చంద్రబాబు వైఫల్యాలు 2:- నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ శాఖలు-TNI ప్రత్యేకం


తెలుగుదేశం ప్రభుత్వంలో దిగువ స్థాయి వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. రాజధాని అమరావతిపై చూపుతున్న శ్రద్ధను దిగువ స్థాయిలో ఉన్న పలు ప్రభుత్వ శాఖలను సమర్థవంతంగా పనిచేయించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో రోడ్లు, భవనాలు సైతం చాలా కీలకమైనది. రాష్ట్రంలో ఉన్న లక్షల కిలోమీటర్ల ప్రధాన రహదారులను నిర్మించడం వాటిని పర్యవేక్షించడం, ప్రభుత్వ భవనాలు నిర్మించడం తదితర కార్యకలాపాలు ఈ శాఖ ముఖ్య విధి. ఒకప్పుడు రోడ్లు భవనాల శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. కాంట్రాక్టర్ల వ్యవస్థ కన్నా ముందు ఆర్ అండ్ బీ శాఖా పర్యవేక్షణలోనే రాదారులను నిర్మించేవారు. వాటి మరమ్మత్తులు కూడా ఈ శాఖల ఆధ్వర్యంలోనే జరిపేవారు. వేలాది మంది గ్యాంగ్‌మెన్‌లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రతినిత్యం రోడ్లపైనే ఉండి కొత్త వాటిని నిర్మించడం, పాత వాటికి మరమ్మత్తులు చేయించడం వంటివి చేసేవారు, చేయించేవారు. రోడ్లు, భవనాల శాఖ ఉద్యోగి అంటే అప్పట్లో సమాజంలో మంచి గుర్తింపు ఉండేది. ప్రతి తాలుకా కేంద్రంలో ఆర్ అండ్ బీ కార్యాలయం కోసం ఎకరాల కొద్దీ భూములు కేటాయించి భవనాలు నిర్మించారు. కొన్ని చోట్ల అతిథి గృహాలు నిర్మించారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, ట్యాంకర్లు, రోలర్లు తదితర వాహనాలు, సామగ్రితో ఈ కార్యాలయాల పరిసరాలు సందడిగా ఉండేది.

*** నాటి వైభవం నేడు ఏది?
గత 25సంవత్సరాల నుండి ప్రభుత్వాలు కీలకమైన రోడ్లు, భవనాల శాఖను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టాయి. ఈ శాఖలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. వేలాది మంది గ్యాంగ్‌మెన్లను, వర్క్ ఇన్స్పెక్టర్లను, ఇంజనీరింగ్ సిబ్బందిని ఇతర శాఖలకు బదలాయించారు. కోట్లాది రూపాయల విలువైన వాహనాలను అడ్డగోలుగా పాత ఇనుము కింద అమ్మి పారేశారు. చాలా చోట్ల వస్తు సామాగ్రి అన్యాక్రాంతమైంది. విలువైన భూములు కొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చోట్ల దిక్కూమొక్కు లేని విధంగా ఈ కార్యాలయాలు శిధిలావస్థకు చేరుకొని గత వైభవ చిహ్నాలుగా మిగిలిపోయాయి.

