*మన ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తడబడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ సంబోధించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. కాగ్ నివేదికపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ తడబడ్డారు. వెంటనే తేరుకున్న హరీశ్ రావు.. సారీ చెబుతూ మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
*విజయసాయి ఆరోపణలపై స్పందించిన లోకేష్
ఎంపీ విజయసాయిరెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ఒక్క ఆరోపణనైనా విజయసాయి నిరూపించగలరా అంటూ మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. తాము చేసిన ప్రతి ఆరోపణను ఆధారాలతో నిరూపిస్తామని, రేపో మాపో జైలుకు వెళ్లే వ్యక్తి తరచూ పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
*పంట నష్టాన్ని అంచనావేయండి
భారీ వర్షాలు, వడగళ్ల వానల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వర్షాల వల్ల జరిగే పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు వాటి ప్రభావంపై సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున వెంటనే నివేదికలు పంపాలని సూచించారు. సీఎంఆదేశాల మేరకు సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు.వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపాలని ఆదేశించారు. అధికార బృందాలు తక్షణమే గ్రామాల్లో పర్యటించాలని సీఎస్ నిర్దేశించారు.
*మోదీ వచ్చాక వాళ్ల ఆస్తులు పెరిగాయి
రాఫెల్ కుంభకోణంపై విచారణ జరిపించాలని సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక అదానీ, అంబానీల ఆస్తులు 80శాతం పెరిగాయన్నారు.15 ఏళ్లలో 3లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్ష, దళిత, లౌకికశక్తులతో ఐక్య పోరాటాలు చేపడతామని…వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళనలు చేయనున్నట్లు సురవరం ప్రకటించారు.
*అరుణ్‌జైట్లీకి క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి కూడా ఆయన సారీ చెప్పారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. ఇప్పటికే మరో మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ అరుణ్ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పడంతో జైట్లీ కేసు వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*తూర్పు తెదేపా నేతల వినూత్న నిరసన
వేంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతిలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏపీని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నడిసంద్రంలో ముంచిందని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం తెదేపా శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు బీచ్ రోడ్డులోని కుంభాభిషేకం జరిగే ప్రాంతం వద్ద సముద్రంలో దిగి నిరసన తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మునకలు వేశారు. ఏపీకి న్యాయం చేయకపోతే తెలుగోడి సత్తా చూపుతామంటూ తొడగొడుతూ శపథం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ.. నమ్మించి మోసగించిన వ్యక్తిని నట్టేట ముంచాడని అంటామని, ఏపీకి మోదీ చేసింది అదే కనుక తామంతా సముద్రంలో మునుగుతూ నిరసన తెలుపుతున్నామని తెలిపారు. నిరసనలో నగర మేయర్ సుంకర పావని, నగర తెదేపా అధ్యక్షుడు తిరుమలకుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
*కర్ణాటకలో కాంగ్రెస్‌పై భాజపా అభియోగపత్రం
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ఐదేళ్లలో పలు అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ ఆరోపించారు. భాజపా ప్రధాన కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేక మీడియా విభాగాన్ని ప్రారంభించిన తరువాత ప్రజా అభియోగ పత్రాన్ని ఆయన విడుదల చేశారు.
*జగన్‌ను ప్రశ్నించిన మంత్రి ప్రత్తిపాటి
రాబోయే తరం గర్వించే విధంగా అమరావతి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చిదిద్దుతుంటే.. డారి భూములు ఇస్తున్నారని వైకాపా అధినేత జగన్ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు పోపూరి శివరామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేకహోదా పోస్టుకార్డు ఉద్యమాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు.
*ఇది మరో జగన్నాటకం
వైకాపా అధ్యక్షుడు జగన్ నాటకాలరాయుడిగా మారారని, ఆయన ప్రసంగం, నడత, హావభావాలు అన్నీ నాటకాల్నే గుర్తు చేస్తున్నాయని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు ధ్వజమెత్తారు. జగన్ రాజకీయం, వ్యాపారాలు, పాదయాత్ర, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం, ఎంపీలు రాజీనామా చేస్తారనడం వంటివన్నీ నాటకాలేనని, ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అనడం మరో జగన్నాటకమని హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.
*తెదేపా ఎంపీలూ దీక్షలో పాల్గొనాలి
‘ఆంధ్రప్రదేశ్ దేశంలో అంతర్భాగం కాదా? మేము దేశ ప్రజలం కాదా? పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయకుంటే పార్లమెంటు ఔన్నత్యం ఏమవుతుంది? ఇది మీకు న్యాయంగా అనిపిస్తోందా?’ అని వైకాపా నేత బొత్స సత్యనారాయణ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
*రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని చూసే..హోదాపై కేంద్రం వెనుకంజ
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పాలనను చూసే ప్రత్యేక హోదా ద్వారా ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సంశయిస్తోందని భాజపా నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
*వేపచెట్టు కింద కూర్చోండి.. జ్ఞానం వస్తుంది- తమిళ నటుడు కమల్ హాసన్
బోధి వృక్షం కింద కూర్చుంటే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్టు.. తూత్తుకుడి జిల్లాలోని కుమారరెడ్డిపురం గ్రామంలోని వేపచెట్టు కింద కూర్చుంటే తమిళనాడు పాలకులకు ప్రజల కష్టాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది.
*ఆ సామర్థ్యం సర్కారుకు లేదు- రాజ్ థాకరే, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు
ప్రశ్నపత్రాలను భద్రంచేసే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు. మళ్లీ పరీక్ష రాసే భారం విద్యార్థుల మీదే పడుతోంది తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏమిటంటే.. మళ్లీ పరీక్ష రాయాల్సిందిగా మీ పిల్లలపై ఒత్తిడి తేవొద్దు.