడా కలుస్తా

తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమిళనాడు పర్యటన కొనసాగుతోంది. డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ ముగిసింది. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందన్నారు. దేశాన్ని సుభిక్షమైన ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రభుత్వం ఏర్పాటు కోసమే తన ప్రయత్నమని వివరించారు. భారతదేశం నిజమైన సమాఖ్య వ్యవస్థగా మారాలన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసిరావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘విద్య, వైద్యం, తాగునీరు వంటి అనేక సమస్యలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయి. కేంద్రం విదేశీ వ్యవహారాలపై దృష్టి సారించాలి. జపాన్‌ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి సహకరించేలా లేవు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా అనేక అంశాలపై స్టాలిన్‌తో చర్చించాం. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలి. మేం ఎవరితో కలిసి పనిచేస్తాం.. చేస్తున్నాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మేమెప్పుడు ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పలేదు… మీడియానే ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు. కూటమి ఏర్పాటుపై చంద్రబాబుతోనూ చర్చలు జరుపుతాం. రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై మమతా బెనర్జీతో చర్చించాం. మేం చాలా అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణలో భూ రికార్డులు ప్రక్షాళన చేశాం. రైతులకు ఎకరాకు రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్‌ను ఆహ్వానించాం. కరుణానిధి నాకు మంచి పుస్తకాలు బహూకరించారు’’ అని కేసీఆర్‌ వెల్లడించారు. కేసీఆర్‌ వెంట మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీలు కేశవరావు, వినోద్‌ ఉన్నారు. ఈరోజు రాత్రి చెన్నైలోనే బస చేయనున్న కేసీఆర్‌ రేపు ఉదయం మరి కొందరు నేతలతో సమావేశం కానున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com