*** ఇదిగో ఉదాహరణ
కృష్ణాజిల్లా తిరువూరులో ఆర్ అండ్ బీ కార్యాలయాలు, అతిధి గృహానికి రెండెకరాల భూమి ఉంది. ప్రస్తుతం విజయవాడ, భద్రాచలం వెళ్ళే జాతీయ రహదారి పక్కనే ఈ కార్యాలయం ఉంది. ఇది కాకుండా సెక్షన్ కార్యాలయం కోసం ప్రధాన రహదారి పక్కనే పట్టణం నడిబొడ్డున దాదాపు ముప్పై సెంట్ల స్థలం ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ అయిదారు కోట్ల రూపాయలపైనే ఉంటుంది. ఈ సెక్షన్ కార్యాలయాన్ని గత నాలుగు సంవత్సరాల నుండి తెరిచే నాథుడే లేకపోవడంతో భవనం శిధిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం స్థలంలో కొంత అన్యాక్రాంతమైంది . జాతీయ రహదారి సమీపంలో ఉన్న రెండెకరాల స్థలంలో ఉన్న కార్యాలయంలో కూడా సిబ్బంది లేక పనులు స్తంభించాయి. ఒకప్పుడు తిరువూరు ఆర్ అండ్ బీ శాఖ పనితీరు అద్భుతంగా ఉండేది. రాష్ట్రానికే ఆదర్శంగా ఇక్కడి సిబ్బంది పనిచేసేవారు. ఇక్కడే ఉన్న ఆర్ అండ్ బీ అతిథిగృహం చాలా సౌకర్యవంతంగా ఉండేది. మంచి ఉద్యానవనం కూడా ఇక్కడ ఉండేది. కోనేరు రంగారావు మంత్రిగా ఉన్న సమయంలో తిరువూరు ఆర్ అండ్ బీ కార్యాలయంతో పాటు అతిథి గృహం కూడా ఓ వెలుగు వెలిగింది. ఈ కార్యాలయం పరిధిలో ఆరు మండలాల్లో ఉన్న రోడ్లను, ప్రభుత్వ భవనాలను పర్యవేక్షించేవారు. దాదాపు నలభై మంది ఉద్యోగులు రాత్రింబవళ్ళు పనిచేసేవారు. అటువంటి ఆర్ అండ్ బీ కార్యాలయం నేడు అనాథగా మారింది. నాలుగేళ్ళ నుండి ఈ శాఖకు శని పట్టింది. ఇక్కడ డీఈగా వచ్చిన వ్యక్తికి మైలవరం అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన విజయవాడ నుండి మైలవరం వచ్చి వెళ్లిపోయేవాడు. ఆయన కూడా పదవీ విరమణ చేసి మూడు నెలలు అవుతోంది.

*** ఆర్ అండ్ బీలో ఇదో వింత!
తిరువూరు ఆర్ అండ్ బీలో ఓ వింత పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడైనా డీఈ స్థానం ఖాళీ అయితే పోరుగునే ఉన్న మరొక డీఈకి బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడ మాత్రం మైలవరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు తిరువూరు డీఈ పోస్టును అదనపు బాధ్యతగా అప్పగించారు. ఆర్ అండ్ బీ చరిత్రలో ఒక ఈఈకి డీఈ పోస్టును ఇన్‌ఛార్జిగా అప్పగించడం ఇదే తొలిసారని ఆ శాఖ ఉద్యోగులు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. వాస్తవానికి ఒక పని జరిగినపుడు డీఈ వేసిన కొలతలను “సూపర్ చెక్” చేయవలసిన బాధ్యత ఈఈపై ఉంటుంది. ప్రస్తుతం రెండు పనులు ఈఈ ఎలా చేస్తారని ఆ శాఖ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ నలుగురు ఏఈలు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇద్దరు ఏఈలు మాత్రమే పనిచేస్తున్నారు. ఒక ఏఈ పోస్టు సంవత్సరం కాలం నుండి, మరొక ఏఈ పోస్టు మూడునెలల నుండి ఖాళీగా పడి ఉంది. కార్యాలయంలో ఉండవలసిన ఆరుగురు సిబ్బందికిగానూ ఒకే ఒక్క జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. నలుగురు అటెండర్లకు గాను ఒక అటెండర్ మాత్రమే ఉన్నాడు. అతిథి గృహం నిర్వహణకు, కార్యాలయానికి ఇరువురు వాచ్‌మెన్లు ఉండవలసి ఉండగా ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకప్పుడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన తిరువూరు ఆర్ అండ్ బీ శాఖలో పనిచేయటం గర్వంగా భావించిన ఆ శాఖ ఉద్యోగులు నేడు ఇక్కడికి రావడానికి ఇష్టపడటం లేదు. ఇది ఒక్క తిరువూరు ఆర్ అండ్ బీ శాఖలోనే కాదు ప్రతి చోటా ఇదే విధమైన పరిస్థితులు నెలకొని ఉన్నట్లు ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కొక్క ఇంజనీరు నాలుగు పోస్టులకు కూడా ఇన్‌ఛార్జిగా ఉన్న సంఘటనలు ఈ శాఖలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్వీర్యం అవుతున్న కీలకమైన రోడ్లు భవనాల శాఖలను పటిష్ఠవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.—కిలారు ముద్దుకృష్ణ, సినీయర్ జర్నలిస్ట్.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com