చట్టానికి ఆమోదం

చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాన్ని కల్పిస్తూ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆదివారం చట్టాన్ని ఆమోదించింది. ఎవరైనా చైనా అధ్యక్షుడిగా రెండుసార్లు మాత్రమే పోటీ చేయాలంటూ ఉన్న నిబంధనలను తొలగించారు. గతంలో దీనిపై చైనా పొలిట్‌ బ్యూరో ఆమోదం తెలపడంతో నేడు జరిగిన ఓటింగ్‌ కేవలం నామమాత్ర తంతుగానే మారింది. మొత్తం 2,964 ఓట్లలో మూడు గైర్హాజరు కాగా.. రెండు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక మిగిలిన ఓట్లన్నీ జిన్‌పింగ్‌కు అనుకూలంగానే పడ్డాయి. చైనాలో అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం ఇచ్చే చట్టాన్ని 1990లో అమల్లోకి తెచ్చారు. కానీ, అక్టోబర్‌లో జరిగిన చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సమావేశంలో జిన్‌పింగ్‌ దేశంలోనే సర్వశక్తిమంతుడిగా ఎదిగారు. ఆయనకు పార్టీ సిద్ధాంతాలను కూడా మార్చే హోదాను కట్టబెట్టారు. దీంతో చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌తో సమానమైన హోదా పొందినట్లైంది. 2023లో షీ పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో అధ్యక్ష పదవికి ఉన్న రెండు పర్యాయాల నిబంధన తొలగించాలని ఫిబ్రవరిలో నిర్ణయించారు. ఆ తర్వాత దీనికి అనుగుణంగా పావులు కదిలాయి. నేడు చైనాలో చట్టప్రకారం సర్వశక్తిమంతమైన కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చైనాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల నిర్వహణకు ఉన్న పరిమితిని తొలగిస్తే రాజరికం ఏర్పడుతుందని ప్రముఖ జర్నలిస్టు లి డటోంగ్‌ విమర్శించారు. దీనిపై కచ్చితంగా పోరాడతామని పేర్కొన్నారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా తమ దేశంలో ఇటువంటివి రావాలని వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com